ఆఫ్ఘనిస్తాన్ కోసం రంగంలో దిగిన ప్రధాని మోడీ: ఆ అయిదు దేశాలతో కలిసి
న్యూఢిల్లీ: కరడుగట్టిన మత ఛాందసవాదులుగా గుర్తింపు తెచ్చుకున్న తాలిబన్ల పరిపాలనలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్‌లో గడ్డు పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. రోజులు గడుస్తున్నప్పటికీ- అక్కడి స్థితిగతులు మరింత ముదురుతున్నాయే తప్ప మెరుగు పడట్లేదు. ప్రపంచబ్యాంక్, ఐక్యరాజ్య సమితి అందజేస్తోన్న ఆర్థిక సహకారం మీదే ఆధారపడాల్సి వస్తోంది. తాలిబన్ల పరిపాలనలో కొనసాగుతుండటం వల్ల అమెరికా సహా పలు దేశాలు ఆఫ్ఘన్‌పై కఠిన ఆంక్షలను విధించాయి.
కరెన్సీ చలామణి తగ్గింది. ఈ పరిణామాల మధ్య ఆఫ్ఘనిస్తాన్‌ను ఆదుకోవడానికి భారత్ రంగంలోకి దిగుతోంది. ఆఫ్ఘన్ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పూనుకున్నారు. దీనికోసం 30 సంవత్సరాల పాటు అమల్లో ఉండేలా ప్రత్యేకంగా ఓ రోడ్ మ్యాప్‌ను రూపొందించడానికి కసరత్తు మొదలు పెట్టారు. దీనికోసం అయిదు సెంట్రల్ ఆసియా దేశాల సహకారాన్ని తీసుకుంటున్నారు. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కిర్గిజిస్తాన్తో కలిసి ప్రత్యేకంగా ఓ జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దీనికి భారత్-సెంట్రల్ ఆసియా సమ్మిట్‌గా పేరు పెట్టారు.
ఈ వర్చువల్ భేటీకి సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి రీనట్ సంధు వెల్లడించారు.ఆయా దేశాధినేతలు, ప్రధానమంత్రులతో నరేంద్ర మోడీ వర్చువల్ భేటీ అయ్యారు. కస్సిం-జొమాట్ టకయేవ్, షవ్కత్ మిర్జియొయెవ్, ఎమోమలి రెహ్మోన్, గుర్బాంగులి బెర్డిముహామిడో, సదీర్ జపరోవ్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్‌ను అభివృద్ధిపర్చడానికి, ఆ దేశ ప్రజలను ఆదుకోవడానికి 30 సంవత్సరాలకు అవసరమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

దీనికి అవసరమైన అన్ని సహాయ, సహకారాలను తాము అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సమ్మిట్‌ను నిర్వహించాలని సూచించారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌కు అందజేసిన ఆర్థిక, ఇతరత్రా సహకారాలు, అక్కడి అభివృద్ధి, మౌలిక సదుపాయాల గురించి చర్చించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ, వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్‌మ్యాప్‌పై కసరత్తు చేయాలని సూచించారు.
ఆఫ్ఘనిస్తాన్.. భవిష్యత్తులో ఉగ్రవాదులకు షెల్టర్ జోన్లా మారకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉందని మోడీ పేర్కొన్నారు. కౌంటర్ టెర్రరిజానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండేలా కౌంటర్ టెర్రరిజం వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని అన్నారు. ఉగ్రవాదులా ఛాయలు, దాడులు లేనప్పుడే ఆఫ్ఘనిస్తాన్ సమగ్రంగా అభివృద్ధి చెందగలుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.