మమతా బెనర్జీకి షాకిచ్చిన మరో టీఎంసీ నేత ... అటవీశాఖా మంత్రి రాజీబ్ బెనర్జీ రాజీనామా
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి, అటు బిజెపికి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. తాజాగా మమతా క్యాబినెట్లో మంత్రి శుక్రవారం మంత్రి పదవికి రాజీనామా చేయడం మమతా బెనర్జీకి షాక్ అనే చెప్పాలి .
మమతా బెనర్జీ పై ప్రధాని మోడీ ధ్వజం .. ఆమె భావజాలం వల్లే బెంగాల్ నాశనం, రైతులకు నష్టం

పశ్చిమ బెంగాల్ మంత్రి రాజీబ్ బెనర్జీ రాజీనామా
పశ్చిమ బెంగాల్ మంత్రి రాజీబ్ బెనర్జీ మమతా బెనర్జీ మంత్రివర్గానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీబ్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో అటవీ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తన రాజీనామా లేఖలో, కేబినెట్ మంత్రిగా అటవీ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున నేను రాజీనామా చేసినట్లు మీకు తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నానని రాజీబ్ బెనర్జీ సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్ ప్రజలకు సేవ చేయడం గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. ఈ అవకాశం లభించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి, ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ కూడా చేశారు రాజీబ్ బెనర్జీ .

ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన రాజీబ్ బెనర్జీ
ఆయన తన పోస్ట్ లో "నేను మీలో ప్రతి ఒక్కరినీ నా కుటుంబంగా భావించాను అని పేర్కొన్నారు. మీ మద్దతు ఎల్లప్పుడూ తాను మరో అదనపు మైలు వెళ్ళడానికి, మీ సేవలో మంచి మార్గంలో ఉండటానికి నన్ను ప్రేరేపించింది అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అందువల్ల నేను ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ కు అధికారిక రాజీనామాను ప్రకటిస్తున్నాను , ఈ విషయాన్ని సంబంధిత అధిష్టానానికి కూడా తెలియజేశాను అని పేర్కొన్నారు.

అమిత్ షా ఎన్నికల పర్యటనకు ముందు మారుతున్న పశ్చిమ బెంగాల్ రాజకీయం
జనవరి 30 , జనవరి 31 తేదీల్లో అమిత్ షా బెంగాల్ ఎన్నికల పర్యటనకు కొన్ని రోజుల ముందే దోంజూర్ ఎమ్మెల్యే , టీఎంసీ మంత్రి రాజీబ్ బెనర్జీ రాజీనామా చెయ్యటం మమత సర్కార్ కు షాకింగ్ న్యూస్. ఇప్పటికే టీఎం సి మంత్రిగా ఉన్న సువేందు అధికారి టీ ఎం సి కి గుడ్ బై చెప్పి హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో టీఎంసీ నేతలు బీజేపీలోకి వలసల బాట పట్టడం మమతా బెనర్జీ కి తలనొప్పిగా తయారైంది.