• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క‌రోనావైర‌స్‌ను నియంత్రించడంలో గుజ‌రాత్ మోడల్ కంటే కేర‌ళ మోడ‌ల్ మేలైన‌దా?

By BBC News తెలుగు
|

కరోనావైరస్ పరీక్ష

గుజ‌రాత్ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొర‌త 29 శాతంగా ఉంది. 90 శాతం స‌ర్జ‌న్లు, గైన‌కాల‌జిస్టులు, శిశువైద్య నిపుణుల పోస్టుల‌ను ఇప్ప‌టికీ భ‌ర్తీ చేయ‌లేదు.

గుజ‌రాత్‌లో కేవ‌లం 21.2 శాతం ఆరోగ్య కేంద్రాలు మాత్ర‌మే 24 గంట‌లు ప‌నిచేస్తున్నాయి. 23.7 శాతం ప్రాథ‌మిక కేంద్రాల్లో మాత్ర‌మే ఆప‌రేష‌న్ థియేట‌ర్లు అందుబాటులో ఉన్నాయి. మ‌రోవైపు 52 శాతం ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, 41 శాతం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కోసం మ‌రుగుదొడ్లు కూడా అందుబాటులో లేవు.

ఆద‌ర్శ రాష్ట్రంగా చెప్పే గుజ‌రాత్‌లోని ఆరోగ్య కేంద్రాల ప‌రిస్థితి ఈ గ‌ణాంకాల‌ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఈ గ‌ణాంకాల‌ను 31, మార్చి 2018న లోక్‌స‌భ‌కు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే వెల్ల‌డించారు.

వీటిపై గుజ‌రాత్‌లోని ప్ర‌జారోగ్య విభాగం డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ప్ర‌కాశ్ వాఘెలాతో బీబీసీ మాట్లాడింది.

"గుజ‌రాత్‌లో ఎంబీబీఎస్ వైద్యుల విష‌యంలో ఎలాంటి కొర‌తా లేదు. అయితే శిశువైద్య నిపుణులు, గైన‌కాల‌జిస్టులు లాంటి వైద్య నిపుణుల కొర‌త అన్ని చోట్లా ఉంది. లోక్‌స‌భ‌లో స‌మ‌ర్పించిన డేటా.. గ్రామీణ ప్రాంతాల‌కు సంబంధించిన పాత స‌మాచారం. మీరు కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల‌చేసిన గ్రామీణ ఆరోగ్య గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే స‌రైన స‌మాచారం వ‌స్తుంది" అని డాక్ట‌ర్ వాఘెలా అన్నారు.

గుజ‌రాత్‌లోని జిల్లాల వారీగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఎన్ని ఉన్నాయో పూర్తి స‌మాచారం రాష్ట్ర ప్ర‌భుత్వ ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో ల‌భిస్తోంది. అవుట్ పేషెంట్‌, ఇన్ పేషెంట్ విభాగాల‌కు సంబంధించిన స‌మాచారం కూడా అక్క‌డ ఉంది. అయితే ఈ స‌మాచారం నాలుగేళ్ల కింద‌టిది. అంటే 2015-16నాటి స‌మాచారం. ప్రాథ‌మిక‌, సామాజిక ఆరోగ్య కేంద్రాల‌ సేవ‌ల నివేదిక కూడా ఐదేళ్ల మునుప‌టిది.

"2015-16 త‌ర్వాత‌ అవుట్ పేషెంట్‌, ఇన్ పేషెంట్‌ల స‌మాచారం అప్‌డేట్ చేయ‌క‌పోవ‌డానికి ఎలాంటి ప్ర‌త్యేక కార‌ణ‌మూలేదు. ఈ విష‌యంపై దృష్టిపెడ‌తాం" అని వాఘెలా వివ‌రించారు.

కరోనావైరస్ స్వాబ్ టెస్ట్

కేర‌ళ‌తో పోలిస్తే

"క‌రోనావైర‌స్‌పై పోరాటంలో కేర‌ళ‌ను ఆద‌ర్శ రాష్ట్రంగా చెబుతున్నారు. కేర‌ళ ప్రంచాయ‌తీ మోడ‌ల్‌ను అనుస‌రించింది. అక్క‌డ పంచాయ‌తీల వ్య‌వ‌స్థ ప‌టిష్ఠంగా ఉంటుంది. అందుకే స‌ర్పంచ్‌ల‌కు అన్ని బాధ్య‌త‌లూ అప్పగిస్తారు. ఇలాంటి మ‌హ‌మ్మారులు వ్యాపించిన‌ప్పుడు ఆటోమేటిక్‌గా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు క్రియాశీలం అవుతాయి" అని గుజ‌రాత్‌లో పనిచేస్తున్న‌ సోషియాల‌జిస్ట్ గౌరాంగ్ జానీ వివ‌రించారు.

"అయితే గుజ‌రాత్‌లో ఈ బాధ్య‌త‌లు పెద్దాసుప‌త్రులు తీసుకున్నాయి. మిగ‌తా రాష్ట్రాలతో పోల్చిన‌ప్పుడు కేర‌ళ‌లో న‌గ‌రాలు, గ్రామాల మ‌ధ్య అంత భేదాలేమీ క‌నిపించ‌వు. గుజ‌రాత్‌లో డాక్ట‌ర్ల‌తోపాటు ఇత‌ర ఆరోగ్య సిబ్బంది కొర‌త కూడా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు.. క‌రోనావైర‌స్‌తో ఎలా పోరాడ‌గ‌ల‌వు అనేది అస‌లైన ప్ర‌శ్న‌."

ఈ విష‌యంలో జానీతో అహ్మ‌దాబాద్‌లోని హ్యూమ‌న్ అండ్ జెండ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కేంద్రంలోని అర్బ‌న్ స్ట‌డీస్ ప్రొఫెస‌ర్ ద‌‌ర్శినీ మ‌హాదేవియా ఏకీభ‌విస్తున్నారు.

"క‌రోనావైర‌స్ వ్యాపిస్తున్న స‌మయంలో అంత‌టా కేర‌ళ మోడ‌ల్‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. కేర‌ళ‌లోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో ఆశా వ‌ర్క‌ర్లు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. క‌రోనా రోగుల‌ను గుర్తించ‌డం, వారికి అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు ఇవ్వ‌డం, రోగుల‌ను క్వారంటైన్‌లో ఉంచ‌డం లాంటి ప‌నులు వారే చూస్తున్నారు. పెద్ద‌యెత్తున ప్ర‌జ‌ల‌కు మ‌హ‌మ్మారి గురించి ఆరోగ్య సిబ్బంది అవ‌గాహ‌న క‌ల్పించారు. గుజ‌రాత్‌లోని ఆశా వ‌ర్క‌ర్ల‌తోపాటు ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కూ పీపీఈ కిట్లు అందించ‌లేదు. త‌గిన‌న్ని పీపీఈ కిట్లు పెద్దాసుప‌త్రుల్లో కూడా లేవు. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ వేరే ప్రాంతాల గురించి మ‌నం ఏం మాట్లాడ‌గ‌లం" అని బీబీసీతో ద‌ర్శినీ చెప్పారు.

"క‌రోనావైర‌స్ రాక‌ముందే మ‌నం సిద్ధంగా ఉండుంటే.. ఈ మ‌హమ్మారిని సులువుగా క‌ట్ట‌డి చేయొచ్చు. ఈ విష‌యాన్ని ముందు మ‌నం అర్థం చేసుకోవాలి. కేర‌ళ‌లో రాత్రికి రాత్రే ఏమీ జ‌రిగిపోలేదు. వారు ముందే అన్నింటికీ సిద్ధంగా ఉన్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనూ వేగంగా చ‌ర్య‌లు తీసుకొనే సామ‌ర్థ్యం మ‌న‌కుంది. అయితే ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌న‌ప‌డ‌ట్లేదు."

కేరళ కరోనావైరస్

"క‌రోనావైర‌స్ రోగుల గుర్తింపు మాత్ర‌మే ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో జ‌రుగుతుంది. చికిత్స మాత్రం ఇక్క‌డ జ‌ర‌గ‌దనే విష‌యం గుర్తు పెట్టుకోవాలి. మా ద‌గ్గ‌ర ఆరోగ్య నిపుణులు.. జిల్లా, స‌బ్ జిల్లా స్థాయి ఆసుప‌త్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంటారు. ‌కేర‌ళ ఆరోగ్య కేంద్రాల్లో క‌రోనావైర‌స్ చికిత్స‌ల కోసం నిపుణుల‌ను కూడా అందుబాటులో ఉంచి ఉండుంటారు. అయితే నాకు తెలిసినంత వ‌ర‌కు అక్క‌డ‌ అన్ని స‌దుపాయాలు లేవ‌ని అనుకుంటున్నాను" అని బీబీసీతో డాక్ట‌ర్ ప్ర‌కాశ్ వాఘెలా అన్నారు.

గుజ‌రాత్‌లో ఆరోగ్య సేవ‌లు

గుజ‌రాత్‌లోని ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను మూడు భాగాలుగా విభ‌జించారు. 3,000 నుంచి 5,000 మంది జ‌నాభా ఉండే ప్రాంతాల్లో సబ్ సెంట‌ర్ల‌ను, 20,000 నుంచి 30,000 జ‌నాభా ఉన్న ప్రాంతాల్లో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌ను, ల‌క్ష‌కుపైగా జ‌నాభా ఉంటే సామాజిక ఆరోగ్య కేంద్రాల‌ను ఏర్పాటుచేశారు.

గుజ‌రాత్ ఆరోగ్య శాఖ స‌మాచారం ప్ర‌కారం.. మార్చి 2020 నాటికి రాష్ట్రంలో 1,477 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, 348 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌తి 30,000 జ‌నాభాకు ఒక ప్రాథ‌మిక‌ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఇక్క‌డ రోగుల‌ను సామాజిక ఆరోగ్య కేంద్రాల‌కు రెఫెర్ చేసి పంపిస్తారు. బీమారు రాష్ట్రాల్లో ఒక‌టైన బిహార్‌లోనూ ఇక్క‌డి కంటే ఎక్కువే ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలుంటాయి. నీతీ ఆయోగ్ స‌మాచారం ప్రకారం.. బిహార్‌లో 2013-14లో 1,883 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. గుజ‌రాత్‌లో మాత్రం 2020నాటికి కూడా వీటి సంఖ్య 1,477 మాత్ర‌మే.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) వివ‌రాల ప్రకారం.. ప్ర‌తి వెయ్యి మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉండాలి. గుజ‌రాత్‌లో ప్ర‌తి 2092 మందికి ఒక డాక్ట‌ర్ అందుబాటులో ఉన్నార‌‌ని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్‌) చెప్పిన‌ట్లు డీఎన్ఏ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

దాహోద్ న‌గ‌రంలో అయితే 45 వేల మందికి, ఛోటా ఉద‌య్‌పుర్‌లో అయితే 31 వేల మందికి, జామ్‌న‌గ‌ర్‌లో 22 వేల మందికి ఒక డాక్ట‌ర్ అందుబాటులో ఉన్నారు.

కరోనావైరస్ గుజరాత్, కేరళ

మ‌హిళా ఆరోగ్య సిబ్బంది కొర‌త‌

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మ‌హిళా ఆరోగ్య సిబ్బంది ఎంత మంది ఉండాల‌ని నిర్దేశించారు? ప‌్ర‌స్తుతం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని ఎంఎల్ఏ ల‌లిత్ క‌గ‌త్రా... అసెంబ్లీలో పంచాయ‌తీ మంత్రిని కోరారు. దీనికి స‌మాధానంగా 30 జూన్ 2019 నాటికి రాష్ట్రంలో 10,613 మ‌హిళా సిబ్బంది పోస్టులున్నాయ‌ని, వీటిలో 2,990 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని మంత్రి చెప్పారు.

మ‌ల్టీప‌ర్ప‌స్ ఆరోగ్య సిబ్బంది సంఖ్య‌పై ఎంఎల్ఏ ప్ర‌వీణ్ ముసాడియా కూడా ఓ ప్ర‌శ్న అడిగారు. దీనికి స‌మాధానంగా రాష్ట్రంలో 9,257 మంది సిబ్బంది ఉండాల‌ని నిర్దేశించామ‌ని, అయితే 30 జూన్ 2019 నాటికి 1,794 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని మంత్రి వివ‌రించారు.

అయితే, నిర్దేశిత మ‌హిళా ఆరోగ్య సిబ్బందిలో 8503 పోస్టులను భ‌ర్తీ చేశామ‌ని డాక్ట‌ర్ వాఘెలా చెప్పారు. మిగ‌తా ఖాళీల‌ను నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ కింద 11 సంవ‌త్స‌రాల కాంట్రాక్ట్‌పై పూరిస్తామ‌ని వివ‌రించారు.

'ఇవి గుజ‌రాత్ ఆరోగ్య ప్ర‌మాణాలు.. భార‌త్‌వి కాదు’

ప్రాథ‌మిక‌, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో భార‌త్ ప్ర‌జారోగ్య విధానాల‌కు బ‌దులుగా గుజ‌రాత్ ప్రజారోగ్య విధానాల‌ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించినట్లు గుజ‌రాత్ ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ ప‌టేల్ అసెంబ్లీ స‌మావేశాల్లో చెప్పారు.అయితే, ఇంత‌కీ గుజ‌రాత్ ప్ర‌జారోగ్య ప్ర‌మాణాలు అంటే ఏమిటో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఎలాంటి స‌మాచార‌మూ ఇవ్వ‌లేదు.

దీనిపై గుజ‌రాత్‌లోని నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ అద‌న‌పు డైరెక్ట‌ర్, డాక్ట‌ర్ నీలం ప‌టేల్‌తో బీబీసీ మాట్లాడింది. "వారు చెప్పే ప్ర‌మాణాలు భార‌త్ ప్ర‌జారోగ్య ప్ర‌మాణాలే. గుజ‌రాత్ ప్ర‌జారోగ్య ప్ర‌మాణాలు అంటూ ఏమీలేవు" అని ఆమె వ్యాఖ్యానించారు.

గ్రామీణ ప్ర‌జ‌ల ఆరోగ్య సంరక్ష‌ణే ల‌క్ష్యంగా కేంద్రం జాతీయ గ్రామీణ ఆరోగ్య ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. దీనిలో భార‌త ప్ర‌జారోగ్య ప్ర‌మాణాల‌ను నిర్దేశించారు.

ఈ ప్ర‌మాణాలను రాష్ట్రాలు త‌మ‌కు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే వీటిని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాటించాలని సూచించారు.

గుజరాత్ కరోనావైరస్

కేవ‌లం ఐదు శాత‌మే

బ‌డ్జెట్‌లో ఆరోగ్య శాఖ‌కు ఎంత కేటాయించారు అనే అంశం బ‌ట్టీ.. ఆరోగ్యంపై రాష్ట్ర ప్ర‌భుత్వం పెడుతున్న శ్ర‌ద్ధ గురించి తెలుసుకోవ‌చ్చు.

ఈ సారి గుజ‌రాత్ బ‌డ్జెట్ రూ.2,27,287 కోట్లు. దీనిలో రూ.11,225 కోట్ల‌ను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి కేటాయించారు. అంటే మొత్తం కేటాయింపుల్లో ఇది దాదాపు ఐదు శాతం మాత్ర‌మే.

"ఇంత‌కుముందు చాలాసార్లు ఆరోగ్య రంగానికి ఇంకా త‌క్కువ కేటాయింపులు చేశారు. కేటాయింపులు చేస్తే స‌రిపోదు..వాటిని ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. ఇక్కడి ఆరోగ్య సేవ‌ల్లో ఎలాంటి పురోగ‌తీ క‌నిపించ‌డంలేదు. అంటే కేటాయింపుల‌ను స‌రైన రీతిలో వినియోగించ‌ట్లేదు." అని ద‌ర్శినీ వ్యాఖ్యానించారు.

దేశం మొత్తంలోని డాక్ట‌ర్ల‌తో పోల్చినప్పుడు గుజ‌రాత్‌లో రిజిస్ట‌ర్ అయిన డాక్ట‌ర్లు 5.77 శాతం మాత్ర‌మే ఉన్నారు. అసెంబ్లీలో గ‌త జులై ప్ర‌వేశ‌పెట్టిన ఈ స‌మాచారంపై అహ్మ‌దాబాద్ మిర్ర‌ర్ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. దాని ప్ర‌కారం.. దేశంలో 11 ల‌క్ష‌ల మంది డాక్ట‌ర్లు రిజిస్ట‌ర్ చేయించుకున్నారు. వీటిలో గుజ‌రాత్‌లో రిజిస్ట‌ర్ అయిన‌వారు 66,944 మంది మాత్ర‌మే. మ‌హారాష్ట్ర 14.96తో మొద‌టి స్థానంలో ఉంది. దీనిలో గుజ‌రాత్ ర్యాంకు ఏడు.

కొత్త వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేస్తారా?

"ఈ వాద‌న‌లో ప‌స లేదు. ప్రాథ‌మిక, సామూహిక‌ ఆరోగ్య కేంద్రాల్లో చాలా వైద్యుల పొస్టులు ఖాలీగా ఉన్నాయి. ప్ర‌భుత్వం ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డంలేదు. అందుకే డాక్ట‌ర్లు గ్రామీణ ప్రాంతాల‌కు వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌ర‌ని మ‌నం చెప్ప‌లేం. ఆసుప‌త్రుల్లో ఖాళీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాలంటూ ఇటీవ‌ల రాష్ట్రంలో పెద్ద ఉద్య‌మాన్నే యువ‌త‌ న‌డిపించింది. వారు గ్రామీణ ప్రాంతాల‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోతే... ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌మ‌ని ఎందుకు డిమాండ్ చేస్తారు?" అని జానీ వివ‌రించారు.

డాక్ట‌ర్లు వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డ‌ర‌నే వాద‌న నిజ‌మ‌ని అనుకున్నా.. మ‌హిళా ఆరోగ్య సిబ్బంది, ఇత‌ర ఆరోగ్య కార్మికుల పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? వాటిని ప్ర‌భుత్వం ఎందుకు భ‌ర్తీ చేయ‌ట్లేదు?

ఎంబీబీఎస్ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిపాటు ప‌నిచేయాల‌ని, లేక‌పోతే రూ.20 ల‌క్ష‌లు జ‌రిమానా చెల్లించాల‌ని గ‌తేడాది ఆగ‌స్టులో గుజ‌రాత్ ప్ర‌భుత్వం తెలిపింది.

2013లోనూ డాక్ట‌ర్లు, ఆధునిక ప‌రిక‌రాలూ, కొన్నిసార్లు సాంకేతిక నిపుణులు లేక‌పోవ‌డంతో గుజ‌రాత్‌లోని ఆసుప‌త్రులు ఆధ్వాన స్థితిలో ఉన్న‌ట్లు కాగ్ నివేదించింద‌ని పీటీఐ వార్తా సంస్థ వెల్ల‌డించింది.

"రాష్ట్రంలో ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయ‌న్న‌మాట వాస్త‌వ‌మే.. అయితే డాక్ట‌ర్ల నుంచి సిబ్బంది వ‌ర‌కూ చాలా కొర‌త ఉంది. నిర్మాణాలైతే ఉన్నాయి.. కానీ వాటిని న‌డిపించే కేటాయింపులే లేవు" అని ద‌ర్శిని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీతెలుగునుఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లోఫాలోఅవ్వండి. యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి.)

English summary
Kerala model have succeeded more than Gujarat Model in curtailing Covid-19
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more