కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
2007లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వేసిన శిలాఫలకం చుట్టూ కంప చెట్లు మొలిచాయి

ఆంధ్రప్రదేశ్‌లోని భారీ పరిశ్రమల్లో తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణకు ఇప్పటికే కేంద్రం ప్రతిపాదనలు చేసింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం సొంతంగా కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని సంకల్పించింది.

ఇప్పటికే దశాబ్దంన్నరగా ఈ ప్రతిపాదన నలుగుతోంది. ప్రాజెక్టు పూర్తి మీద ఆశలు పెంచుతూ ముగ్గురు ముఖ్యమంత్రులు దానికి శంకుస్థాపనలు చేశారు. కానీ పరిశ్రమ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు.

ఈ నేపథ్యంలో కడప స్టీల్ ప్రాజెక్ట్ ఏ స్థితిలో ఉందన్నది తెలుసుకునేందుకు బీబీసీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది.

వై.ఎస్.హయంలో తొలి అడుగు...

కడప జిల్లా అనేక రకాల ఖనిజాలకు నెలవుగా ఉంది. ఇప్పటికే యురేనియం మైనింగ్ స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే సాగుతోంది. అదే క్రమంలో పులివెందులకు సమీపంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయి.

2007 జూన్ 10న నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కడప ఉక్కు పరిశ్రమ కోసం భూమిపూజ చేశారు. 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో బ్రహ్మణి ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ ప్రారంభానికి అంబవరం గ్రామ సమీపంలో ఆయన పునాదిరాయి వేశారు.

రూ. 20వేల కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను నిర్మిస్తామని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ 29వేల ఎకరాల్లో నిర్మిస్తే బ్రహ్మణి స్టీల్ ని 10వేల ఎకరాల్లో అదే సామర్థ్యంతో నిర్మిస్తామని వెల్లడించారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 14వేలమంది నిర్వాసితులయ్యారని, కానీ బ్రహ్మణి స్టీల్ కోసం కడప జిల్లాలో ఒక్క ఎకరం భూసేకరణ లేకుండానే అందుబాటు భూమిలో నిర్మాణం జరుపుతామని ప్రభుత్వం అప్పట్లో తెలిపింది.

అంతేగాకుండా సమీపంలోని జమ్మలమడుగులో 4వేల ఎకరాల్లో ఎయిర్ పోర్ట్ ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశలో 10వేల మందికి ఉపాధి లభిస్తుందని నాటి సీఎం వై.ఎస్. హామీ ఇచ్చారు.

బ్రహ్మణి స్టీల్ కంపెనీకి ఎకరం రూ.18వేలచొప్పున 10వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ధారదత్తం చేశారని తెలుగుదేశం పార్టీ అప్పట్లో ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది.

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వస్తే ఉపాధి దొరుకుతుందని స్థానికులు ఆశలు పెట్టుకున్నారు

పునాదితోనే మరిచిపోయారు

ఇప్పటికి పధ్నాలుగేళ్లు గడిచిపోయాయి. కానీ బ్రహ్మణి స్టీల్ పరిశ్రమ నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కంపెనీకి కట్టబెట్టిన భూమి చుట్టూ ప్రహరీ, ఒకటి రెండు భవనాల నిర్మాణం తప్ప అక్కడేమీ లేదు.

వై.ఎస్.ఆర్. శంకుస్థాపన చేసిన ప్రాంతం కూడా పిచ్చిమొక్కలతో నిండిపోయింది. పునాది రాయి ఎక్కడుందో కనుక్కోవడం కూడా కష్టమైంది.

కృష్ణపట్నం ఓడరేవు నుంచి బళ్లారి వరకూ రహదారి నిర్మాణం జరిగినా స్టీల్ ప్లాంట్ నిర్మాణం మాత్రం పడకేసింది. రాజశేఖర్ రెడ్డి తర్వాత వచ్చిన ప్రభుత్వాలుగానీ, ముఖ్యమంత్రులుగానీ దానిపై శ్రద్ధ పెట్టలేదు.

స్టీల్ ఫ్లాంట్ వస్తే ఉపాధి దొరుకుతుందని ఆశపడిన స్థానిక యువత నిరాశలో పడిపోయింది. తమ పూర్వీకులు పశువులు మేపుకుని బతికిన నేలను కంపెనీకి కట్టబెట్టి, పరిశ్రమను మాత్రం పట్టించుకోలేదని వాపోతున్నారు.

''ఇక్కడ కంపెనీ వస్తుందన్న ఆశతో టెక్నికల్ ఎడ్యకేషన్ చదివాను. బీటెక్, పాలిటెక్నిక్ చేసిన వారికి ఉద్యోగాలు వస్తాయని చూశాం. భూములు తీసుకున్నారు, ఊరును తీసేశారు. కానీ పరిశ్రమ లేదు, ఉద్యోగాలు లేవు’’ అని ఆ ప్రాంతానికి చెందిన యువకుడు బాలకృష్ణ బీబీసీతో అన్నారు.

మళ్లీ పదేళ్లకు చంద్రబాబు..

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయంలో నిర్మిస్తామని చెప్పిన ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఇది 2018లో జరిగింది. గండికోట రిజర్వాయర్ ఎగువన ఉన్న కంబాలదిన్నెను ఎంచుకున్నారు.

4వేల ఎకరాల్లోనే స్టీల్ ప్లాంట్ నిర్మించి, వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి తోడ్పడతామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి పూనుకుందని, కేంద్రం సహకరించాలని నాడు సీఎం చంద్రబాబు కోరారు.

రూ.18వేల కోట్లతో 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మిస్తామని వెల్లడించిన ఆయన, లక్షలమందికి ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో ఉపాధి దొరుకుతుందని అన్నారు.

చంద్రబాబు తాను పదవి నుంచి దిగిపోవడానికి ఐదు నెలల ముందు దీనికి శంకుస్థాపన చేశారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. దాంతో ప్రస్తుతం కంబాలదిన్నె స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ప్రాంతం కూడా పాడుబడి కనిపిస్తోంది.

పైగా ఈ ప్రాంతంలో సోలార్ పవర్ జనరేషన్ ప్రాజెక్టుకు వై.ఎస్.జగన్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. ఇది స్థానికులను మరింత నిరాశకు గురి చేస్తోంది.

''మేమంతా జీవాలు మేపుకుని బతుకుతుంటాం. చంద్రబాబు ఇక్కడ స్టీల్ ప్లాంట్ అంటే, జగన్ మరో చోట పెడతామంటున్నారు. ఇక్కడ సోలార్ ప్లాంట్ పెడితే మాకు ఏంటి ఉపయోగం? మా పిల్లలకు ఉపాధి దక్కలేదు. కనీసం జీవాలను ఎక్కడ మేపుకోవాలి?’’ అని బీబీసీతో అన్నారు కంబాలదిన్నె గ్రామవాసి కుమారి.

ప్రాజెక్టు ను పూర్తి చేస్తామని వై.ఎస్. జగన్ ప్రభుత్వం చెబుతోంది

ముచ్చటగా మూడోసారి

వై.ఎస్, చంద్రబాబు తర్వాత మూడోసారి 2019 డిసెంబర్ 23న జగన్ కూడా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ఈ ఫ్యాక్టరీని భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటుకు ఆసక్తిగల సంస్థల నుంచి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌(ఆర్‌ఎఫ్‌పీ) ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

తొలుత దేశంలోని దిగ్గజాలైన టాటా, ఎస్‌ఆర్‌, జిందాల్‌, జేఎస్‌డబ్ల్యూ, వేదాంత సహా ఏడు ఉక్కు కంపెనీలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. వాటి ఆర్థిక అంశాలను పరిశీలించిన తర్వాత భాగస్వామ్య సంస్థను పారదర్శకంగా ఎంపిక చేయడం కోసం గ్లోబల్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.

ప్రాజెక్టు ఏర్పాటుకు వివాదాలులేని 3,500 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని, ఏటా రెండు టీఎంసీల నీరు, నిరంతర విద్యుత్‌, నాలుగు వరుసల రోడ్లు, రైలు మార్గం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్టీల్ ఫ్యాక్టరీని రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల సమీపంలో 3,275.66 ఎకరాలను ప్లాంట్ కోసం కేటాయించారు. దీని కోసం రూ.10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట ఒక ప్రత్యేక కంపెనీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత దానిని వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్ గా పేరు మార్చింది.

కడప స్టీల్ ప్లాంట్ భూములు

ఏడాది దాటినా ఇంకా కష్టాలే...

మూడోసారి, మూడో ముఖ్యమంత్రి చేసిన శంకుస్థాపన తర్వాత పలుమార్లు సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్ పై సమీక్షలు నిర్వహించారు. దాంతో కడప ఉక్కు పరిశ్రమ కార్యరూపం దాల్చుతుందనే ఆశ పలువురిలో కనిపించింది.

కానీ ప్రస్తుతం ఏడాది తర్వాత కూడా నిర్మాణంలో పెద్దగా కదలికలు కనిపించడంలేదనే అభిప్రాయం స్థానికుల్లో ఉంది. ఏడు వారాల్లో భాగస్వామ్య కంపెనీని ఎంపిక చేసి, ఆ తర్వాత 3-4 వారాల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పినా అది కొలిక్కి రాలేదు.

“కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం సహా పారిశ్రామికాభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. ఇటీవల గండికోట రిజర్వాయర్ లో నీటి నిల్వకు మార్గం సుగమం అయ్యింది. ప్రభుత్వం తాత్సారం చేయకుండా కడప స్టీల్ నిర్మాణానికి పూనుకోవాలి, కేంద్రం కూడా సహకరించాలి’’ అని సామాజికవేత్త పి.విశ్వేశ్వర రావు బీబీసీతో అన్నారు.

మూడేళ్లలో ప్రారంభించాలనే యత్నం..

కడప ఉక్కు పరిశ్రమలను వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. వైఎస్సార్ స్టీల్స్ లిమిటెడ్ ఈ ప్లాంట్ నిర్మాణ బాధ్యతను చూస్తోంది. జాయింట్ వెంచర్ (జెవి) కంపెనీలో రూ.3వేల కోట్ల ఈక్విటీ క్యాపిటల్‌ గా పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది.

"2024 మార్చి 31ని కమర్షియల్ ఆపరేషన్స్ డేట్ (కాడ్) గా నిర్ణయించాము. వ్యవస్థాపక సామర్థ్యం 1.50 మిలియన్ టన్నులుగా ఉంటుంది. 3 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 12వేలమందికి ఉపాధి అవకాశాలుంటాయి. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుండి అనుమతుల కోసం రిపోర్ట్ సిద్ధమవుతోంది’’ అని వైఎస్సార్ స్టీల్స్ లిమిటెడ్ ఎండి ఎస్. షాన్ మోహన్ బీబీసీకి తెలిపారు.

''మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. త్వరలోనే అన్నీ కార్యరూపం దాల్చుతాయని ఆశిద్దాం”అని షాన్ మోహన్ తెలిపారు.

దశాబ్దాలుగా డిమాండ్ రూపంలో మిగిలిపోయిన ఈ పరిశ్రమ ఉత్పత్తి దశకు చేరితే కడప జిల్లా వనరుల వినియోగానికి, పారిశ్రామిక రంగం పురోభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని అంతా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kadapa Steel project is yet to be completed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X