షాకింగ్: సంక్రాంతికి ముందే మంత్రివర్గ విస్తరణ: ముఖ్యమంత్రి అనూహ్య నిర్ణయం: 3+4 ఫార్ములా
బెంగళూరు: మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఈ సారి ఏకంగా ఏడుమంది కొత్త ముఖాలకు కేబినెట్లో చోటు దక్కబోతోంది. దేశ రాజధాని వేదికగా మంత్రివర్గం విస్తరణకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఎవరెవరికి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిందనే విషయం విస్తరణకు ఒక్క రోజు ముందే అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. బుధవారం తన మంత్రివర్గాన్ని విస్తరించబోతోన్నాననే విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు. కొత్తగా ఏడుమందిని తీసుకోబోతోన్నామని తెలిపారు.

రోజంతా హస్తినలో..
రెండు రోజుల కిందటే హస్తినకు వచ్చిన యడియూరప్ప.. పార్టీ అధినేతలను కలుసుకున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తును పూర్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కర్ణాటక ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్లతో భేటీ అయ్యారు. పార్టీ పెద్దల వరుస భేటీలతో యడియూరప్ప రోజంతా తీరిక లేకుండా గడిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల గురించి వారికి వివరించారు. అనంతరం రాత్రి బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. తాను మంత్రివర్గాన్ని విస్తరించబోతోన్నాననే విషయాన్ని వెల్లడించారు.

3+4 ఫార్ములా
మంత్రివర్గ విస్తరణ సందర్భంగా యడియూరప్ప 3+4 ఫార్ములాను అనుసరించబోతోన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణమైన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, సొంత పార్టీకి చెందిన వారిని మంత్రివర్గంలో తీసుకోబోతోన్నట్లు సమాచారం. బీజేపీలో చేరిన కాంగ్రెస్-జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముగ్గురిని కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు. సొంత పార్టీకి చెందిన నలుగురికి బెర్త్ ఇస్తారనే ప్రచారం కర్ణాటకలో జోరుగా సాగుతోంది.

తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో..
కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నుంచి బయటికి వచ్చి.. కాషాయ కండువాను కప్పుకొన్న ఎమ్మెల్యే మునిరత్న, ఎమ్మెల్సీ ఎంటీబీ నాగరాజు, ఆర్ శంకర్లను మంత్రివర్గంలో తీసుకుంటారని చెబుతున్నారు. ఇటీవలే నిర్వహించిన ఉప ఎన్నికల్లో బెంగళూరు పరిధిలోని రాజరాజేశ్వరి నగర నియోజకవర్గం నుంచి మునిరత్న బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక బీజేపీ నుంచి ఉమేష్ కత్తి, అరవింద్ లింబావళి, హాలప్ప ఆచార్, సునీల్ కుమార్, రేణుకాచార్య, బసనగౌడ పాటిల్, ఎస్ఆర్ విశ్వనాథ, ఎమ్మెల్సీ యోగేశ్వర్, పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 27 మందితో కూడిన కర్ణాటక మంత్రివర్గం.. ఈ విస్తరణతో 34కు చేరనుంది.

ఒక లోక్సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
కర్ణాటకలో త్వరలో ఒక లోక్సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి కన్నుమూతతో బెళగావి లోక్సభ, ఎమ్మెల్యే బీ నారాయణరావు మరణంతో బసవకల్యాణ శాసనసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండింటితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ రాజీనామాతో మాస్కీ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉంది. వాటికి నిర్వహించదలిచిన ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థల పేర్లను కూడా ముఖ్యమంత్రి యడియూరప్ప ఖరారు చేసినట్లు చెబుతున్నారు. దీనికి జేపీ నడ్డా నుంచి ఆమోదం లభించిందని తెలుస్తోంది.