రూ.1,250 కోట్ల కోవిడ్ రిలీఫ్ ప్యాకేజీ: ఏ వర్గానికి ఎంత కేటాయించారంటే?
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోన్న వేళ.. కర్ణాటకలో ఈ మహమ్మారి అదుపులోకి రావట్లేదు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైన తరువాత అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలను నమోదు చేస్తూ వచ్చిన మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లల్లో వాటి తీవ్రత తగ్గుతోండగా.. కర్ణాటకలో పరిస్థితుల్లో పెద్దగా మార్పులేమీ కనిపించట్లేదు. లాక్‌డౌన్ విధించినప్పటికీ- రోజువారీ కేసుల్లో గానీ, మరణాల్లో గానీ ఆశించిన స్థాయిలో తగ్గకపోవడం ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది.

మరోమారు లాక్‌డౌన్
లాక్‌డౌన్ వల్ల అల్పాదాయ వర్గాలు, చిరు వ్యాపారలు, దినసరి వేతన కార్మికులు, రైతులు, ఆటోడ్రైవర్ల, క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున నష్టపోవాల్సిి వచ్చింది. ఈ నెల 24వ తేదీన ముగియాల్సి ఉన్న కంప్లీట్ లాక్‌డౌన్‌ను మరో రెండువారాల పాటు పొడిగించడానికి ముఖ్యమంత్రి యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు సైతం చేపట్టింది. లాక్‌డౌన్ పొడిగింపుపై రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటనను విడుదల చేయనుంది. మరోసారి లాక్‌డౌన్ పొడిగించడం వల్ల పేదలు మరింత ఇబ్బందులకు గురి అవుతారని భావించిన ప్రభుత్వం.. వారికోసం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

రూ.1,250 కోట్ల ప్యాకేజీ..
ఈ ప్యాకేజీ విలువ 1,250 కోట్ల రూపాయలు. లాక్‌డౌన్ వల్ల ఉపాధిని కోల్పోయిన వారందరికీ ఈ ప్యాకేజీ కింద పరిహారాన్ని చెల్లిస్తామని యడియూరప్ప ప్రకటించారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కృష్ణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఏ వర్గానికి ఎంత మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తారనే విషయాన్ని వివరించారు. దీనిపై ఓ సమగ్ర నివేదికను ఆయన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినప్పటికీ.. పేద కుటుంబాలు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు.

రైతులు.. ఆటోడ్రైవర్లు
పండ్లు, కూరగాయలు, పువ్వులను పండించే రైతులకు ప్రతి హెక్టారుకు 10 రూపాయల చొప్పున ఆర్థిక పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులకు 3,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తామని, దీనికోసం 63 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు. మొత్తం 2.10 లక్షలమందికి లబ్ది కలుగుతుందని అన్నారు. చర్మ, చాకలి, కుమ్మరి వంటి అసంఘటిత రంగానికి చెందిన వారితో పాటు వీధి వ్యాపారులు, తోపుడుబండ్ల వ్యాపారులకు 2,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఇస్తామని, దీనికోసం 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు.

పంచాయతీలకు రూ.50 వేలు
లాక్‌డౌన్ వద్ద ఉపాధిని కోల్పోయిన కళాకారులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలను అందివ్వనున్నామని యడియూరప్ప తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ యోజన కింద చౌకధరల దుకాణాల ద్వారా తెల్లరేషన్ కార్డుదారులకు అదనంగా అయిదు కేజీల బియ్యం ఇస్తామని అన్నారు. మే, జూన్‌లను దీని కిందికి చేర్చామని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతోన్న పేద కుటుంబీకుల కోసం 2.6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని, దీనికోసం 956 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని అంచనా వేసినట్లు యడియూరప్ప తెలిపారు. కోవిడ్ నియంత్రణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి 50 వేల రూపాయల అదనపు మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పారు. లైన్‌మెన్, వంటగ్యాస్ డోర్ డెలివరీ సిబ్బంది, టీచర్లను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications