Republic day 2022: పిల్లలు, టీకా తీసుకొనివారికి నో పర్మిషన్, 27 వేల మంది సిబ్బందితో భద్రత
మరో రెండురోజుల్లో రిపబ్లిక్ డే.. గణతంత్ర దినోత్సవానికి రాజ్‌పత్ సిద్దమవుతోంది. అయితే దేశంలో కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో వేడుకలకు సంబంధించి తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అయితే జన సమూహల్లో ఈ సారి చిన్నారులు కనిపించరు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న క్రమంలో 15 ఏళ్ల లోపు వారిని అనుమతించడం లేదు. ఈ మేరకు మార్గదర్శకాల్లో ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. అలాగే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోని వారిని కూడా అనుమతించమని స్పష్టంచేశారు. అలాగే 18 ఏళ్ల లోపు వారు రిపబ్లిక్ డే వేడుకల్లో కనిపించరు.

విధిగా సర్టిఫికెట్ చూపించాలి..
కరోనా వైరస్ విస్తరిస్తోన్న క్రమంలో మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే మాస్క్ ధరించి.. ఫిజికల్ డిస్టన్స్ పాటించాలని స్పష్టంచేశారు. అలాగే వేడుకకు వచ్చిన సందర్శకులు.. తాము రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నామని,, దానికి సంబంధించి సర్టిపికెట్ చూపించాలని తేల్చిచెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

ఉదయం 7 గంటలకే
ఈ నెల 16వ తేదీన హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అలాగే 60 ఏళ్లు దాటిన వారికి కూడా టీకా ఇస్తామని చెబుతున్నారు. అయితే ప్రీకాషన్ డోసుకు మాత్రం 9 నెలల సమయం ఉండాలనే షరతు కాస్త ఆందోళన కలిగిస్తోంది. విజిటర్స్ కూర్చొనే బ్లాకులను ఉదయం 7 గంటలకే తెరుస్తామని చెప్పారు. సందర్శకుల పార్కింగ్ సదుపాయం లిమిట్‌గా ఉందని, అందుకు తమకు సహకరించాలని కోరారు. పరిమితమైన కార్లకు.. రిమోట్‌తో లాక్ చేసే వెసులుబాటు ఉందని చెప్పారు. వచ్చినవారు కచ్చితమైన గుర్తింపు కార్డు చూపించాలని కోరారు.

బందోబస్త్‌లో 27 వేల మంది పోలీసులు
రిపబ్లిక్ డే కోసం 27 వేల మంది పోలీసులను బందోబస్త్ కోసం ఉపయోగిస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. 71 మంది డీసీపీలు, 213 మంది ఏసీపీ, 753 మంది ఇన్ స్పెక్టర్లు విధుల్లో పాల్గొంటారని చెప్పారు. 65 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు కూడా ఉంటాయని చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించి చర్యలు తీసుకున్నామని వివరించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.