• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లఖీంపుర్ ఖీరీ: 'ప్రభుత్వం డబ్బు తిరిగి తీసుకున్నా పర్వాలేదు, మాకు న్యాయం కావాలి'-గ్రౌండ్ రిపోర్ట్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

Click here to see the BBC interactive

గతేడాది అక్టోబర్ 3న ఉదయం 55 ఏళ్ల నక్షత్ర సింగ్ తమ గ్రామం నామ్‌దార్ పుర్వాకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని తికునియాలో రైతు ఉద్యమంలో భాగంగా జరిగే ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొనడానికి ఇంటి నుంచి బయల్దేరారు.

"నేను రైతు ఉద్యమంలో పాల్గొనడానికి దిల్లీకి వెళ్లలేకపోయా, అందుకే తికునియా వెళ్తున్నా, కొన్ని గంటల్లో తిరిగొచ్చేస్తాలే" అని ఆయన వెళ్తూ వెళ్తూ తన కుటుబంతో అన్నారు.

తర్వాత నక్షత్రసింగ్ తిరిగొచ్చారు. కానీ ప్రాణాలతో కాదు.

ఆరోజు లఖీంపూర్ ఖీరీ తికునియాలో థార్ జీపు కింద నలిగిపోయిన ఒక జర్నలిస్టు, నలుగురు రైతుల్లో నక్షత్రసింగ్ కూడా ఉన్నారు.

కుటుంబాలు రెండైనా ఆవేదన ఒకటే

నక్షత్ర సింగ్ కుటుంబం ఇప్పటికీ ఆ విషాదం నుంచి కోలుకోలేకపోతోంది.

"ఆయన మొదటిసారి రైతు ఉద్యమంలో పాల్గొనాలని వెళ్లారు. ఆయన చూసిరావడానికే వెళ్లారు. అక్కడేమైనా గొడవలు చేయడానికి వెళ్లారా?. వెళ్లిన ఆయన మళ్లీ తిరిగిరారని మేం అనుకోలేదు. ఆయనకు నవ్వుతూ వీడ్కోలు చెప్పాం. వెళ్లి, గంటా రెండుగంటల్లో వచ్చేస్తారులే అనుకున్నాం" అని ఆయన భార్య జశ్వంత్ కౌర్ చెప్పారు.

అదే రోజు జైపరా గ్రామంలో ఉంటున్న బీజేపీ కార్యకర్త శ్యామ్ సుందర్ నిషాద్ కూడా ప్రతి ఏటా జరిగే కుస్తీ పోటీలు చూసొస్తానని చెప్పి తన ఇంటి నుంచి బయల్దేరారు.

ఆయన కుటుంబానికి కూడా కొన్ని గంటల తర్వాత నిషాద్ తికునియాలో గాయపడ్డారనే విషయం తెలిసింది. ఆ రోజు ఇంటి నుంచి వెళ్తున్నపుడు కుటుంబ సభ్యులకు వెళ్లొస్తానని చెప్పిన శ్యామ్ సుందర్ నిషాద్‌కు అదే చివరి వీడ్కోలు అయ్యింది.

శ్యామ్ సుందర్ నిషాద్ తల్లి ఫుల్మతీ ఇప్పుడు ఆ రోజు గుర్తుకొస్తే కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నారు.

ఈ రెండు కుటుంబాల మధ్య చాలా దూరం ఉన్నప్పటికీ వారి మనసులో బాధ ఒకలాంటిదే. ఆ రెండు కుటుంబాలూ ఇప్పుడు తమకు న్యాయం జరిగే రోజు కోసం ఎదురుచూస్తున్నాయి.

'మాకు భయంగా ఉంది'

ఈ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, లఖీంపూర్ ఖీరీ ఎంపీ అజయ్ మిశ్రా అలియాస్ టెనీ కొడుకు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు. దాదాపు నాలుగు నెలలు జైల్లో ఉన్న తర్వాత ఆశిష్ మిశ్రాకు కోర్ట్ ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది.

ఇది నక్షత్రసింగ్ కుటుంబానికి మరింత కలవరం కలిగిస్తోంది. తమకు భయంగా ఉందని వాళ్లు చెబుతున్నారు.

మంత్రిగా తండ్రి రాజకీయ ప్రభావం వల్లే హత్య కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్ వచ్చిందని కూడా ఈ కుటుంబం ఆరోపిస్తోంది.

ఈ కుటుంబం ఇంటి బయట ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. కానీ, తమకు న్యాయం లభిస్తుందనే ఆశ వారిలో రోజురోజుకూ సన్నగిల్లుతోంది.

"ప్రభుత్వం మీద ఎలాంటి ఆశలూ పెట్టుకోలేం. ప్రభుత్వం గుడ్డిది, మూగది, చెవిటిది కూడా అయిపోయింది. వాళ్లు ఏదీ చూడాలనుకోవడం, వినాలనుకోవడం లేదు" అని నక్షత్ర సింగ్ కొడుకు జగదీప్ సింగ్ అన్నారు.

"ఐదు నెలలైంది. ఇప్పటివరకూ న్యాయం జరగలేదు. న్యాయం జరిగుంటే ఆయనకు బెయిలెందుకు వస్తుంది" అని నక్షత్రసింగ్ భార్య జశ్వంత్ కౌర్ ప్రశ్నించారు.

'స్వతంత్ర భారత్‌లో జలియన్ వాలా బాగ్'

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ నాలుగో దశ పోలింగ్‌లో భాగంగా లఖీంపూర్ ఖీరీలో ఫిబ్రవరి 23న ఓటింగ్ జరగబోతోంది. ఈ అంశం ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తోంది.

"జీపుతో రైతులను తొక్కించేశారు. రైతుల ప్రాణాలు పోయాయి. ఈ ఘటన స్వతంత్ర భారత దేశంలో జలియన్‌వాలా బాగ్‌ను గుర్తుకుతెచ్చింది" అని ఫిబ్రవరి 19న లఖీంపూర్ ఖీరీ జీఐసీ మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించిన ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు.

బీజేపీ కూడా ఫిబ్రవరి 20న ఇదే మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాటు చేయాల్సింది. కానీ, సభలో గందరగోళం తలెత్తే అవకాశం ఉండడంతో దానిని రద్దు చేశారు.

ప్రధాని బహిరంగ సభలో రైతు ఉద్యమానికి సంబంధించినవారు నిరసన ప్రదర్శనలు చేయవచ్చని, నల్ల జెండాలు ప్రదర్శించవచ్చని అధికారులు తమకు సమాచారం ఇచ్చినట్లు స్థానిక బీజేపీ నేతలు అంగీకరించారు. అందుకే ఆ బహిరంగ సభను వర్చువల్ సభలా మార్చేశామన్నారు.

"తమకు న్యాయం లభించలేదని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. అజయ్ మిశ్రా కుమారుడికి నాలుగు నెలల్లోనే బెయిల్ రావడంతో, తమ పట్ల పక్షపాతం చూపుతున్నారనే విషయం రైతులకు అర్థమవుతోంది" అని లఖీంపూర్ ఖీరీ సమాజ్‌వాదీ పార్టీ నేత రాంపాల్ సింగ్ యాదవ్ అన్నారు.

'ఈ ఘటనకు బయటివారే కారణం'

గత ఏడాది అక్టోబర్ 3న జరిగిన ఈ ఘటనను విపక్షాలు తమ ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తుంటే.. మరోవైపు బీజేపీ స్థానిక నేతలు మాత్రం ఈ ఘటన గురించి మరోలా చెబుతున్నారు.

"వాళ్లు బయటివాళ్లు. పక్కా ప్రణాళిక ప్రకారం వచ్చి ఈ పని పూర్తి చేశారు. పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం కూడా కాస్త ఉంది. లేదంటే జిల్లాలో ఈ ఘటన జరిగేది కాదు" అని లఖీంపూర్ ఖీరీ బీజేపీ నేత ఆశు మిశ్రా అన్నారు.

మరోవైపు "వారు రైతులా కాదా అనే విషయం, ఇంట్లో మనిషిని పోగొట్టుకున్న కుటుంబాలను, ఈ ఘటనలో గాయపడిన వారిని అడిగి చూడండి" అని జశ్వంత్ కౌర్ అన్నారు.

'వారికసలు మా బాధే లేదు'

తమ ఆవేదన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరికీ అర్థమైనట్లు కనిపించడం లేదని, ప్రభుత్వాలకు తమ బాధతో ఎలాంటి సంబంధం లేదనే విషయం తెలుస్తోందని రెండు కుటుంబాలు చెబుతున్నాయి.

"మా బాధ అర్థం చేసుకున్న వాళ్లందరూ ఇక్కడకు వచ్చారు. కానీ ఈ రెండు ప్రభుత్వాలు.. కేంద్రం, యూపీ ప్రభుత్వం ఇప్పటివరకూ మా దగ్గరకు రాలేదు. వారికి బాధ ఉంటే మా ఇంటికి కచ్చితంగా వచ్చేవాళ్లు. వాళ్లకు మా గురించి ఏ బాధా లేదు. వాళ్లు వచ్చుంటే మాకు న్యాయం జరుగుతుందనే ఒక ఆశ ఏర్పడేది" అన్నారు జశ్వంత్ కౌర్.

మరోవైపు, ఈ ఘటనలో చనిపోయిన శ్యామ్ సుందర్ నిషాద్ కుటుంబానికి పరిహారం లభించింది. కానీ కుటుంబ వివాదం వల్ల వాళ్లు ఆ మొత్తాన్ని ఉపయోగించలేకపోతున్నారు. తర్వాత ఏం జరుగుతుందో ఈ కుటుంబానికి తెలీడం లేదు.

"మాకు న్యాయం లభిస్తుందో లేదో తెలీడం లేదు. మా అన్నయితే ప్రాణాలతో రాడు" అన్నారు శ్యామ్ సుందర్ నిషాద్ సోదరుడు సంజయ్ నిషాద్.

మరోవైపు "ప్రభుత్వం తాము ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకున్నా ఫర్వాలేదు, మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం తప్ప ఇంకేం అక్కర్లేదు" అని నక్షత్ర సింగ్ కుటుంబం చెబుతోంది.

లఖీంపూర్ ఖీరీలోని ఈ ప్రాంతం చెరకు పొలాలతోపాటూ, తియ్యటి బెల్లానికి పేరుపొందింది. కానీ గత ఏడాది జరిగిన ఘటన చేదు ఇక్కడివారి మనసుల్లో ఇప్పటికీ అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Lakhimpur Kheri:'It doesn't matter if the government takes back the money, we want justice' - Ground Report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X