మావోయిస్టును బతికించేందుకు పోలీసుల రక్తదానం- జార్ఘండ్ లో అరుదైన ఘటన...
పోలీసులు, మావోయిస్టుల మధ్య పోరాటం అంటే ఎలా ఉంటుందో అందరూ ఊహించగలం. అదీ జార్ఘండ్ వంటి నక్సల్ ప్రభావిత రాష్ట్రంలోని అడవుల్లో జరిగే పోరాటాలైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. కానీ అలాంటి చోట జరిగిన ఓ ఎన్ కౌంటర్లో తమ చేతుల్లో గాయపడిన ఓ మావోయిస్టుకు పోలీసులే రక్తదానం చేసి కాపాడితే ఎలా ఉంటుంది. ఎక్కడో అరుదుగా జరిగే ఇలాంటి ఓ ఘటన తాజాగా ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

జార్ఘండ్లో మావోయిస్టుల ఎన్ కౌంటర్
జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భమ్ జిల్లాలో తాజాగా మావోయిస్టులకూ, పోలీసులకూ మధ్య ఓ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ముగ్గురు మావోయిస్టులు చనిపోగా... మరో ఇద్దరు ప్రాణాలతో పట్టుబడ్డారు. వీరిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉంది. సీఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుకు భారీగా రక్తస్రావం జరిగింది. అతన్ని కాపాడేందుకు సింగ్ భమ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మావోయిస్టులు కావడం, అక్కడికెళితే ఎలాంటి సమస్యలు వస్తాయన్న భయంతో స్ధానికులు రక్తదానానికి ముందుకు రాలేదు.

సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల రక్తదానం...
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మావోయిస్టును ఆదుకునేందుకు ఇక చేసేది లేక తనను గాయపరిచిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లే రంగంలోకి దిగారు. రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆస్పత్రి వర్గాలు కూడా అంగీకరించడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు రక్తదానం చేశారు. దీంతో సదరు మావోయిస్తు ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఉన్నతాధికారుల ప్రశంసలు...
విధి నిర్వహణలో భాగంగా కాల్పులు జరిపి, తిరిగి చట్టం ముందు వారిని దోషులుగా నిరూపించేందుకు బతికించాల్సిన తరుణంలో ఏకంగా రక్తదానానికే ముందుకొచ్చిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు ఓం ప్రకాష్ యాదవ్, సందీప్ కుమార్ ను ఉన్నతాధికారులు ప్రశంసించారు. విధి నిర్వహణలో ఎంత నిబద్ధతగా ఉంటారో మానవత్వంలోనూ అంతే నిబద్ధత చూపారని వారిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.