• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లేడీ బైక్ మెకానిక్: 'అబ్బాయిల పనులు ఎందుకన్నారు... అయినా ఎందుకు చేస్తున్నానంటే...'

By BBC News తెలుగు
|

లేడీ బైక్ మెకానిక్

విశాఖపట్నంలోని సుజాతనగర్‌లో పంచర్లు వేసే ఓ షాపు ఉంది.

కొత్తగా అక్కడికి వెళ్లినవారు అక్కడ పని చేసే వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్నది ఓ అమ్మాయి. ఆమె పేరు రేవతి.

రేవతి తండ్రి రాము ఈ దుకాణాన్ని దాదాపు 20 ఏళ్లుగా నడిపిస్తున్నారు. అయితే, ఓ సహాయకుడిని పెట్టుకునే ఆర్థిక స్తోమత ఆయనకు లేదు. ఒక్కరే పనిచేయలేరు కూడా.

రాముకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురికి అతి కష్టం మీద పెళ్లి చేయగలిగారు. తండ్రి కష్టం చూడలేని చిన్న కూతురు రేవతి చదువును కొనసాగిస్తూనే ఆయనకు సహాయకురాలిగా చేరారు.

ఏడేళ్ల క్రితం ఆమె ఈ పని మొదలుపెట్టారు. తొలి ఏడాదిలోనే పని మొత్తం నేర్చుకుని, స్వయంగా షాపును నడిపించడం ప్రారంభించారు.

అదే సమయంలో ఆమె చదువును కూడా వదిలిపెట్టలేదు. బీకాం పూర్తి చేశారు.

లేడీ బైక్ మెకానిక్

'అబ్బాయిల పనులు ఎందుకన్నారు'

కొన్ని పనులను ఆడవాళ్లకు తగినవి కాదన్నట్లుగా జనం చూస్తుంటారు. రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాల్లో, రేకుల షెడ్డుల్లోనూ చేసే బైక్ రిపేర్లు, టైర్ల ప్యాచ్ వర్క్ పని కూడా అలాంటిదే.

కానీ, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా, తండ్రికి సాయం చేద్దామన్న ఉద్దేశంతో రేవతి ఈ పనిని ఎంచుకోకతప్పలేదు.

"మా నాన్నకి సాయంగా ఉందామని ఈ పనిని నేర్చుకోవడం మొదలుపెట్టాను. క్రమంగా బైక్ మెకానిక్ పనులతో పాటు పంచర్లు వేయడం నేర్చుకున్నాను. మొదట్లో నాన్నకి పనిముట్లు అందించే దానిని.

ఆ తర్వాత మెల్లగా చిన్నచిన్న రిపేర్లు చేయడం నేర్చుకున్నాను. నాన్న ఎక్కువగా టైరు పంచర్ వర్క్సే చేసేవారు. దాంతో నాకు ఆ పనే త్వరగా వచ్చింది.

నేను టైర్లకు పంచర్లు వేస్తుంటే అంతా అదోరకంగా చూసేవారు.

'అమ్మాయిలు చేసే పనులు చూసుకోవచ్చు కదా... ఇలాంటి అబ్బాయిల పనులు ఎందుకు చేస్తున్నావు?' అని చాలా మంది అనేవారు.

కానీ, మా నాన్నకి సహాయం చేస్తున్నానన్న కారణంతో ఈ పని కష్టంగా అనిపించలేదు" అని పంచరేసిన టైరును బిగిస్తూ రేవతి చెప్పారు.

లేడీ బైక్ మెకానిక్

'అప్పుడు నమ్మలేదు... కానీ'

"నేను చేసేది పెద్ద వ్యాపారమేం కాదు. భవిష్యత్తులో దీనిపై పెద్ద మొత్తంలో డబ్బులు రావని కూడా తెలుసు.

కానీ ప్రస్తుతానికి నా ముందు ఉన్న దారి ఇదొక్కటే. నేను ఈ పనిలోకి వచ్చిన మొదట్లో 'అమ్మాయి బైక్ ప్యాచ్ వర్క్స్ చేయడమేంటి? ఎలా చేస్తుందో? బాగా చేయకపోతే మనమే ఇబ్బందులు పడాలి' అని మా షాపుకి వచ్చిన వాళ్లు అనుకునేవాళ్లు.

కొందరు నేను ఈ షాపులో ప్యాచ్ వర్క్ చేస్తానని తెలిసి...ఏదో సాకు చెప్పి వేరే షాపుకి వెళ్లిపోయేవారు'' అని రేవతి వివరించారు.

''ఒకరో ఇద్దరో తప్పనిసరి పరిస్థితుల్లో నా చేత వారి వాహనాలకు ప్యాచ్ వర్క్ చేయించుకునేవారు. కానీ, నా పని తీరు చూసినవాళ్లు నా గురించి అందరికీ చెప్పేవారు.

దీంతో క్రమంగా ఎక్కువ మంది మా షాపుకు రావడం మొదలైంది. వాళ్లందరి నమ్మకాన్ని పొందాను. ఇప్పుడు నేను షాపులో లేకపోయినా వాళ్లు మరో షాపుకి వెళ్లరు. నేను వచ్చే వరకు ఉంటారు.

అంతలా నా పని వారిని ఆకట్టుకుంది. ఇప్పుడు వారి నమ్మకమే నా పెట్టుబడిగా మారింది" అని ఆమె ఆనందంతో చెప్పారు.

లేడీ బైక్ మెకానిక్

'ఆటోమొబైల్ రంగంలోనే సెటిలవుతా'

పోటీ పరీక్షల కోసం శిక్షణకు వెళ్లాలనుకున్నా డబ్బులు లేకపోవడంతో ఆ ఆలోచనను రేవతి విరమించుకున్నారు.

డిగ్రీ చేసినప్పటికీ, తండ్రికి చేదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో మెకానిక్ పనిని కొనసాగిస్తున్నారు.

"ఎప్పటీకి నా తండ్రికి సహాయంగా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే చదువును సైతం పక్కన పెట్టేశాను.

మెకానిక్ ఫీల్డ్‌లో కొంత అనుభవం సంపాదించాను. ఒకవేళ ఉద్యోగం ఏదైనా వచ్చినా అది ఆటోమెబైల్ రంగానికి సంబంధించిన వర్క్ అయితేనే వెళ్తాను. ఎందుకంటే నా అనుభవం ఆ రంగంలోనే ఉపయోగపడుతుంది.

భవిష్యత్తులో ఈ రంగంలోనే ఏదైనా సాధించాలని అనుకుంటున్నారు. భారీ ద్విచక్ర వాహనాల టైర్లు కొన్ని బరువుగా ఉంటాయి. వాటిని మోయడం కొంచెం కష్టం అనిపిస్తుంటుంది.

కానీ మా నాన్న కోసమే ఇదంతా చేస్తున్నాననే విషయం తలచుకుంటే ఆనందంగా ఉంటుంది" అని రేవతి చెప్పారు.

లేడీ బైక్ మెకానిక్

'నేను భోజనం చేస్తుంటే.. తను పంచర్లు వేసేది'

''రేవతి ఎనిమిదో తరగతి చదువుకునేటప్పుడు రోజూ మధ్యాహ్నం నాకు భోజనం క్యారేజ్ ఇవ్వడానికి షాపుకు వచ్చేది. అలా మెల్లగా అక్కడ పరిసరాలు తనకు అలవాటయ్యాయి. నేను ప్యాచ్ వర్క్ చేస్తుంటే బైక్ పట్టుకోవడం, టూల్స్ అందించడం చేసేది.

మెల్ల మెల్లగా చిన్నచిన్న పనులు చేయడం నేర్చుకుంది. షాపుకి వచ్చినప్పుడు కూర్చునేది కాదు. నేను భోజనం చేస్తూంటే...సగంలో ఉన్న బైక్ రిపేర్లు, ప్యాచ్ వర్క్ పనులని తాను పూర్తి చేసేందుకు ప్రయత్నించేది'' అని రేవతి తండ్రి రాము చెప్పారు.

"ఏడు, ఎనిమిది ఏళ్ల కిందటి వరకూ ఏదో రకంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. కానీ, ఆ తరువాత పని కష్టమైపోయింది.

ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారిపోయింది. షాపులో ఒక్కడినే అన్ని పనులు చేసుకోలేకపోయేవాడిని. మరొకర్ని పెట్టుకునే స్థోమత లేదు. ఒక్కడినే చేసుకుంటే రోజుకి ఆరేడు వాహనాలకంటే ఎక్కువ చేయలేకపోయేవాడిని. వాటికి పెద్దగా డబ్బులు రావు. దాంతో చాలా కష్టంగా ఉండేది.

ఆ సమయంలోనే రేవతి 'నాకు ఎలాగు కొంచెం పని తెలుసు కదా డాడీ... నేను నీకు సహాయం చేస్తాను' అని చెప్పింది. నేను సరే అన్నానో, లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి నాది. అయితే రేవతి షాపుకి వస్తుంటే అమ్మాయి చేత ఇలాంటి పనులు చేయిస్తావా అని అందరూ అనేవారు.

కానీ, నాకు అందులో తప్పేమీ కనిపించలేదు. నాకు తెలిసిన పనిని...నా కూతురికి నేర్పిస్తున్నానని అనుకున్నానంతే.

రేవతి కూడా చాలా తొందరగానే పని నేర్చుకుంది. ఇప్పుడు నాకంటే రేవతినే బాగా పని చేస్తుంది" అని తడినిండిన కళ్లని తుడుచుకుంటూ రాము చెప్పారు.

లేడీ బైక్ మెకానిక్

'ఫోన్ చేస్తే చాలు'

సుజాత నగర్, పెందుర్తి చుట్టుపక్కల వారు తమ వాహనాలకు పంచరు అయితే రేవతికి ఫోన్ చేస్తారు.

''రేవతికి ఫోన్ చేస్తే చాలు మా పని కొద్దిసేపట్లో అయిపోయినట్లేనని మేం నమ్ముతాం'' అని సుజాతనగర్ స్థానికుడు సురేంద్రరావు చెప్పారు.

"మాములుగా రాము నాకు బైక్ మెకానిక్‌గా తెలుసు. కానీ, రాము చిన్నకూతురు రేవతి మెకానిక్‌గా మారి...బైక్ రిపేర్లు, ప్యాచ్ వర్క్స్ చేస్తున్నప్పటి నుంచి ఈ షాపును ఎక్కడికి మార్చినా అక్కడికే వెళ్తున్నాను.

ఎందుకంటే తండ్రి కోసం రేవతి ఎంతో కష్టమైన పనిని నవ్వుతూ చేయడం చూస్తుంటే ఆనందం కలుగుతుంది.

నా కూతురికి, మా చుట్టూ పక్కల వారికి రేవతిలా ఎలాంటి కష్టమైన పనినైనా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెబుతుంటాను. తండ్రికి సాయం చేయడంతో పాటు చదువును కూడా ఆమె నిర్లక్ష్యం చేయడం లేదు. అందుకే రేవతి వంటి పిల్లలని చూస్తే ముచ్చటేస్తుంది" అని సురేంద్రరావు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Girl in visakhapatnam does bike repairs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X