• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేరళ: పినరయి విజయన్ కేబినెట్‌లో సొంత అల్లుడికి చోటు.. నిఫా, కరోనాల కట్టడిలో పనిచేసిన ఆరోగ్య మంత్రి కేకే శైలజకు మొండిచేయి

By BBC News తెలుగు
|

కేరళలో కరోనావైరస్‌పై పోరాటంలో ఆరోగ్య మంత్రిగా చేసిన కృషి, అనుసరించిన విధానాలకుగాను కేకే శైలజను నెటిజన్లు ''రాక్‌స్టార్’’గా కొనియాడారు. అయితే ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొత్త క్యాబినెట్‌లో ఆమెకు చోటు మాత్రం దక్కలేదు.

కేరళలోని సీపీఎం కోర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త క్యాబినెట్‌లో అతి పెద్ద వయస్కుడు పినరయి విజయన్‌ అని తెలిపింది. ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది.

''ఎల్‌డీఎఫ్ క్యాబినెట్‌లో 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరంతా కొత్తవారే’’అని ఎంఎల్‌ఏ ఏఎం శంషీర్.. బీబీసీ హిందీతో చెప్పారు.

''ఇది చాలా తప్పుడు నిర్ణయం. విజయన్.. జోసెఫ్ స్టాలిన్‌లా మారిపోతున్నారు. ఎవరి మాటా వినడం లేదు’’అని పినరయి విజయన్ పాత మిత్రుడు, సీపీఎం బహిష్కృత నేత కున్హానందన్ నాయర్ వ్యాఖ్యానించారు.

కొత్తవారు ఎవరు? అల్లుడికి మంత్రి పదవిపై ఎవరేమంటున్నారు

''తన అల్లుడికి కేబినెట్‌లో చోటు ఇచ్చారు. ప్రజలకు ఇది నచ్చడం లేదు. ఇది బంధు ప్రీతి. కానీ దీనికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడటం లేదు’’అని నాయర్ అన్నారు.

సీపీఎం యువ విభాగం జాతీయ అధ్యక్షుడు పీఏ మొహమ్మద్ రియాజ్‌ను ఆయన విమర్శించారు. గత ఏడాది విజయన్ కుమార్తె వీణను రియాజ్ పెళ్లి చేసుకున్నారు.

కొత్త క్యాబినెట్‌లో ఎంవీ గోవిందన్, కె.రాధాకృష్ణన్, కేఎన్ బాలగోపాల్, పి.రాజీవ్, ఎన్.వాసవన్, సాజీ చెరియన్, పి.శివన్ కుట్టి, డా. ఆర్ బిందు, వీణా జార్జ్, వీ అబ్దుల్ రెహమాన్‌లకు చోటు దక్కింది. మాజీ లోక్‌సభ సభ్యుడు ఎంబీ రాజేష్‌కు స్పీకర్ పదవి దక్కింది.

శైలజకు సీపీఎం విప్‌ పదవి ఇచ్చారు. ఇది క్యాబినెట్ ర్యాంక్ పదవి కాదు.

శైలజ ఏమన్నారు?

తిరువనంతపురంలో రిపోర్టర్లతో శైలజ మాట్లాడారు. తాను నిరాశకు గురికాలేదని ఆమె చెప్పారు. ''ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. అదే విధంగా వారు పార్టీని కూడా ప్రేమిస్తున్నారు. అందుకే మేం మళ్లీ అధికారంలోకి వచ్చాం. నాపై అభిమానం కురిపిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు’’అని శైలజ అన్నారు.

కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆరోగ్య మంత్రిని మార్చడం తప్పుడు నిర్ణయం కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ''మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మేమంతా విజయన్ నాయకత్వంలోనే ముందుకు వెళ్లాం’’అని ఆమె అన్నారు.

''మా బాధ్యతను మేం సక్రమంగా నిర్వర్తించాం. పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది. నేను తోటివారితో కలిసి జాగ్రత్తగా పనిచేశాను. నేను చేయగలిగినదంతా చేశాను’’.

''కొత్త క్యాబినెట్ కూడా చక్కగా పనిచేస్తుందని భావిస్తున్నాను. నేను పార్టీ కార్యకర్తను. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాను’’.

కే సుధాకరన్, ఈపీ జయరాజన్, ఏకే బాలన్‌లకు కూడా కొత్త క్యాబినెట్‌లో చోటు దక్కలేదు.

పార్టీ వ్యవహారాలను ఏళ్లుగా విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణుడు ఒకరు ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు. ''పార్టీపై విజయన్ పట్టు ఏ స్థాయిలో ఉందంటే.. శైలజను తప్పించడాన్ని ఎవరూ వ్యతిరేకించనేలేదు. అల్లుడు రియాజ్‌కు మంత్రి పదవి ఇవ్వడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు’’అని ఆయన అన్నారు.

గతేడాది శైలజపై ప్రశంసలు

కేరళలో కోవిడ్-19పై పోరాటానికి తీసుకున్న చర్యలకుగాను గతేడాది అక్టోబరులో శైలజకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ... గత ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్న నియోజకవర్గాన్ని పార్టీ మార్చేసింది.

2016 ఎన్నికల్లో ఆమె కుథుపరంబ నియోజకవర్గం నుంచి 12 వేల ఓట్ల తేడాతో ఆమె గెలిచారు. ఈసారి ఆమెను కూణ్ణూర్ జిల్లాలోని మాత్తానూర్ స్థానం నుంచి పోటీ చేయించారు. అయితే, ఆమె రికార్డు స్థాయిలో 60,935 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

''పార్టీలో పురుషాధిపత్యం ఎక్కువ. మహిళలు ఎదగడాన్ని పార్టీ ఓప్పుకోలేదు. గౌరి అమ్మను సీఎం కాకుండా అడ్డుకున్నది ఈ పార్టీయేనని మనం మర్చిపోకూడదు’’అని రాజకీయ విశ్లేషకుడు బీరాపీ భాస్కర్ వ్యాఖ్యానించారు.

పినరయి విజయన్

పార్టీ భవిష్యత్ ఏమిటి?

''తనకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని విజయన్ సహించలేరని దీని బట్టి తెలుస్తోంది. రెండు దశాబ్దాలుగా ఆయన పార్టీపై పట్టు పెంచుకుంటూ వస్తున్నారు’’అని రాజకీయ విశ్లేషకుడు జే ప్రభాష్ అన్నారు.

''పార్టీ అధినాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదని దీని బట్టి అర్థమవుతోంది’’.

''పార్టీ భవిష్యత్‌కు ఇది మంచిది కాదు. దీనిలో ఎలాంటి సందేహమూ లేదు. శైలజను తొలగించడం మాత్రమే ఇప్పుడు ప్రశ్నకాదు. అంతా తానై విజయన్ పార్టీని నడిపిస్తున్నారు’’.

''శైలజ విషయంలో విజయన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో సీతారాం ఏచూరి జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే కేవలం ఇక్కడ మాత్రమే సీపీఎం అధికారంలో ఉంది’’.

https://twitter.com/annavetticad/status/1394609223942606849

సోషల్ మీడియాలో విమర్శలు

శైలజా టీచర్‌గా ప్రాచుర్యం పొందిన శైలజను క్యాబినెట్‌ నుంచి తొలగించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

''శైలజను తొలగించాలని తీసుకున్న నిర్ణయంతో పార్టీకి, సీఎంకి, రాష్ట్రానికి చేటు జరగుతుంది. రాష్ట్రంలో మంచి ఆరోగ్య వ్యవస్థ ఉండాలని కోరుకునే అందరికీ ఇదొక చెడు వార్త’’అని సినీ విమర్శకురాలు, జర్నలిస్టు అన్నా ఎంఎం వెట్టికాడ్ వ్యాఖ్యానించారు.

''శైలజను క్యాబినెట్ నుంచి తొలగించడమనేది భారతీయ మహిళలకు నిరాశకు గురిచేసే వార్త. విద్యావంతులు, అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ పురుషాధిపత్యం రాజ్యమేలుతోందని దీని బట్టి తెలుస్తోంది’’అని ఆమె అన్నారు.

https://twitter.com/thebooksatchel/status/1394562296232427520

''శైలజా క్యాబినెట్‌లో లేదా? ఆ పదవికి అందరికంటే ఆమెనే అర్హురాలు. కరోనా, నిఫా వైరస్‌లపై పోరాటంలో చక్కటి నాయకత్వాన్ని ఆమె కనబరిచారు. ఈ వార్త అబద్ధం కావాలని నేను ఆశిస్తున్నాను. కానీ ఇది నిజం. ఇది పురుషుల అహంకారానికి అద్దం పడుతోంది’’అని సీనియర్ జర్నలిస్టు రేషా సుజానే వ్యాఖ్యానించారు.

''కేరళ క్యాబినెట్‌లో కేకే శైలజకు చోటు ఇవ్వాలి. కానీ ఆమెకు పదవి ఇవ్వలేదని తెలిసి చాలా నిరాశకు గురయ్యాను. ఆమెను మళ్లీ పదవిలోకి తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇక్కడ లింగ వివక్ష ఎక్కువగా ఉందని అనిపిస్తోంది’’అని రచయిత మను ఎస్ పిళ్లై వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kerala: Pinarayi Vijayan has a place for his own son-in-law in the cabinet,No place for shailaja
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X