JNU Violence: భారీ ట్విస్టిచ్చిన పోలీసులు.. బయటి నుంచి గుండాలు రాలేదు.. ఐషే కూడా దాడి చేసింది..
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఢిల్లీ జవహరల్ లాల్ యూనివర్సిటీ(జేఎన్యూ)లో హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఈ నెల 5న రాత్రిపూట.. ముసుగులతో వర్సిటీలోకి చొరబడి దాడులు చేసిన వ్యక్తులు.. బయటి నుంచి వచ్చినవాళ్లు కారని.. వర్సిటీ లోపలే ఇంకేదో జరిగి ఉంటుదని.. అదేంటో కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. నాటి దాడిలో స్డూడెంట్ యూనియన్ లీడర్ ఐషే ఘోష్, విద్యార్థులు, టీచర్లు కలిపి మొత్తం 35 మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే.
JNU Violence:లెఫ్ట్ ముసుగులో దాడి చేసింది ఏబీవీపీ వ్యక్తే... నిర్థారించిన ఏబీవీపీ అధ్యక్షుడు

జేఎన్యూలో హింసాయుత
జేఎన్యూలో హింసాయుత ఘటనల కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేస్తోన్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ జాయ్ టిర్కే, ఢిల్లీ పోలీస్ శాఖ పీఆర్వో ఎంఎస్ రంధావా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు బయటపెట్టారు. లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ యూనియన్ల వల్లే జేఎన్యూలో హింస చెలరేగిందని, జనవరి 1 నుంచి 5 వరకు చోటుచేసుకున్న వాస్తవాలకు, జరుగుతున్న ప్రచారానికి పొంతనే లేదని జాయ్ టిర్కే చెప్పారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..
5న విద్యార్థులపై దాడి జరిగిన మాట వాస్తవమేనని అయితే దాడికి పాల్పడ్డ ముసుగు దుండగులు మాత్రం బయటి నుంచి వచ్చినవాళ్లు కాదని, పటిష్టమైన బందోబస్తు, చుట్టూ కాపలాను దాటుకుని బయటివాళ్లు మారణాయుధాలతో లోపలికి ఎంటరయ్యే అవకాశమేలేదని డీసీపీ జాయ్ వివరించారు. కాగా, ఆరోజు కొంత మంది విద్యార్థులు ఫోన్ చేసి దాడి జరుగుతోందని చెప్పారని, పోలీసులు వచ్చేలోపే దుండగులు పారిపోయారని, వాళ్ల కోసం గాలిస్తున్నామని తెలిపారు.

అంతకుముందు కూడా దాడులు..
ఈ నెల 5న సంఘటన జరగడానికంటే ముందు.. వర్సిటీలో చాలా మంది విద్యార్థులపై వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు వరుస దాడులకు పాల్పడ్డారని డీసీపీ చెప్పారు. ‘‘వింటర్ సెమిస్టర్ ఫీజుల రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటామని లెఫ్ట్ సంఘాలు పిలుపునివ్వడమే మొత్తం గొడవకు మూలకారణం. తమ మాట ధిక్కరించి ఫీజులు కట్టేందుకు ముందుకొచ్చారన్న కోపంతో పలువురు విద్యార్థులపై లెఫ్ట్ సంఘాలు దాడి చేశాయి. ఆ దాడుల్లో ఐషే ఘోష్ కూడా పాల్గొన్నారు. గొడవల కారణంగా వర్సిటీ యాజమాన్యం ఫీజుల్ని ఆన్ లైన్ ద్వారా తీసుకునేందుకు సిద్ధంకాగా.. లెఫ్ట్ సంఘాల నేతలు.. సర్వర్ గదిని ధ్వంసం చేశారు''అని డీసీపీ వివరించారు.

మేమే తప్పూ చేయలేదు..
తనతో పాటు తొమ్మిది మంది లెఫ్ట్ సంఘాల విద్యార్థులపై పోలీసులు కేసు పెట్టడాన్ని జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఐషే ఘోష్ ఖండించారు. తమపై దుగడులు దాడి చేసిన దానిపై పోలీసులు ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆమె తెలిపారు. తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా ధీటుగా ఎదుర్కొంటామని, న్యాయం గెలుస్తుందన్న నమ్మకంతో పోరాడుతామని ఐషే అన్నారు.