ట్రంప్ దివాళా: పుట్టెడు అప్పులు -వేలానికి లగ్జరీ కారు -కొనేందుకు సిద్ధమైన కేరళ జువెలర్ బాబీ
పుట్టుకతో శ్రీమంతుడు.. తండ్రి ఇచ్చిన ఆస్తిని పదింతలు చేశాడు.. కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా విస్తరింపజేశాడు.. అమెరికాకు అధ్యక్షుడిగా పదవిని అడ్డం పెట్టుకుని తన వ్యాపార లోటుపాట్లను చక్కబెట్టుకున్నాడని కూడా ఆరోపణలున్నాయి.. పదవి నుంచి దిగిపోయాక హాయిగా చింతలేవీ ఉండవని భావించినా.. కరోనా మహమ్మారి రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోవిడ్ కారణంగా ట్రంప్ సంపద దాదాపు రూ.7,400 కోట్లు కరిగిపోయిందని లెక్కలున్నాయి. ట్రంప్ కుటుంబ వ్యాపార సంస్థ ట్రంప్ ఆర్గనైజేషన్‌కు చెందిన చాలా హోటళ్లు దివాళ తీసే పరిస్థితిలో ఉన్నాయని, ఆయన నెత్తిపై పుట్టెడు అప్పులున్నాయని ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే..

వేలానికి ట్రంప్ కారు..
రాబోయే కొన్నేళ్లలో ట్రంప్ దాదాపు మూడు వేల కోట్ల రూపాయల మేర రుణాలు చెల్లించాల్సి ఉంటుందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. నిజానికి తన ఆస్తులతో పోల్చితే, ఇది చిన్న మొత్తమే కావొచ్చు. కానీ కంపెనీలు దివాలా నుంచి తప్పించుకునే పరిస్థితి మాత్రం లేనట్లు తెలుస్తోంది. పైగా, ఈనెల 20న అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక ట్రంప్ మళ్లీ తన వ్యాపారాల విస్తరణపై దృష్టి పెట్టచ్చని భావిస్తున్నా.. క్యాపిటల్ భవంతిపై దాడి కేసులోగానీ, అంతకుముందున్న ఆరోపణల్లోగానీ ఏ ఒక్కటి రుజువైనా న్యాయపరమైన చిక్కులు తప్పవనే వాదన వినిపిస్తోంది. డబ్బుల కోసమో, మరే ఇతర కారణమో కావొచ్చుగానీ, ట్రంప్ తాను అధ్యక్షుడు కాకముదు వాడిన లగ్జరీ కారు ఒకదానిని వేలానికి పెట్టారు..

ట్రంప్ కారుపై బాబీ ఆసక్తి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవిని స్వీకరించేంతవరకు కొంతకాలం వాడిన అతి ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు వేలానికి సిద్ధంగా ఉంది. ప్రపంచం లోని అతి పెద్ద కార్ల వేలం సంస్థల్లో ఒకటైన అమెరికన్ బిడ్డింగ్ వెబ్ సైట్ ‘మెకం ఆక్షన్స్' ట్రంప్ కారును వేలానికి పెట్టనుంది. ఇది.. 2010లో రోల్స్ రాయిస్ ఉత్పత్తి చేసిన 537 స్పెషల్ ఎడిషన్ కార్లలో ఒకటి. ట్రంప్ ఇప్పటికే ఈ కారులో 91,249 కిలోమీటర్లు ప్రయాణించారు. వేలంలో దీని ధర భారీగా పలకొచ్చని అంచనా. అది ఎంత ఖైరీదైనా సరే తాను కొనేస్తానంటున్నాడు కేరళకు చెందిన ప్రముఖ జువెలర్ బాబీ చెమ్మూర్..

బాబీ చెమ్మూర్ స్టైలే వేరు..
ఆభరణాల వ్యాపారంలో బాబీ చెమ్మూర్ది అందెవేసిన చేయి. కేరళ కేంద్రంగా నడిచే ఆయన జువెలరీ వ్యాపార సామ్రాజ్యం డజనుకుపైగా దేశాల్లోనూ విస్తరించి ఉంది. అమెరికాలోని టెక్సాస్ లోనూ ఓ బ్రాంచ్ ఉంది. అంతర్జాతీయ సెలబ్రిటీలపై ఆసక్తితో వారిని తరచూ కలుస్తుంటారు బాబీ చెమ్మూర్. గతంలో కేరళలోనే తన బంగారు ఆభరణాల షో రూమ్ ని ప్రారంభించేందుకు దివంగత ఫుట్ బాల్ లెజెండ్ డీగో మారడోనాను రప్పించిన సందర్భంలో బాబీ వార్తల్లోకెక్కారు. మళ్లీ ఇప్పుడు ట్రంప్ వాడిన లగ్జరీ కారును కొనేందుకు బిడ్ లో పాల్గొంటానని హెడ్ లైన్లలో నిలిచారు. వేలంలో తాను కూడా పాల్గొంటానని, ఇందుకు టెక్సాస్ లోని తన కార్యాలయం అప్పుడే సన్నాహాలు ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. మరి ఆ కారు మన కేరళ బాబీకి దక్కుతుందో లేదో ఇంకొద్ది రోజుల్లో తేలిపోనుంది.