• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కుంభ్, కరోనా: దేవుడిపైనే భారమని భక్తులు అంటున్నారు.. మరి, హరిద్వార్‌‌లో స్థానికులు ఏమంటున్నారు

By BBC News తెలుగు
|

కుంభమేళా

ముంబయికి చెందిన 34 ఏళ్ల బిజినెస్ మాన్, ఫొటోగ్రాఫర్ ఉజ్వల్ పురి మార్చి 9న ఉదయం హరిద్వార్ చేరుకున్నారు. మాస్క్ వేసుకున్న ఆయన దగ్గర శానిటైజర్‌తో పాటు విటమిన్ టాబ్లెట్లు కూడా ఉన్నాయి.

డెహ్రాడూన్‌ వెళ్లే విమానంలో కూర్చోడానికి ముందు, ఆయన హరిద్వార్‌లో ఎంట్రీ కూడా కష్టమయ్యేంత కఠినంగా భద్రతా ఏర్పాట్లు ఉంటాయని అనుకున్నారు.

ఆయన తమ కోవిడ్ ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టును ప్రభుత్వ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలని కూడా ప్రయత్నించారు. కానీ ఆ వెబ్‌సైట్ 'పనిచేయడం లేదని' వచ్చింది.

ఆయన్ను ఎయిర్‌పోర్టులోగానీ, హరిద్వార్‌లోగానీ ఎవరూ చెక్ చేయలేదు.

హర్‌ కీ పౌడీలో ఆయన తీసిన ఫొటోలు చూస్తే అందులో చాలామంది ముఖాలకు అసలు మాస్కులే లేవు. ఒక వేళ ఎవరైనా వేసుకున్నా, అవి గడ్డం కిందికి ఉన్నాయే కానీ, నోటిని, ముక్కును కప్పడం లేదు.

ఆయన రాత్రి తీసిన ఫొటోల్లో ఘాట్ మెట్ల మీద మాస్క్ లేని భక్తులు ఇసుకేస్తే రాలనంత ఉన్నారు.

కొందరు మహిళలు భక్తితో చేతులు జోడించి కనిపించారు. కొందరు తల తుడుచుకుంటుంటే, ఇంకొందరు మొబైల్ ఫోన్‌లో మునిగిపోయున్నారు.

అక్కడ ఎక్కడా సోషల్ డిస్టెన్సింగ్ కనిపించలేదు. ఇక, సాయంత్రం హారతి సమయంలో అయితే అందరూ ఒకరిమీద ఒకరున్నట్లే కనిపించింది అని ఉజ్వల్ చెప్పారు.

ఉజ్వల్ మూడు రోజులు కుంభమేళా కోసం హరిద్వార్‌లోనే ఉన్నారు. ఆ మూడు రోజుల్లో ఆయన ఒకే ఒక్కసారి బాబాలతో సెల్ఫీ తీసుకోడానికి తన మాస్క్ తీశారు.

అప్పుడు నేను "భారమంతా ఆ దేవుడి మీదే వేశా" అంటారు ఉజ్వల్.

మూడు రోజుల తర్వాత ముంబయిలో ఇంటికి చేరుకున్న ఆయన ఇప్పుడు భయంభయంగా ఉన్నారు.

"కరోనా టెస్ట్ చేయించుకున్న నేను, ఇంటికి రాగానే, ఒక గదిలోకి వెళ్లి ఐసొలేట్ అయ్యాను. ఇంట్లో అమ్మనాన్నలు కూడా ఉన్నారు. అందుకే పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాను" అన్నారు.

కుంభమేళా

ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో కరోనా మృతుల సంఖ్య ప్రస్తుతం లక్షా 73 వేలు దాటింది.

చాలా రాష్ట్రాల్లో పడకలు, ఆక్సిజన్, మందుల కొరత తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్నాయి.

ఆస్పత్రుల్లో అడ్మిట్ కావడానికి జనం పరుగులు తీస్తున్నారు. శ్మశానాల్లో అంత్యక్రియలకు టోకెన్లు తీసుకుని క్యూలో ఉంటున్నారు.

అలాంటి సమయంలో కుంభమేళాలో లక్షలాది జనం గుమిగూడడాన్ని సూపర్ స్ప్రెడర్ ఈవెంట్‌గా చెబుతున్నారు.

కరోనా కాలంలో బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో నిర్వహిస్తున్నఈ కుంభమేళాను చాలామంది హిందుత్వ రాజకీయాలతో జోడించి చూస్తున్నారు.

కరోనా వ్యాపిస్తున్న సమయంలో కుంభమేళాను రద్దు చేసుండాల్సిందని మసూరీలోని చరిత్రకారులు గోపాల్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.

కుంభమేళా

"కుంభమేళాలో పుణ్యస్నానం చేయకపోతే పాపాల్లో భాగం అవుతారా. ఇది మనిషి ఆత్మశాంతి కోసమే. ఇలా, ఎవరైనా ఒకరు జబ్బు పడితే మనశ్శాంతి ఉంటుందా?" అని ఆయన ప్రశ్నించారు.

మొదట్లో కుంభమేళా రెండు వారాల పాటు జరిగేది. కానీ మార్కెటైజేషన్ కారణంగా గత 35-40 ఏళ్లుగా ఆ సమయాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారని గోపాల్ అన్నారు.

"కుంభమేళా ప్రధాన స్నానం వైశాఖి నాడే జరుగుతుంది. తర్వాత దీన్ని మకర సంక్రాంతికి జోడించారు. శివరాత్రి కూడా వచ్చింది. శివరాత్రి స్వయంగా ఒక పెద్ద పండుగ. జనం వీటన్నిటినీ కలిపేసి కుంభమేళాను మూడు నెలలకు పెంచేశారు" అన్నారు.

"కుంభ్ అటే మతపరమైన ఆచార వ్యవహారాలని అర్థం. మొదట్లో మన మతాన్ని ఎలా కాపాడుకోవాలి లాంటి విషయాలపై చర్చించేవారు. ఈ పెద్ద పెద్ద అఖాడాలు కూడా హిందూ మత రక్షణ కోసమే ఏర్పాటయ్యాయి. హిందూ మతానికి ఏదైనా అవాంతరం వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అనే చర్చించేవారు. ఇప్పుడు అవన్నీ మెల్లమెల్లగా తగ్గిపోతూ కనిపిస్తున్నాయి" అంటారు గోపాల్.

ఇప్పుడు అంత సమయం గానీ, కూర్చుని వాటి గురించి చర్చించే పండితులు గానీ లేరు. ఇప్పుడు ప్రతిదీ మార్కెటైజ్ అయిపోతోంది అన్నారు.

కుంభమేళా

ప్రజల్లో భయం

ఈ కుంభమేళా కోసం హరిద్వార్‌లో ఒక ధర్మసత్రం నిర్వహించే మిథిలేష్ సిన్హా కరోనా వల్ల స్థానికుల్లో భయంభయంగా ఉందని చెప్పారు.

"ఇక్కడికి వచ్చే వాళ్లంతా ఒకటి రెండు రోజులుండి వెళ్లిపోతారు. ఇక్కడే ఉండిపోయేవారికి వాళ్లు ఏం ప్రసాదించి వెళ్తారు అనేదే ఎవరికీ అర్థం కావడం లేదు. భక్తి విషయానికి వస్తే, ఇక్కడికి వచ్చేవారికి అర్థమయ్యేలా చెప్పడం కష్టమైపోతోంది. కరోనావైరస్‌కు ఆస్తికులు, నాస్తికులు అనే తేడా లేదు కదా" అన్నారు.

కుంభమేళాకు ముందు హరిద్వార్‌లో ఎన్ని కోవిడ్ పాజిటివ్ ఉన్నాయనేది ఇప్పటీకీ స్పష్టంగా తెలీదు. కానీ ఒక అధికారి మాత్రం ప్రతి రోజూ అక్కడ జరిగిన పరీక్షల్లో దాదాపు 200 కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడినట్లు చెప్పారు.

హరిద్వార్‌లో పుణ్యస్నానాలు జరుగుతున్న ప్రాంతంలో 50 కరోనా టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయని కుంభమేళా కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అవినాష్ ఖన్నా చెప్పారు.

ఖన్నా స్థానికులకు, ధర్మసత్రాల్లో ఉంటున్న వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు, తిరిగి ఇళ్లకు వెళ్లేవారికి యాంటీజెన్ పరీక్షలు చేస్తున్నారు. కానీ, కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు తిరిగి తమ ఇళ్లకు వెళ్లడం వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోర్టులో పిటిషన్

ఇదే భయాన్ని ప్రస్తావించిన హరిద్వార్‌కు చెందిన సచ్చిదానంద డబ్రాల్.. నైనిటాల్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.

గతేడాది ఈ పిటిషన్‌ వేసిన ఆయన కుంభమేళాలో జనం లక్షలాదిగా తరలివచ్చినపుడు జిల్లా యంత్రాంగం కోవిడ్ వ్యాప్తిని ఎలా అడ్డుకోగలదని సందేహాలు వ్యక్తం చేశారు.

సచ్చిదానందకు ఒక ఫార్మా కంపెనీ ఉంది. ఆయన హరిద్వార్‌లో ఒక మెడికల్ షాపు నడుపుతున్నారు.

కుంభమేళా

నవంబర్, డిసెంబర్‌లో హరిద్వార్‌లో పరిస్థితి సాధారణంగానే ఉంది. కోవిడ్ కేసులు కూడా అదుపులో ఉన్నాయి.

ఆ సమయంలో త్రివేంద్ర సింగ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కుంభమేళాకు వచ్చే యాత్రికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు. కానీ మార్చి 10న పదవీ ప్రమాణం చేసిన కొత్త సీఎం తీర్థ్ సింగ్ రావత్, యాత్రికులు ఎలాంటి సంకోచం లేకుండా కుంభమేళాకు రావచ్చని చెప్పారు.

"మార్చి 11న శివరాత్రి స్నానం రోజున 37 లక్షల మంది హరిద్వార్ చేరుకున్నారు. ఆ తర్వాత నుంచి హరిద్వార్‌లో పరిస్థితి అంతకంతకూ ఘోరంగా మారుతూ వచ్చింది. కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిరోజూ 50 వేల టెస్టులు చేయాలని సూచించింది. కానీ, నాకు తెలిసి ఇక్కడ రోజుకు పది వేలకంటే ఎక్కువ టెస్టులు జరగడంలేదు" అని ఆయన అన్నారు.

మరోవైపు కుంభమేళా కోవిడ్ నోడల్ ఆఫీసర్ అవినాష్ ఖన్నా మాత్రం కోర్టు ఆదేశాల ప్రకారం తాము ప్రతి రోజూ 50 వేలకు పైగా టెస్టులు చేస్తున్నామని చెప్పారు.

సచ్చిదానంద్ పిటిషన్ తర్వాత కోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మార్చిలో హరిద్వార్‌కు వచ్చి ఘాట్లను పరిశీలించి కోర్టుకు తమ రిపోర్ట్ ఇచ్చింది.

తాము ఘాట్లను పరిశీలించినపుడు వాటి పరిస్థితి ఘోరంగా ఉందని ఆ కమిటీలో సభ్యులైన సచ్చిదానంద్ లాయర్ శివ్ భట్ చెప్పారు.

"ఘాట్లు పరిశీలించిన తర్వాత మేం రుషీకేశ్‌లో ఉన్న ఒక ఆస్పత్రికి వెళ్లాం. అది మొత్తం గడ్వాల్‌కు కోవిడ్ సెంటర్. కానీ అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. అక్కడ అల్ట్రాసౌండ్ సదుపాయం లేదు. బాత్రూంలు, వార్డుల పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ బెడ్ పాన్, డస్ట్ బిన్ కూడా లేదు. లిఫ్ట్ పనిచేయడం లేదు" అని ఆయన తెలిపారు.

కోర్టు ప్రతి ఘాట్‌లో ఒక మెడికల్ టీమ్ ఉండాలని .. రాపిడ్, యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని చెప్పిందని, కానీ అక్కడ అలా జరగడంలేదని భట్ తెలిపారు.

దీనిపై బీబీసీ.. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి అమిత్ నేగీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎస్కే ఝా స్పందన తెలుసుకోవాలని ప్రయత్నించింది. కానీ, వారిని సంప్రదించలేకపోయాం.

కుంభమేళాకు రెండు కోట్ల మందికైనా ఏర్పాట్లు చేయగలమని ప్రభుత్వ అధికారులు కోర్టుకు చెప్పారు. కానీ, షాహీ స్నాన్ రోజుల్లో ప్రభుత్వ యంత్రాంగం 30 లక్షల జనాభాను కూడా చూసుకోలేకపోయింది.

కుంభమేళా

కుంభమేళా ఏర్పాట్ల ప్రభావం

కానీ, ఈ కుంభమేళాకు వెళ్లి వచ్చిన ముంబయికి చెందిన 25 ఏళ్ల సందీప్ షిండేకు అక్కడి ఏర్పాట్లు, పోలీసుల స్పందన బాగా నచ్చాయి.

పెయింటర్‌గా పనిచేసే సందీప్ కుంభమేళాకు వెళ్లినపుడు హరిద్వార్‌లో ఒక ఆశ్రమంలోని ఒక పెద్ద హాల్లో ఉన్నారు. మరో పది మంది భక్తులు కూడా అక్కడే ఆయనలాగే నేలపై పరిచిన పరుపులపై పడుకున్నారు.

సందీప్ ఆ మేళాకు ఒంటరిగా వచ్చారు. 12 ఏళ్ల తర్వాత జరిగే కుంభమేళాలో స్నానం చేయాలనే వచ్చానని ఆయన చెప్పారు

"నేను ఇక్కడికి రావడం, షాహీ స్నానం చేయడం చాలా అద్భుతంగా అనిపించింది" అన్నారు.

సందీప్ మాస్క్ వేసుకున్నారు. తిరిగి ఆశ్రమానికి వెళ్లిన తర్వాత వేడి నీళ్లతో కాళ్లూ చేతులు ముఖం కడుక్కునేవారు.

అక్కడ నా చుట్టూ కరోనా గురించి ఏం వినిపించలేదు. అక్కడ కరోనా గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు అన్నారు.

కానీ చాలా మంది దీనిని 'సూపర్ స్ప్రెడర్' ఈవెంటుగా వర్ణిస్తున్నారు.

"ఉత్తరాఖండ్‌లో ఈ మహా కుంభమేళా తర్వాత చాలా ప్రమాదకరమైన పరిస్థితులు రాబోతున్నాయి" అని డెహ్రాడూన్‌కు చెందిన ఒక సీనియర్ జర్నలిస్ట్ అన్నారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉత్తరాఖండ్‌లో కోవిడ్-19 వల్ల 1800 మంది చనిపోయారు.

"జనంలో భయం ఉంది. కానీ విశ్వాసం, మతం విషయానికి వచ్చేసరికి ఆ భయాన్ని వదిలేస్తున్నారు" అని పంచ్ రామానందీయ్ ఖాకీ అఖాడా రాఘవేంద్ర దాస్ అన్నారు.

"ఎన్నికలు సూపర్ స్ప్రెడర్ కావా.. కరోనా మతపరమైనదా. భారత సంస్కృతి గురించి చాలా చెప్పే ప్రభుత్వాలు మద్యం దుకాణాలు తెరుస్తున్నాయి. అక్కడ కరోనా వ్యాపించడం లేదా" అని ప్రశ్నించారు.

ఆయన పక్కనే కూర్చున్న ఓంకార్ దాస్ కూడా "హరిద్వార్‌లో ఉన్నవారు జబ్బు పడడానికి పగటి వేడి, రాత్రి చలే కారణం. వంద శాతం కరోనా ఉన్న పాజిటివ్ కేసు ఇక్కడ ఒక్కటి కూడా దొరకలేదు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kumbh,Corona: Devotees say the burden is on God. And what do the locals say in Haridwar?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X