జైలుపై ఐసిస్ ఉగ్ర దాడి... నాయకత్వం వహించింది భారతీయుడే..? వెలుగులోకి సంచలన విషయాలు...
ఆదివారం(అగస్టు 2) సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హర్ ప్రావిన్స్‌లో ఉన్న జలాలాబాద్ జైలుపై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా(ISIS) ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడితో పాటు కాల్పులకు పాల్పడ్డారు. సుదీర్ఘంగా జరిపిన ఈ దాడిలో మొత్తం 29 మంది మృతి చెందారు. అయితే ఈ దాడికి నాయకత్వం వహించింది ఓ భారతీయుడే అన్న విషయం సంచలనం రేపుతోంది. అతనితో పాటు మరో ఇద్దరు భారతీయులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. అలాగే ముగ్గురు ఆఫ్ఘన్లు,ఒక పాకిస్తానీ,ముగ్గురు తాజిక్ ఉగ్రవాదులు సహా మొత్తం 11 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు కథనాలు వస్తున్నాయి.

ఎందుకీ దాడి...
కేరళలోని కసర్గఢ్కి చెందిన కలుకెత్తియ పురయిల్ ఇజస్ నేత్రత్వంలో ఈ దాడి జరిగినట్లు ఆఫ్ఘన్ వర్గాలు భావిస్తున్నాయి. జైల్లో ఉన్న తమ సహచర ఉగ్రవాదులను విడిపించేందుకే ఈ దాడికి పాల్పడినట్లు నంగర్హర్ ప్రావిన్స్ కౌన్సిల్ మెంబర్ అజ్మల్ ఒమర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆఫ్ఘన్ బలగాలకు,ఐసిస్ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరపగా.. మొత్తం 29 మంది మృతి చెందినట్లు తెలిపారు. మృతుల్లో 10 మంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. దాదాపు మరో 50 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.

కలుకెత్తియ ఆత్మాహుతి దాడి...
పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కును నడుపుకుంటూ కలుకెత్తియ పురయిల్ జలాలాబాద్ జైలు ప్రవేశ ద్వారం వద్దకు వచ్చినట్లు ఆఫ్ఘన్ స్థానిక ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి.అక్కడే ట్రక్కుతో పాటు కలుకెత్తియ పురయిల్ తనను తాను పేల్చేసుకున్నట్లు వెల్లడించాయి. అదే సమయంలో మిగతా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. దాడికి తామే బాధ్యులమని ఆఫ్ఘన్‌కి ఐసిస్ వర్గాలు ప్రకటించాయి.

వందల మంది ఖైదీలు ఉగ్రవాదులే..
జలాలాబాద్ సమీపంలో ఇస్లామిక్ స్టేట్ కమాండర్ ఒకరిని ఆఫ్ఘన్ ప్రత్యేక బలగాలు కాల్చి చంపిన మరుసటిరోజే ఈ దాడి జరగడం గమనార్హం. జలాలాబాద్ జైల్లో వందల సంఖ్యలో ఇస్లామిక్ ఉగ్రవాదులు ఖైదీలుగా ఉన్నారు. ఉగ్రవాదులు,ఆఫ్ఘన్ బలగాలకు మధ్య కాల్పుల సమయంలో దాదాపు 1500 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. పారిపోయిన 1000 మంది ఖైదీల ఆచూకీని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ఘన్ బలగాలకు,ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో మృతి చెందినవారిలో సాధారణ పౌరులతో పాటు జైలు ఖైదీలు,గార్డులు,ఆఫ్గన్ సెక్యూరిటీ,ఉగ్రవాదులు ఉన్నట్లు చెప్పారు.