లేడీ హిట్లర్ కిరణ్ బేడీ: లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌పై పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి హాట్ కామెంట్స్..
పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటుంది. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని తిప్పి పంపడంతో వారి మధ్య అగ్గిరాజేస్తోంది. అయితే తాజాగా సీఎం నారాయణస్వామి.. కిరణ్ బేడీని లేడీ హిట్లర్‌గా పోల్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిప్పి పంపడంతో తనకు ఎక్కడ లేని బీపీ వస్తోందని నారాయణ స్వామి తెలిపారు.

లేడీ హిట్లర్
కిరణ్ బేడీ.. లేడీ కాదు జర్మన్ నియంత హిట్లర్ సోదరి అని సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయంలో కలుగజేసుకుంటుందని మండిపడ్డారు. ఒక్కటి కాదు.. ప్రతీ అంశంలో జోక్యం చేసుకొని చికాకు కలిగిస్తోందని చెప్పారు. దీంతో తనకు ఎక్కడ లేని బీపీ వస్తోందని చెప్పారు.

ప్రతీ నిత్యం గొడవే..
ఇప్పుడే కాదు రాష్ట్రానికి లెప్టినెంట్ గవర్నర్‌గా వచ్చినప్పటి నుంచి ఇదే సమస్య అని చెప్పారు. గత మూడేళ్ల నుంచి వివిధ అంశాలపై అనవసరంగా కల్పించుకొంటున్నారని చెప్పారు. అవసరం లేకున్నా కలుగజేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఆమె ప్రవర్తనను చూస్తే నియంత హిట్లర్ గుర్తుకొస్తారని చెప్పారు. ఆమె లేడీ హిట్లర్ అని.. హిట్లర్ సోదరి లాగా అనిపిస్తారని చెప్పారు.

మాటలు-మంటలు
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఐపీఎస్‌పై మాటల తూటాలు పేల్చారు. పుదుచ్చేరి మంత్రివర్గం తీసుకున్న ప్రతీ నిర్ణయంపై మెలిక పెడతారని గుర్తుచేశారు. కొన్నిసార్లు కిరణ్ బేడీ నుంచి ఫైళ్లు వెనక్కి రావడంతో తన బీపీ ఒక్కసారికిగా పెరిగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. దీంతో చాలా సందర్భాల్లో అసహనానికి గురయ్యానని చెప్పారు.

మిగతా చోట్ల లేదే..
అయితే దేశంలో మిగతా కేంద్రపాలిత ప్రాంతాల్లో లెప్టినెంట్ గవర్నర్లు మాత్రం కలుగజేసుకుంటలేరని చెప్పారు. కానీ పుదుచ్చేరిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నమని చెప్పారు. ప్రభుత్వ రోజువారీ కార్యకలపాల్లో గవర్నర్ జోక్యం తప్పనిసరి అని మండిపడ్డారు. గవర్నర్ జోక్యంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్రాసు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కిరణ్ బేడీ, కేంద్రాన్ని ప్రతివాదులుగా చేర్చారు. కానీ ఆ పిటిషన్ విచారణ కోసం కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!