వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కాందహార్ విమానం హైజాక్

హైజాకర్ల అదుపులో ఉన్న విమానం ఎక్కడైన దిగిందంటే, సాధారణంగా దాని చుట్టూ పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది కనిపిస్తారు. ఆ విమానం దగ్గరికి వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటాయి.

కానీ, రెండు దశాబ్దాల క్రితం అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లోని విమానాశ్రయంలో దీనికి భిన్నమైన దృశ్యాలు కనిపించాయి. హైజాక్ అయిన విమానం అక్కడ దిగిన తర్వాత దాని చుట్టూ వాహనాలు కాదు... ఓ వ్యక్తి సైకిల్‌పై తిరుగుతూ కనిపించాడు.

అది ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం. కొందరు మిలిటెంట్లు దాన్ని హైజాక్ చేశారు. మూడు విమానాశ్రయాల్లో దిగిన తర్వాత చివరికి అది కాందహార్‌కు వచ్చింది.

అఫ్గానిస్తాన్ చరిత్రలో ఆ దేశ రాజధాని కాబూల్‌కు తీసిపోని స్థానం కాందహార్‌ది. అయితే, 90వ దశకానికి ముందు అంతర్జాతీయ మీడియా దృష్టి కాందహార్‌పై అంతగా ఉండేది కాదు.

అయితే ఆ తర్వాత ఈ నగరంలో జరిగిన రెండు పెద్ద ఘటనలు అంతర్జాతీయంగా చర్చనీయమయ్యాయి.

మొదటిది తాలిబాన్లు ఆ నగరంపై నియంత్రణ సాధించడం, రెండోది ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కొందరు మిలిటెంట్లు హైజాక్ చేసి అక్కడికి తీసుకురావడం.

ఈ హైజాక్ ఘటన చాలా సుదీర్ఘంగా సాగింది. మిలిటెంట్లు ఏడు రోజుల పాటు విమానాన్ని తమ నియంత్రణలో ఉంచుకున్నారు.

ఎలా జరిగింది?

1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ814 నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ నుంచి లఖ్‌నవూకు ప్రయాణం ప్రారంభించింది. అందులో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది సిబ్బంది ఉన్నారు.

మీడియా కథనాల ప్రకారం ఆ విమానం భారత గగనతలంలోకి రాగానే ముసుగు ధరించిన ఓ మిలిటెంట్ కాక్‌పిట్ వైపు వెళ్లాడు. విమానాన్ని లాహోర్‌కు తీసుకువెళ్లాలని, లేదంటే బాంబుతో విమానాన్ని పేల్చేస్తానని పైలట్‌ను బెదిరించాడు.

ఆ వెంటనే ముసుగులు ధరించిన మరో నలుగురు మిలిటెంట్లు సీట్లలో నుంచి లేచి, విమానంలోని నాలుగు వేర్వేరు చోట్ల నిల్చున్నారు.

కాందహార్ విమానం హైజాక్

ఎక్కడెక్కడికి వెళ్లారంటే...

విమాన కెప్టెన్ దేవీ శరన్ విమానాన్ని లాహోర్ వైపు మళ్లించారు. అయితే, అందులో ఇంధనం తక్కువగా ఉంది. దీంతో విమానాన్ని అమృత్‌సర్‌లో దించారు.

మీడియా కథనాల ప్రకారం అక్కడ ఆ విమానం ల్యాండ్ అవ్వగానే హైజాకర్లపై చర్యలు తీసుకునేందుకు భద్రత దళాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ విషయాన్ని హైజాకర్లు గ్రహించారు. దీంతో ఇంధనం నింపుకోకుండానే విమానాన్ని లాహోర్ తీసుకువెళ్లేలా పైలట్‌ను బలవంతం చేశారు.

మొదట పాకిస్తాన్ ఆ విమానం దిగేందుకు అనుమతి ఇవ్వలేదు. లాహోర్ విమానాశ్రయంలో లైట్లు కూడా ఆఫ్ చేయించింది. అయితే, ఇంధనం నింపుకునేందుకు ఆ విమానం లాహోర్ విమానాశ్రయంలో దిగడం తప్పనిసరి అయ్యింది. ఆ తర్వాత విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి వచ్చింది.

ఇంధనం నింపుకున్న వెంటనే లాహోర్ విమానాశ్రయం నుంచి విమానం వెళ్లిపోవాలని పాకిస్తాన్ చెప్పింది.

ఆ తర్వాత విమానం దుబయి విమానాశ్రయానికి వెళ్లింది. అక్కడ హైజాకర్లు 27 మంది ప్రయాణికులను విడుదల చేశారు.

మీడియా కథనాల ప్రకారం దుబయి విమానాశ్రయంలో హైజాకర్లపై చర్యలు చేపట్టేందుకు యూఏఈని భారత్ అనుమతి కోరింది. అయితే, యూఏఈ అనుమతి ఇవ్వలేదు. అనంతరం విమానం అఫ్గానిస్తాన్‌లోని రెండో అతిపెద్ద పట్టణమైన కాందహార్‌కు చేరుకుంది. హైజాక్ ఉదంతం ముగిసేవరకూ అక్కడే ఉంది.

కాందహార్‌లో విమానం దిగగానే అక్కడ పాత్రికేయులు పోగవ్వడం పెరిగింది.

బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకు సమీపంలో కాందహార్ ఉంది. దీంతో ముందుగా క్వెట్టాలో అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన పాత్రికేయులు పోగయ్యారు.

క్వెట్టా నుంచి కాందహార్‌కు మొదటగా వెళ్లిన పాత్రికేయుల్లో బీబీసీ పాశ్తో సర్వీస్ ప్రతినిధి అయ్యూబ్ తరీన్ కూడా ఉన్నారు. ఆ తర్వాత సీనియర్ పాత్రికేయుడు శహ్జాదా జుల్ఫికర్, ఏఎఫ్‌పీ వార్తాసంస్థలో పనిచేసిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ బనారస్ ఖాన్ కూడా వెళ్లారు.

తాము అప్పుడు మొదటి రోజు కాందహార్‌లోని ఓ హోటల్‌లో బస చేశామని, అది రంజాన్ మాసమని అయ్యూబ్ తరీన్ గుర్తు చేసుకున్నారు.

''గెడ్డాలు లేని ఈ వ్యక్తులు ఎవరోనని మమ్మల్ని ఆ హోటల్‌లో జనం విచిత్రంగా చూశారు. భారతీయ విమానం హైజాక్ అయ్యి, అక్కడికి వచ్చిందన్న విషయం వారికి అప్పటికి తెలియదు'' అని తరీన్ చెప్పారు.

కాందహార్ విమానం హైజాక్

కాందహార్‌లో విమానాశ్రయానికి సైకిల్ మీద ఓ వ్యక్తి వచ్చి, అలాగే విమానం చుట్టూ తిరగడం తనకు అప్పుడు విచిత్రంగా అనిపించిందని శహ్జాదా జుల్ఫికర్ అన్నారు.

ఆ విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లు చూసుకునే సిబ్బంది సైకిళ్లు, మోటార్ సైకిళ్లనే వాడతారని బనారస్ ఖాన్ చెప్పారు.

''సాధారణంగా ఇలాంటి ఉదంతాల సమయంలో విమానం దగ్గరికి ఆయుధాలతో ఉన్న వాహనాలు వస్తాయి. కఠినమైన భద్రత చర్యలు తీసుకుంటారు. కానీ, అలాంటివేమీ జరగలేదు. సైకిల్ మీద వచ్చి, విమానం చుట్టూ తిరిగిన ఆ వ్యక్తి అక్కడ ఎస్‌హెచ్‌ఓ స్థాయి అధికారి అని నాకు తర్వాత తెలిసింది'' అని శహ్జాదా జుల్ఫికర్ అన్నారు.

కాందహార్ విమానం హైజాక్

ఎముకలు కొరికే చలి, వసతుల లేమి

అప్పుడు కాందహార్‌లో విపరీతమైన చలి ఉందని, విమానాశ్రయం సమీపంలో ఉండేందుకు సరైన ఏర్పాట్లు లేవని శహ్జాదా జుల్ఫికర్ అన్నారు.

''చలి నుంచి తప్పించుకునేందుకు వాహనాల్లో ఉండటం తప్ప మాకు మరో మార్గం లేకపోయింది. అక్కడ ఉన్నన్ని రోజులూ వాహనాలను ఎప్పుడూ ఆన్ చేసే పెట్టుకుని, వాటిలో కూర్చునేవాళ్లం. రెండు, మూడు రోజుల వరకూ నేను కనీసం బూట్లు కూడా తీయలేదు'' అని ఆయన చెప్పారు.

విమానాశ్రయంలో చలి నుంచి తప్పించుకునేందుకు సరైన వసతులు లేవని, అక్కడున్న తాలిబాన్లు ఖాళీ మైదానంలో మంట వేసుకుని, చలి కాచుకునేవారని తరీన్ చెప్పారు. ఆ మంట కూడా విమానానికి అతిదగ్గరగా వేసుకునేవారని అన్నారు.

''విమానం కింద ఇలా ఎవరూ మంట వేయరు. కానీ, తాలిబాన్లు అసలేమీ పట్టించుకోలేదు'' అని ఆయన వివరించారు.

ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి ఆహారం

వసతులతోపాటు అన్నపానీయలకు కూడా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నామని శహ్జాదా జుల్ఫికర్ అన్నారు.

''ఒకట్రెండు రోజులు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ తర్వాత రెడ్ క్రాస్ విమానంలో ఆహారం రావడం మొదలైంది. కొందరు పాత్రికేయులు తినేందుకు నగరానికి వెళ్లి వచ్చేవారు'' అని ఆయన చెప్పారు.

విమానంలో ఉన్నవారి కోసం తాలిబాన్ల నుంచి అన్నపానీయాలు వెళ్లేవని అయ్యూబ్ తరీన్ అన్నారు.

''తాలిబాన్లు పంపే ఆహారపు పొట్లాల్లో రొట్టె, చికెన్ లెగ్ పీస్ వంటివి ఉండేవి. అయితే, ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తినలేమని ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత ఇస్లామాబాద్ నుంచి ఐరాస విమానంలో ఫైవ్ స్టార్ హోటల్ భోజనం తెప్పించే ఏర్పాటు చేశారు'' అని ఆయన వివరించారు.

కమాండో యాక్షన్‌కు ఏర్పాట్లు

''ఒకట్రెండు రోజులు గడిచినా వ్యవహారం పరిష్కారమవుతున్న పరిస్థితి కనిపించలేదు. తాలిబాన్లు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారికి ప్రధానమైన భద్రతాదళం అంటూ లేదు. విమానాశ్రయంలో పనిచేసే తాలిబాన్ సిబ్బందికే వాయుసేన యూనిఫామ్ తొడిగారు. తమకు ఏ నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో తాలిబాన్లు ఏ చర్యా తీసుకోలేదు. వారికి ఇలాంటి సమస్యలను పరిష్కరించిన అనుభవం కూడా లేదు'' అని బనారస్ ఖాన్ అన్నారు.

భారత్ కమాండో యాక్షన్ తీసుకుంటామని కోరినా, అఫ్గానిస్తాన్ అనుమతించలేదు. విదేశీ సైన్యాన్ని తమ భూభాగంలో చర్యలు చేపట్టేందుకు అనుమతించమని చెప్పింది.

కాందహార్ విమానం హైజాక్

విమానంలో చెడిపోయిన ఏసీ

విమానం హైజాక్ అయిన తర్వాత మూడో రోజు విమానంలోని ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ (ఏసీ) పనిచేయడం ఆగిపోయిందని, ప్రయాణికులు ఇబ్బందిపడ్డారని బనారస్ ఖాన్ చెప్పారు.

''భారత సిబ్బంది కాందహార్ విమానాశ్రయానికి వచ్చారు. వారిలో ఇంజినీర్లు కూడా ఉన్నారు. ఒక ఇంజినీర్ లోపలికి వెళ్లి, పని చేసి బయటకు వచ్చారు. లోపల పరిస్థితి ఎలా ఉందని ఆయన్ను పాత్రికేయులు అడిగారు. సమస్య ఉన్న చోటుకు తనను తీసుకువెళ్లారని మాత్రమే ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను బట్టి హైజాకర్లకు విమానం గురించి చాలా అవగాహన ఉందని అర్థమైంది'' అని వివరించారు.

''విమానంలో శుభ్రం చేసేందుకు ఓ వ్యక్తిని హైజాకర్లు లోపలికి రానిచ్చేవారు. ప్రయాణికులు ఎలా ఉన్నారన్నది ఆ వ్యక్తి ద్వారానే తెలిసేది. అయితే, హైజాకర్లు ఆ వ్యక్తిని లోపల ప్రయాణికులతో మాట్లాడనిచ్చేవారు కాదు'' అని శహ్జాదా జుల్ఫికర్ అన్నారు.

అప్పుడు భారత అధికారులు, తాలిబాన్ల మధ్య నిత్యం చర్చలు జరుగుతూనే ఉన్నాయని శహ్జాదా జుల్ఫికర్ అన్నారు.

''హైజాకర్ల షరతులు ఒప్పుకోకుండా ఉండేందుకు భారత అధికారులు చాలా ప్రయత్నించారు. కానీ, అది సాధ్యం కాదని వారికి అర్థమైంది. హైజాకర్ల డిమాండ్లకు అంగీకరించి, మిలిటెంట్లను విడుదల చేయకతప్పలేదు. హైజాక్ వ్యవహారం మొత్తం ముగిసేవరకు భారత అధికారులు, తాలిబాన్ అధికారులు కాందహార్ విమానాశ్రయంలోనే ఉన్నారు. అప్పుడు భారత విదేశాంగ మంత్రిగా ఉన్న జశ్వంత్ సింగ్ రెండు సార్లు కాందహార్ వచ్చారు'' అని ఆయన వివరించారు.

''ఓసారి హైజాకర్లతో సంప్రదింపుల కోసం వచ్చారు. రెండో సారి హైజాకర్లు కోరినట్లుగా మిలిటెంట్లు మౌలానా మసూద్ అజహర్, ముశ్తాక్ జర్గర్, అహ్మద్ ఉమర్ సయీద్ శేఖ్‌లను భారత్‌లోని జైళ్ల నుంచి కాందహార్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు'' అని చెప్పారు.

హైజాక్ ఉదంతానికి తెరపడిన రోజు భారత్ నుంచి కాందహార్‌కు రెండు విమానాలు వచ్చాయని... ఒకదానిలో జశ్వంత్ సింగ్, మరొకదానిలో మసూద్ అజహర్ సహా ముగ్గురు మిలిటెంట్లు ఉన్నారని జుల్ఫికర్ అన్నారు.

కాందహార్ విమానం హైజాక్

అంబులెన్స్‌లో పారిపోయిన హైజాకర్లు

హైజాక్ ఉదంతం ముగిసే సమయంలో విమానం వద్దకి ఓ అంబులెన్స్ వచ్చిందని, ముసుగుల్లో ఉన్న ఐదుగురు హైజాకర్లు దానిలో ఎక్కారని జుల్ఫికర్ చెప్పారు.

''మసూద్ అజహర్ సహా విడుదలైన మిలిటెంట్లను నేను చూశా. వాళ్లు కూడా హైజాకర్లతోపాటు అదే అంబులెన్స్‌లో పారిపోయి ఉంటారు. విమానాశ్రయం నుంచి వాళ్లు ఏవైపు వెళ్లారో తెలియదు. తాలిబాన్లు మాత్రం రెండు గంటల్లోపు అఫ్గానిస్తాన్ దాటి వెళ్లిపోవాలని వారిని ఆదేశించారు'' అని ఆయన వివరించారు.

''హైజాక్ అయిన విమానం దగ్గరే పాత్రికేయులు ఉన్నారు. అయితే, అందులో నుంచి దిగుతున్న ప్రయాణికుల వద్దకు మమ్మల్ని వెళ్లనివ్వలేదు. వాళ్లందరూ మరో విమానం ఎక్కారు. ప్రాణాలతో బయటపడ్డామన్న ఆనందం వారి ముఖాల్లో కనిపించింది'' అని జుల్ఫికర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
21 Years passed for the Kandahar air india plane hijack incident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X