గాడ్గిల్ నివేదిక అమలు చేసి ఉంటే కేరళకు ఈ విపత్తు తప్పేదా...?

కేరళలో సంభవించిన వరదలు మళ్లీ ఒకసారి మాధవ్ గాడ్గిల్ రిపోర్టును గుర్తు చేస్తున్నాయి. ఎప్పుడో 2011లో పశ్చిమ కనుమలపై ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ ధనంజయ గాడ్డిల్ ఇచ్చిన రిపోర్టులోని అంశాలను పాటించి ఉంటే ప్రస్తుతం కేరళ ఇంత నష్టపోయేది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. మాధవ్ గాడ్గిల్ కూడా ఇదే చెబుతున్నారు. ఒక్కసారి గాడ్గిల్ కమిటీ ఏం చెబుతోందో చూద్దాం. అసలు గాడ్గిల్ కమిటీని కాదని దాన్ని మరోసారి పరిశీలించాల్సిందిగా అంతరిక్ష శాస్త్రవేత్త కస్తూరి రంగన్‌ను ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నియమించింది..? గాడ్గిల్ రిపోర్టు ప్రకారం ప్రభుత్వం నడుచుకుని ఉంటే నేడు ఈ విపత్తు జరిగేది కాదా...?

గాడ్గిల్ కమిటీని ప్రభుత్వం ఎందుకు నియమించింది
2010 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర పర్యావరణశాఖ మంత్రి జైరాం రమేష్ తమిళనాడులోని కోటగిరిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పశ్చిమ కనుమలను పరిరక్షిద్దాం అనేది ఈ సభ ముఖ్య నినాదం. ఆనాటి సభలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో భారీ విపత్తులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. భారీ నిర్మాణాలు, మైనింగ్, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, హైడ్రోపవర్ నిర్మాణాల వల్ల జరిగే నష్టాల గురించి మాట్లాడారు.ఈ సమావేశం అనంతరం జైరాం రమేష్ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో ఓ కమిటీని వేశారు. పశ్చిమ కనుమలను పరిరక్షించేందుకు అక్కడి పర్యావరణ, జీవవైవిధ్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నివేదిక ఇవ్వాలని కమిటీకి స్పష్టం చేశారు.మొత్తం 1500 కిలోమీటర్ల పాటు ఉన్న పశ్చిమ కనుమలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, కేరళ, తమిళనాడు వరకు ఉన్నాయి.

గాడ్గిల్ కమిటీ ఏం చెప్పింది..?
పశ్చిమ కనుమలకు సంబంధించిన సరిహద్దులను కేవలం పర్యావరణ నిర్వహణకు కోసమే ఉంచాలని చెప్పింది.ఈ సరిహద్దుల్లో మొత్తం ఏరియా 1,29,037 చదరపు కిలోమీటర్లు ఉన్నట్లు గాడ్గిల్ కమిటీ తేల్చింది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు మొత్తం 1490 కిలోమీటర్ల మేరా పశ్చిమ కనుమలు విస్తరించి ఉండగా... అందులో ఒక్క తమిళనాడులోనే 210 కిలోమీటర్ల మేరా ఉన్నట్లు తెలిపింది. అత్యల్పంగా మహారాష్ట్రలో కేవలం 48 కిలోమీటర్ల మేరా పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ మొత్తం ప్రాంతాన్ని పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించాలని గాడ్గిల్ కమిటీ పేర్కొంది. ఈ ప్రాంతంలో చిన్న ఏరియాలను గుర్తించి ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్ (ESZ)అంటే పర్యావరణం పరంగా సున్నితమైన ప్రాంతంగా గుర్తించాలని సూచించింది. పర్యావరణానికి ఉన్న ప్రమాద స్థాయిని బట్టి వాటిని ESZ-1,ESZ-2,ESZ-3గా పరిగణించాలని సూచించింది.

గాడ్గిల్ కమిటీ సూచనలు
* ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయడం నిషేధించాలి
* మూడేళ్లలో ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగంపై పూర్తిస్థాయిలో నిషేధించాలి
*కొత్తగా ఎలాంటి ఎకనామిక్ జోన్లు కానీ, హిల్ స్టేషన్స్ కానీ ప్రకటించరాదు
* ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా మార్చరాదు. ESZ-1,ESZ-2 కింద వచ్చే అటవీ భూములను ఇతర పనులకు వినియోగించరాదు.
* ESZ-1,ESZ-2 ప్రాంతాల్లో కొత్తగా మైనింగ్ లైసెన్సులు జారీ చేయరాదు
* ESZ-1లో కొత్త డ్యాములు నిర్మించరాదు
* ESZ-1లో కొత్త పవర్ ప్లాంటులు, పెద్ద ఎత్తున్న పవన శక్తి ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వరాదు
*పర్యావరణాన్ని కాలుష్యం చేసే పరిశ్రమలు ESZ-1, ESZ-2లో స్థాపించరాదు
* కొత్తగా రైల్వే లైన్లు కానీ, రోడ్లు కానీ నిర్మించరాదు
* టూరిజంను కఠినంగా పర్యవేక్షించాలి
* ఐదు నుంచి ఎనిమిదేళ్లుగా వాడుతున్న పెస్టిసైడ్స్‌లకు ESZ-1,ESZ-2లో స్వస్తి పలకాలి.
వీటన్నిటినీ పర్యవేక్షించేందుకు వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ అథారిటీని ఏర్పాటు చేయాలని గాడ్గిల్ కమిటీ సూచించింది.

కస్తూరి రంగన్ కమిటీని ప్రభుత్వం ఎందుకు వేయాల్సి వచ్చింది..?
2011 ఆగష్టులో గాడ్గిల్ ఇచ్చిన నివేదికతో పశ్చిమకనుమలు కలిగిన ఆరు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం కూడా తృప్తి పడలేదు. అన్ని రాష్ట్రాలు కమిటీ నివేదికను వ్యతిరేకించాయి. ఇతరుల నుంచి సలహాలు సూచనలు ప్రభుత్వం స్వీకరించింది. ఆగష్టు 2012లో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ గాడ్డిల్ కమిటీ నివేదికను పునఃపరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త నేతృత్వంలో హైలెవెల్ వర్కింగ్ గ్రూప్ కమిటీని నియమించారు. కేంద్రంలోని పలు శాఖల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గాడ్గిల్ రిపోర్ట్‌పై వ్యతిరేక స్పందన రావడంతో జయంతి నటరాజన్ ఈ కొత్త కమిటీ వేశారు. కస్తూరిరంగన్ కమిటీ ఏప్రిల్ 2013లో రిపోర్ట్ ఇచ్చింది.
1750 మంది నుంచి గాడ్గిల్ కమిటీపై స్పందన తీసుకోగా.. దాదాపు 81శాతం మంది గాడ్గిల్ రిపోర్ట్‌ను వ్యతిరేకించారని కస్తూరి రంగన్ నివేదిక ఇచ్చింది. మరీ ముఖ్యంగా కేరళ రాష్ట్రం శాండ్ మైనింగ్, క్వారీయింగ్, రవాణా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విండ్ ప్రాజెక్టులు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు, నదుల జలాల బదిలీ వంటి అంశాలపై గాడ్గిల్ ఇచ్చిన రిపోర్టును తీవ్రంగా వ్యతిరేకించింది.

కస్తూరి రంగన్ కమిటీ ఏమి చెప్పింది..?
పశ్చిమ కనుమలకు కస్తూరి రంగన్ కమిటీ కొత్త నిర్వచనం ఇచ్చింది. దాని విస్తరణ 1,64,280 చదరపు కిలోమీటర్లుగా తేల్చింది. అంతేకాదు పశ్చిమ కనుమలను వ్యవసాయ దృశ్యంగాను,సహజ ప్రకృతి దృశ్యంగాను విభజించింది. 60శాతం పశ్చిమ కనుమలు వ్యవసాయానికి సహకరిస్తుందని...ఇందులో మానవులు నివసించేందుకు, వ్యవసాయం చేసుకునేందుకు వీలు ఉంటుందని అభిప్రాయపడింది.ఇక మిగతాది జీవవైవిధ్యానికి సహకరిస్తుందని తేల్చింది. మొత్తం 37 శాతం అంటే 60వేల చదరపు కిలోమీటర్లు జీవ వైవిధ్యానికి సహకరిస్తుందని చెప్పింది.ఈ ప్రాంతాన్ని మాత్రమే పర్యావరణ సున్నితమైన ప్రాంతంగా ప్రకటిస్తే చాలని సూచించింది.
ఇక ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియా కోసం కొన్ని ప్రతిపాదనలు చేసింది కస్తూరి రంగన్ కమిటీ
* మైనింగ్, క్వారీలు తవ్వడం, శాండ్ మైనింగ్‌లపై నిషేధించాలి
* కొత్త థర్మల్ పవర్ ప్రాజెక్టులపై నిషేధం, హైడ్రోపవర్ ప్రాజెక్టులు కొన్ని నిబంధనలతో నిర్మాణానికి అనుమతి
* కొత్త పరిశ్రమలపై నిషేధం
* 20వేల చదరపు మీటర్ల వరకు భవంతుల నిర్మాణానికి అనుమతి.. అయితే టౌన్షిప్ నిర్మాణాలపై నిషేధం
* ప్రత్యేక రక్షణ చర్యల ద్వారా అటవీ భూములను ఇతరత్రా కార్యక్రమాలకు బదిలీ చేయొచ్చు.

గాడ్గిల్ నివేదికను పాటించి ఉంటే కేరళలో ఈ విపత్తువల్ల కలిగిన నష్టం తగ్గేదా..?
కేరళ విపత్తు ఎక్కువగా భారీ వర్షాలతో వచ్చినదే. 2013లో ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరదల తర్వాత ప్రతి ఏటా ఒక రాష్ట్రం ఈ వరదల ధాటికి బలవుతోంది. 2011లో గాడ్గిల్ తన రిపోర్టును ఇచ్చారు. ఇక అప్పుడే ఈ సూచనలను పాటించి ఉంటే చాలా రాష్ట్రాల్లో నష్టం తప్పేదని కొందరు భావిస్తున్నారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని గాడ్గిల్ రిపోర్ట్ సూచిస్తోంది. ఉత్తరాఖండ్‌లో కూడా చెట్లను నరికివేయడం, భారీ నిర్మాణాలు, హైడ్రో పవర్ ప్లాంట్ల నిర్మాణంతోనే ఆనాడు రాష్ట్రం భారీ విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చిందని గాడ్గిల్ తెలిపారు.