లోహియాకు ద్రోహం చేయడమే : కాంగ్రెస్తో ఆర్జేడీ జట్టుకట్టడంపై మోదీ
న్యూఢిల్లీ : మండుటెండలో ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరిపోయింది. ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికల వేళ .. ఎత్తుకి పై ఎత్తు కొనసాగుతోండగా ... దేశంలో విభిన్న ప్రాంతీయ పార్టీలు ఒక్కటై బరిలోకి దిగుతున్నాయి. దీంతో ప్రధాని నరేంద్రమోదీ ఆ పార్టీల మూల సిద్ధాంతాన్ని గుర్తుచేశారు.
కాంగ్రెస్తో జట్టు లోహియాకు ద్రోహమే
ప్రముఖ సామాజికవేత్త, దేశంలో యాంటీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేందుకు కృషిచేసిన రాం మనోహర్ లోహియాకు ఆయన వారసులమని చెప్పుకునే నేతలు ద్రోహం చేస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. శనివారం లోహియ జయంతి సందర్భంగా బీహార్ లో లాలు ప్రసాద్ యాదవ్ ఆర్జెడీ, శరద్ యాదవ్ కాంగ్రెస్ తో కలిసి పోటీచేస్తామని ప్రకటించిన సందర్భంగా .. మోదీ వారిపై నిప్పులు చెరిగారు.

కర్ణాటకలో భాగస్వామ్యం
వీటితోపాటు కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మోదీ దుయ్యబట్టారు. మరోవైపు యూపీలో ఎస్పీ, బీఎస్పీ ఒక్కటై పోటీచేయడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
లోహియా, వాజ్ పేయి ఆదర్శం
రాం మనోహర్ లోహియా ప్రజాభిష్టం మేరకు ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసి, ఆయా పార్టీలను ముందుకు నడిపించారని తెలిపారు. తర్వాత వాజ్ పేయి కూడా ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించేందుకు పాటుపడ్డారని కొనియాడారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయిన సందర్బాన్ని గుర్తుచేశారు మోదీ.