• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కడప: సీఎం సొంత జిల్లాలో కోవిడ్ రోగులను ప్రైవేటు ఆసుపత్రులు ఎందుకు చేర్చుకోవడం లేదు

By BBC News తెలుగు
|

కడప

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కడప జిల్లాలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ చికిత్స కోసం వచ్చే వారికి వైద్యం నిరాకరించడం చర్చనీయమవుతోంది.

కరోనా బాధితులను చేర్చుకోబోమంటూ ఏకంగా బోర్డులు కూడా పెట్టడం విమర్శలకు దారితీసింది.

కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ద్వారా చేస్తున్న చెల్లింపులు చాలవని.. అందుకే తాము వైద్య సేవలు అందించడం లేదని కడప జిల్లాలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తేల్చి చెప్పాయి.

కోవిడ్ పేషెంట్స్

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆస్పత్రి వైద్యులతో చర్చలు జరిపింది. ఆస్పత్రుల యాజమాన్యాల డిమండ్ మేరకు ఆస్పత్రులకు చెల్లించే కోవిడ్ చికిత్సల ధరలు పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఎంప్యానెల్ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు పెంచిన ధరలు వర్తింపజేయాలని ఆదేశాలు విడుదలయ్యాయి.

అయితే 'ఎస్మా’, ప్రకృతి విపత్తుల నిర్వహణా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉండగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల ఒత్తిడికి తలొగ్గిందంటూ పలువురు విమర్శిస్తున్నారు.

కడప

ప్రైవేటు ఆసుపత్రులు ఎందుకు వైద్యం నిరాకరించాయి?

కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చింది. అయితే కోవిడ్ బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకుని చికిత్స అందిస్తున్న క్రమంలో వారికి ఇతర సమస్యలు ఎక్కువ కేసుల్లో వస్తున్నాయి.

వీటిలో ఊపరితిత్తులు, గుండెజబ్బులు అత్యధికంగా ఉంటున్నాయి. అలాంటి సందర్భాల్లో కేవలం కోవిడ్ చికిత్సకు వర్తించే ధరలు మాత్రమే తమకు చెల్లిస్తున్నారని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

''కరోనా చికిత్స చాలా కష్టంతో కూడుకున్నది. వైద్యులు, నర్సులు సహా సిబ్బంది కూడా విధులకు రావడం లేదు. వారికి అదనంగా చెల్లించి ఆస్పత్రులు నడుపుతున్నాం.

కానీ దానికి తగిన గుర్తింపు ఉండడం లేదు. పైగా వేధింపులు పెరిగాయి. విజిలెన్స్ దాడులు ఎక్కువయ్యాయి.'' అని కడపకి చెందిన డాక్టర్ కిశోర్‌ రెడ్డి బీబీసీతో అన్నారు.

''రె‌మ్‌డెసివిర్ వంటి మందులు కూడా వీలయినంత వరకూ ప్రభుత్వ ధరలకే అందిస్తున్నాం. కరోనా సమయంలో ఇతర అవయవాలపై ప్రభావం చూపితే దానికి అనుగుణంగా ఆస్పత్రుల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.

దానికి ఆరోగ్యశ్రీ వర్తించదు కాబట్టి ఆస్పత్రులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని పేషెంట్ సంబంధీకులకు కూడా చెబుతున్నాం'' అని ఆయన వెల్లడించారు.

కరోనా సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండడంపై తీవ్ర విమర్శలున్నాయి. పైగా ఇటీవల కొన్ని అత్యవసర మందులను కూడా బ్లాక్ చేసి అధిక ధరలు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపణలు చేశారు.

ఇటీవల విజయవాడలో కోవిడ్ కారణంగా మరణించిన హైకోర్టు ఉద్యోగి కేసులో చికిత్స పేరుతో భారీగా వసూలు చేసి ఆఖరి నిమిషంలో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారంటూ ఆరోపణలు వినిపించాయి. ఇది వివాదంగా మారింది.

కడప

కడపతో పాటుగా జిల్లాలోని పలు పట్టణాల్లో కూడా అదే పరిస్థితి

కరోనా చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రైవేటు ఆసుపత్రులకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందులో కడప జిల్లాలో 17 ఆసుపత్రులున్నాయి.

కడప, ప్రొద్దుటూరు. జమ్మలమడుగు, రాయచోటి పట్టణాల్లోని ఆస్పత్రుల్లో ఏప్రిల్ 29 ఉదయం హఠాత్తుగా కోవిడ్ చికిత్సలు నిరాకరిస్తూ బోర్డులు వెలిశాయి. దాంతో ఈ వ్యవహారం దుమారం రేపింది.

ఆరోగ్యశ్రీ బెడ్స్ ఖాళీగా ఉన్నప్పటికీ అధిక ఫీజులు వసూలు చేసేందుకు కొన్ని ఆస్పత్రులు సాగిస్తున్న దందాపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆస్పత్రులపై దాడులు జరిగాయి.

విజయవాడ, విశాఖ సహా పలు నగరాల్లో ఆస్పత్రులను సీజ్ చేశారు.

''కొన్ని ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విషయంలో కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టు ప్రచారం సాగుతోంది. దాంతో ఆస్పత్రులపై చర్యలకు పూనుకోకుండా అడ్డుకట్ట వేసేందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది'' అని కడపకు చెంది కె.నారాయణ బీబీసీతో అన్నారు.

ఎస్మా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌లు పని చేయవా?

ప్రస్తుతం ఏపీలో ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయిన్‌టెనెన్స్‌ యాక్ట్ (ఎస్మా) అమలులో ఉంది. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగించే వారిపై ఈ చ‌ట్టం కింద చ‌ర్య‌లు తీసుకునే అధికారం ప్ర‌భుత్వానికి ఉంటుంది.

ఈ సేవ‌ల‌లో ఉన్నవారు స‌మ్మెలు కూడా చేయకూడదు. నిబంధ‌న‌లను ఉల్లంఘించి సమ్మె చేస్తే చట్టాన్ని వ్య‌తిరేకించినట్లే.

'ఎస్మా'తోపాటు విపత్తుల నిర్వహణా చట్టం-2005 కూడా అమలులో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను కాపాడేందుకు అవసరమైన అన్ని రకాల సేవలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవచ్చు.

''ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కోవిడ్‌‌కు చికిత్స అందించబోము అంటూ బోర్డులు పెట్టడం చట్టాన్ని ధిక్కరించడమే. ఫలానా రోగులకు చికిత్స చేయబోమని పేర్కొనడం వైద్య విధాన మండలి నైతిక నిబంధనలకు విరుద్ధం. ప్రస్తుతం కోవిడ్ సమయంలో అది నేరం కూడా.’’ అని ప్రజారోగ్య వేదిక ప్రతినిధి డాక్టర్ ఎం.రమేశ్ అభిప్రాయపడ్డారు.

''గత ఏడాది కూడా ప్రారంభంలో అన్ని ప్రైవేటు ఆస్పత్రులను మూసేశారు. ఈసారి తెరిచి ఉంచి ఇలాంటి బ్లాక్ మెయిల్ చేయడం తగదు. వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేయడం ఆశ్చర్యంగా ఉంది.'' అన్నారాయన.

కడప

తప్పు ఒప్పుకొని...

కోవిడ్ చికిత్సలు నిరాకరిస్తూ బోర్డులు పెట్టిన ఆస్పత్రుల యాజమాన్యాలతో స్వయంగా కడప కలెక్టర్ చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఆస్పత్రుల యజమానులు తమ తప్పును అంగీకరించారని కలెక్టర్ హరికిరణ్ బీబీసీతో అన్నారు.

''ప్రైవేట్ వైద్యశాలల యాజమాన్యాలు క్షమాపణలు కోరారు. ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా నడుచుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో 20 ప్రైవేటు ఆస్పత్రులకు కోవిడ్ చికిత్సకు అనుమతులిచ్చాం. మరో 5 ఆస్పత్రులకు కూడా ఇవ్వాలని నిర్ణయించాం.'' అని కలెక్టర్ బీబీసీతో అన్నారు.

''రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు ఉంటాయి. విజిలెన్స్ విచారణ ప్రభుత్వ నిరంతర ప్రక్రియ. దానిని ఆపబోము'' అని కలెక్టర్ అన్నారు.

కడప

ప్రభుత్వానికి కక్ష లేదు..

ప్రైవేట్‌ ఆసుపత్రులలో కరోనా కేసులు చూడబోమని బోర్డులు పెట్టడం సరికాదని, ఆయా ఆస్పతుల్లో వైద్య సేవలు తక్షణం తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్‌ రెడ్డి కోరారు.

''ప్రైవేట్ ఆసుపత్రులను శిక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు బయటి మార్కెట్‌కు వెళుతున్నాయి. వాటిని నిజమైన పేదలకు, అవసరం మేరకు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. అలాంటి లక్ష్యం అమలు కోసమే విజిలెన్స్ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు తప్ప ఎవరిపైనా కక్ష్యపూరితంగా కాదు.'' అని శ్రీకాంత్ రెడ్డి బీబీసీతో అన్నారు.

ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లింపులు పెంపు

కడప జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాల వైఖరిపై విమర్శలు వినిపిస్తుండగానే, ప్రభుత్వం వారి డిమాండ్లకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది.

ప్రభుత్వ ఎంప్యానల్ ఆస్పత్రులకు చెల్లించే కోవిడ్ చికిత్సల ధరలు పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకూ ఈ పెంపుదల వర్తిస్తుందని చెప్పారు.

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు చెల్లించే ధరలు కూడా పెంచాలని, ఎంఎన్ఓల జీతాలు పెంచాలని కూడా సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకుల చర్య తప్పు అని చెబుతూనే, వారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా వారి డిమాండ్లకు అనుగుణంగా ఆదేశాలు రావడం ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kadapa: Why private hospitals are not admitting Covid patients in the CM's own district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X