అబ్బే అదేం లేదు.. నాయకత్వ మార్పుపై యడియూరప్ప.. ఎమ్మెల్యేల భేటీపై సర్వత్రా ఆసక్తి
కర్ణాటకలో నాయకత్వ మార్పు ఖాయమని.. యడియూరప్పను సీఎం పదవీ నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ రూమర్లపై యడియూరప్ప స్పందించారు. అబ్బే అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని.. పూర్తి కాలం పదవీలో ఉంటానని తేల్చిచెప్పారు. ఎందుకు సందేహా పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

లభించని మోక్షం..
కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు మోక్షం లభించడం లేదు. ఈ క్రమంలోనే జనవరి మొదటి వారంలోనే బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని యడియూరప్ప సోమవారమే మీడియాకు చెప్పారు. జనవరి 4 నుంచి రెండురోజుల జరిగే సమావేశంలో అజెండా ఏమిటి అన్నది తెలియరాలేదు. జనవరి 15వ తేదీ నుంచి రెండురోజులపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భేటీపై సర్వత్రా ఆసక్తి..
జనవరిలో జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకే ఎమ్మెల్యేల సమావేశం జరుగనుందని బీజేపీ వర్గాలు పైకి చెబుతున్నాయి. కానీ అసలు అజెండా వేరే ఉందనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యేల మధ్య రగులుతున్న అసంతృప్తి, నియోజకవర్గ సమస్యలు, నిధుల విడుదలపై ఎమ్మెల్యేలను కూల్ చేసేందుకు యడియూరప్ప రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

సంకేతాలు ఇచ్చినా..
నాయకత్వ మార్పు విషయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి అరుణ్ సింగ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన తర్వాత కూడా పార్టీ అసమ్మతి నేత బసవనగౌడ పాటిల్ యత్నాళ్ కొత్త కథనాలను తెరపైకి తీసుకొచ్చారు. యత్నాళ్ వ్యాఖ్యలను హై కమాండ్ పెద్దలు ఖండించలేదు. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేల సమావేశంలో యడియూరప్ప అనుసరించబోయే వ్యూహం ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

ఇదీ విషయం..
కర్ణాటకలో ఐటీ పార్కుల కోసం కేటాయించిన 4 ఎకరాలకు పైగా భూమిని డీ నోటిఫై చేసి.. గృహ నిర్మాణ అవసరాలకు మళ్లించడం ద్వారా యడియూరప్ప అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరపాలని 2013లో లోకాయుక్త ప్రత్యేక కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. అయితే దానిని కొట్టి వేయాలని సీఎం యడ్యూరప్ప హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. రెండు రోజుల క్రితం కొట్టివేసింది. భూమి కేటాయింపుపై యడియూరప్ప నిర్ణయంపై దర్యాప్తు జరగాల్సిందేనని.. అది పకడ్బందీగా జరిగేలా లోకాయుక్త కోర్టు పర్యవేక్షించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. యడియూరప్ప ఎంతకాలం పదవీలో ఉంటారనే అంశం చర్చనీయాంశమైంది.