కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామన్న కేజ్రీవాల్ .. దేశమంతా ఉచితంగా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా, ఢిల్లీలోని ప్రజలకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు . లేని పక్షంలో ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ వాసులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను అందిస్తుందని ఆయన వెల్లడించారు.
కోవిషీల్డ్ ఫస్ట్ బ్యాచ్ రవాణాపై సీరం సిఈవో భావోద్వేగం .. ఇండియాలో 13 ప్రాంతాలకు చేరిన వ్యాక్సిన్

ఢిల్లీ వాసుల ఆరోగ్య రక్షణ బాధ్యత తీసుకుంటున్న ప్రభుత్వం
ఇప్పటికే ఒకమారు ఉచిత కరోనా వ్యాక్సిన్ సరఫరాపై హామీ ఇచ్చిన కేజ్రీవాల్, మరోమారు ఈ ప్రకటన చేసి ఢిల్లీ వాసుల ఆరోగ్య రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ గురించి ఎవరూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని తాను అభ్యర్థిస్తునట్లుగా వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు వద్దన్నారు . ఇక కేంద్రానికి సైతం కోవిడ్ వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ఆయన పేర్కొన్నారు.

దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి
కరోనా వైరస్ మహమ్మారిపై ఢిల్లీ ప్రభుత్వం సాగించిన యుద్ధంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ హితేష్ గుప్తా కుటుంబాన్ని పరామర్శించిన కేజ్రీవాల్, కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే ఒక పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు. డాక్టర్ హితేష్ గుప్తా భార్యకు ఢిల్లీ ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు.
కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్న కేజ్రీవాల్ కరోనా వ్యాక్సిన్ ను దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని గతంలో ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

వ్యాక్సినేషన్ కు రెడీ అయిన ఇండియా
ఇక దేశం మొత్తం ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వటం కోసం కోవిషీల్ద్ వ్యాక్సిన్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసిన కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించనుంది . ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16 న ప్రారంభం కానున్నట్టు ప్రధాని మోడీ వెల్లడించారు . కరోనా మహమ్మారిని తరిమికొట్టే వ్యాక్సినేషన్ ను దశల వారీగా ప్రాధాన్యతా క్రమంలో నిర్వహించాలని కేంద్రం వ్యూహం రెడీ చేసింది .