సోనియా సన్నిహితుడికి రాజకీయ పునర్జన్మ ఇచ్చిన డీకే, రిటర్న్ గిఫ్ట్ జైలు, అమిత్ షా దెబ్బ!
న్యూఢిల్లీ/బెంగళూరు: సోనియా గాంధీని నమ్మి అహమ్మద్ పటేల్ కు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతిఫలం (రిటర్న్ గిఫ్ట్) ఇదేనా ? అంటూ ఆ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. డీకే. శివకుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తే బీజేపీ అధికార దుర్వినియోగం చేసింది అంటూ ఓ ట్వీట్ చేసి మౌనంగా ఉండిపోయారు అహ్మద్ పటేల్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, అమిత్ షాను ఎదిరించి పోరాడి నేడు అరెస్టు అయిన డీకే. శివకుమార్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ అన్యాయం చేసిందని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
అమిత్ షా దెబ్బకు డీకే. శివకుమార్ జైలుకు పోయారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు.

గుజరాత్ దెబ్బ
అప్పట్లో గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత కేంద్ర హోం హంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహమ్మద్ పటేల్ నువ్వానేనా అంటూ రాజ్యసభ ఎన్నికల విషయంలో చాలెంజ్ చేసుకున్నారు. ఆ రోజు గుజరాత్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికలు, వాటి ఫలితాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది.

పరువు ప్రతిష్ట !
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్బంలో రెండు సీట్లలో బీజేపీ సులభంగా విజయం సాధించే అవకాశం ఉంది. అయితే మూడో వ్యక్తిగా అహమ్మద్ పటేల్ రంగంలోకి దిగారు. అహమ్మద్ పటేల్ ను ఎలాగైనా ఓడించాలని అమిత్ షా కంకణం కట్టుకున్నారు. అమిత్ షా, అహమ్మద్ పటేల్ ఇద్దరూ గుజరాత్ కు చెందిన వారే కావటంతో పోటీ తారాస్థాయికి చేరింది.

అమిత్ షా VS డీకే శివకుమార్
రాజ్యసభ ఎన్నికల్లో అహమ్మద్ పటేల్ ను ఓడించాలని అమిత్ షా ప్లాన్ వేశారు. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద అమిత్ షా కన్ను వేశారు. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం వారిని బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలో ఉన్న ఈగల్టన్ రిసార్టుకు తరలించారు. ఆ రోజు ఎలాగైనా అహమ్మద్ పటేల్ ను గెలిపించాలని డీకే. శివకుమార్ ముందుకు వచ్చి అమిత్ షాను ఎదిరించి ఈగల్టన్ రిసార్టులో గుజరాత్ ఎమ్మెల్యేలను కాపాడుకున్నారు.

అమిత్ షాకు డీకే బ్రదర్స్ చాలెంజ్
ఎలాగైనా మా నాయకుడు అహమ్మద్ పటేల్ ను గెలిపించుకుంటామని ఆ రోజు డీకే. శివకుమార్, ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ అమిత్ షాకు చాలెంజ్ చేశారు. ఈగల్టన్ రిసార్టులో ఉన్న గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి డీకే సోదరులు కళ్లలో ఒత్తులు వేసుకుని వారిని కాపాడుకున్నారు. చివరికి గుజరాత్ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ రోజు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గాంధీనగర్ కు తీసుకెళ్లారు.

అమిత్ షాతో పెట్టుకుంటే జైలు !
అమిత్ షాతో చాలెంజ్ చేసి అహమ్మద్ పటేల్ ను గెలిపించిన డీకే. శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో పవర్ ఫుల్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సోనియా గాంధీ అత్యంత సన్నిహితుల జాబితాలో ఒకరైన అహమ్మద్ పటేల్ కోసం అమిత్ షాతో పోరాడిన డీకే. శివకుమార్ ను ఈ రోజు ఈడీ అరెస్టు చేసి జైలు గేటు దగ్గర నిలబెట్టింది.
రిటర్న్ గిఫ్ట్ ఓ ట్వీట్
కాంగ్రెస్ పార్టీ కోసం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసిన డీకే. శివకుమార్ కోసం ఆ పార్టీ నాయకులు, అహమ్మద్ పటేల్ చివరికి ఇలా తూతూ మంత్రంగా మద్దతు ఇస్తున్నారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. తన కోసం అమిత్ షాతో పోరాటం చేసి అరెస్టు అయిన డీకే. శివకుమార్ కోసం అహమ్మద్ పటేల్ మాత్రం కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగిందని, బీజేపీ అధికార దుర్వినియోగం చేసిందని ఓ ట్వీట్ చేసి సైలెంట్ అయిపోయారు. ఆ రోజు తన కోసం పోరాటం చేసి అరెస్టు అయిన డీకే. శివకుమార్ కు అహమ్మద్ పటేల్ రిటర్న్ గిఫ్ట్ గా ఓ ట్వీట్ ఇచ్చారని డీకేశీ అభిమానులు మండిపడుతున్నారు.