• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కశ్మీరీ వ్యక్తి ఆవేదన: '11 ఏళ్ల జైలు శిక్ష తరువాత నన్ను నిర్దోషి అన్నారు, నేను కోల్పోయిన జీవితాన్ని నాకివ్వండి'

By BBC News తెలుగు
|
బషీర్ అహ్మద్ బాబా

"మొదట్లో నన్ను ఒక చిన్న గదిలో ఒంటరిగా బంధించారు. నా శరీరం అక్కడ ఉందిగానీ మనసు ఇంటి దగ్గరే ఉంది. చాలా ఏళ్ల తరువాత ఓ రాత్రి నాకో కల వచ్చింది. అందులో చుట్టూ ఉన్నవాళ్లందరూ నా తండ్రికి స్నానం చేయిస్తున్నారు. నేను భయపడి లేచిపోయాను. గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్టు నొప్పి. తరువాత అంతా మామూలైపోయింది. కానీ, ఓ రెండు నెలల తరువాత నా వకీలు వచ్చి మా నాన్న ఇంక లేరని చెప్పారు. ఎప్పుడు జరిగింది అని అడిగాను. నాకు కల వచ్చిన రెండు రోజుల తరువాత ఆయన పోయారని చెప్పారు.

శ్రీనగర్‌లోని రైనావారీ ప్రాంతానికి చెందిన బషీర్ అహ్మద్ బాబాను 2010లో గుజరాత్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) అహ్మదాబాద్‌లో అరెస్టు చేసింది.

ఆ సమయంలో ఆయన 'మాయా ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఓ వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి అహ్మదాబాద్‌ వెళ్లారు.

43 ఏళ్ల బషీర్ బాబా సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన తరువాత, శ్రీనగర్‌లో ఒక కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నారు.

మరో పక్క, మొర్రి, అంగిలి వైకల్యం (క్లెఫ్ట్ లిప్ అండ్ పాలెట్)తో పుట్టిన పసివాళ్ల తల్లిదండ్రులకు సహాయం చేసే మాయా ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నారు.

బషీర్ అహ్మద్ బాబా

ఉగ్రవాద కార్యకలాపాలు ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపణలు

"నేను అనేక గ్రామాల్లో ఎన్జీవోకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లతో కలిసి పని చేశాను. మరింత శిక్షణ పొందడం కోసం నన్ను గుజరాత్ రమ్మన్నారు. నేనక్కడ ఎన్జీవోకు చెందిన హాస్టల్‌లో బస చేశాను. ఓరోజు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చి నన్ను, మరికొందరు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని వదిలిపెట్టేశారుగానీ నన్ను గుజరాత్‌లోని బరోడా జైల్లో నిర్బంధించారు" అని బషీర్ బాబా వివరించారు.

బషీర్ దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నాయని, భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు ప్లాన్ వేస్తున్నారని అభియోగాలు మోపారు.

కాగా, గతవారం గుజరాత్ కోర్టు బషీర్ బాబాను నిర్దోషిగా పేర్కొంటూ ఆయనపై ఉన్న అన్ని అభియోగాలను కొట్టివేసింది.

అంతా మారిపోయింది

చాలా కాలం తరువాత బషీర్ బాబా ఇంటికి తిరిగి వచ్చారు. కానీ అక్కడ చాలా మారిపోయింది.

"నా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉన్న చిన్న జాగా మాదే. అది అమ్ముడైపోయిందని నాకిప్పుడే తెలిసింది. మా ఇంటి ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయింది. ఇంటికి నేనే పెద్ద కొడుకుని, నేనేమో జైల్లో ఉన్నాను. మా అమ్మ, నాన్న, సోదరుడు నన్ను కలుసుకోవడానికి గుజరాత్ వస్తూ ఉండేవారు. ప్రయాణాలకు, లాయరు ఫీజులకు చాలా డబ్బు ఖర్చైంది.

మా చెల్లెళ్ల పెళ్లిళ్లు, వాళ్లకు పిల్లలు పుట్టడం.. ఇవన్నీ ఎప్పటికో నాకు ఉత్తరాల ద్వారా తెలిసేది. ఉత్తరాలు చాలా ఆలస్యంగా వచ్చేవి. దానిపైకి అధికారుల దర్యాప్తు వలన మరింత జాప్యం జరిగేది.

అయితే ఎప్పటికైనా నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండేది. కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించడం సంతోషం కలిగించింది. కానీ నేను కోల్పోయిన 11 సంవత్సరాలు నాకు తిరిగి ఎవరిస్తారు?" అని బషీర్ బాబా ప్రశ్నిస్తున్నారు.

జైల్లో ఉంటూనే చదువు కొనసాగించారు

బషీర్ బాబా జైల్లో ఉంటూ పెయింటింగ్ నేర్చుకోవడమే కాక, రాజనీతి శాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీతో సహా మరో మూడు సబ్జెక్టులలో ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయనకు మంచి మార్కులు కూడా వచ్చాయి.

"సిలబస్ పుస్తకాలు నాకు జైలుకే వచ్చేవి. అవి చదువుకుంటూ బిజీగా ఉండేవాడిని. కనీసం నేను నా చదువును పూర్తి చేయగలిగినందుకు సంతోషిస్తున్నాను."

జైలు అధికారులతో తనకు ఎలాంటి ఫిర్యాదులూ లేవని, వారి సత్ప్రవర్తన ఆకట్టుకుందని బషీర్ బాబా చెప్పారు.

అయితే, ఆయన ఒకటే ప్రశ్న మళ్లీ మళ్లీ అడుగుతున్నారు.. "జైల్లో కోల్పోయిన నా పదకొండేళ్ల జీవితాన్ని ఎవరు తిరిగి ఇస్తారు?"

బషీర్‌ను అరెస్టు చేసిన సమయంలో, అప్పటి భారత హోం కార్యదర్శి జి.కె.పిళ్ళై ఈ అరెస్టులను "ఉగ్రవాద కుట్రలను అడ్డుకోవడంలో సాధించిన ఘనకార్యం"గా అభివర్ణించారు.

తాజాగా బషీర్ బాబాను విడిచిపెట్టిన తరువాత పిళ్లై మాట్లాడుతూ.. "ప్రణాళికలు వేసేవాళ్లు ఒక్కరే ఉండరు. అప్పుడప్పుడూ తెలియకుండానే వారికి కొంతమంది సహాయం చేస్తుంటారు. భద్రతా ఏజెన్సీలు అరెస్టులను రెండు భాగాలుగా విభజిస్తే సరిపోతుంది. నేరుగా ప్లాన్ వేస్తున్నవారిని అరెస్ట్ చేయడం, తమకు తెలీకుండా సహాయం చేస్తున్నవారిని పట్టుకోవడం.. ఇలా రెండు వర్గాలుగా అరెస్టులు చేస్తే ఇలాంటివాళ్లు దశాబ్దాల కొద్దీ జైళ్లల్లో మగ్గాల్సిన అగత్యం తప్పుతుంది" అని వ్యాఖ్యానించారు.

అయితే, ఈ విషయాన్ని పిళ్లై చాలా ఆలస్యంగా ప్రకటించారు. బషీర్ బాబా ప్రశ్నకు ఇది ఎంతమాత్రమూ జవాబు కాదు.

బషీర్ అహ్మద్ బాబా

అమ్మకు నమ్మకం ఉంది

"నాకు చాలా ఏడుపు వచ్చింది. జైల్లో మగ్గుతున్న అమాయకులైన పిల్లల పరిస్థితి కళ్లారా చూశాను. కానీ, నా బిడ్డ విడుదల అవుతాడని నాకు కచ్చితంగా తెలుసు. నా బిడ్డ విడుదల కోసం మా చుట్టుపక్కల ఉన్న అన్ని మసీదుల్లోనూ ప్రతీ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు జరిపేవారు" అని బషీర్ తల్లి ముఖ్తా బీబీ చెప్పారు.

30 ఏళ్ల క్రితం కశ్మీర్‌లో జరిగిన సాయుధ తిరుగుబాటు తరువాత, ఉగ్రవాద కార్యకలాపాలను ప్లాన్ చేస్తున్నారంటూ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో డజన్ల కొద్దీ కశ్మీరీ యువకులను అరెస్ట్ చేశారు. వారంతా పది పదిహేనేళ్లు జైళ్లల్లో మగ్గిన తరువాత నిర్దోషులుగా విడుదల అయ్యారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి.

ఇలాంటివారు బయటకు వచ్చిన తరువాత చాలా పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. ఆ పది పదిహేనేళ్లల్లో ప్రపంచం ఎంతో మారిపోయి ఉంటుంది. టెక్నాకజీ, ఇంటర్నెట్, రవాణా మొదలైన అంశాల్లో చాలా వెనుకబడిపోయి ఉంటారు. పోటీ ప్రపంచంలో అందరితో పాటూ ముందుకు కదిలేందుకు వీరికి అడ్దంకులు ఎదురవుతాయి.

అయితే, బషీర్ బాబా ముందే కంప్యూటర్ కోర్సు చేసి ఉండడం, జైల్లో కూడా చదువుకోవడం కారణంగా తాను ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు భావించట్లేదు.

"నా తమ్ముడు నజీర్ బాబా చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. చెల్లెళ్ల పెళ్లిళ్ళు, మా నాన్నకు చికిత్స, ఆయన పోయిన బాధ అన్నీ ఒక్కడే భరించాడు. కోర్టులో నా కేసు విచారణకు హాజరవుతుండడం, ఇంటి బాధ్యతలు.. వీటన్నిటి మధ్య తను వివాహం కూడా చేసుకోలేదు. నువ్వు విడుదల అయిన తరువాత మనిద్దరం ఒకేసారి వివాహం చేసుకుందాం అంటూ నాకు ఉత్తరాల్లో రాసేవాడు" అని బషీర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kashmiri man pleads guilty: 'I was acquitted after 11 years in jail, give me the life I lost'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X