• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌: ఈ బ్యాంకులో ఉన్న మీ డబ్బు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి?

By BBC News తెలుగు
|

బ్యాంకులు

లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ నుంచి డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది. డిసెంబర్ 16, 2020 వరకు బ్యాంక్‌ ఖాతాధారులు తమ ఖాతా నుంచి గరిష్టంగా రూ.25వేలు విత్‌ డ్రా చేసుకోవచ్చు.

లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ డైరెక్టర్ల స్థానంలో రిజర్వ్‌ బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌ను నియమించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ సిఫారసుపై కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

“లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ ఆర్థికస్థితి క్షీణిస్తోంది. 3 సంవత్సరాలకు పైగా బ్యాంక్ నష్టాలను చవిచూస్తోంది. ఇది దాని నికర విలువను తగ్గించింది. సమర్థవంతమైన ప్రణాళిక లేకపోవడంతో నష్టాలు కొనసాగే అవకాశం ఉంది’’అని ఆర్బీఐ పేర్కొంది.

అంతకు ముందు 2019లో పంజాబ్- మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) ఖాతాదారులు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది.

ఈ పరిస్థితుల్లో బ్యాంకులో తాము జమ చేసిన డిపాజిట్లు ఎంత వరకు భద్రం అన్న అనుమానం ఖాతాదారుల్లో కలుగుతోంది.

మీరు ఒక బ్యాంకులో ఐదు లక్షలకు మించి ఎంత డబ్బు డిపాజిట్‌ చేసినా, ఆ బ్యాంకు నష్టాల్లో ఉంటే ఐదు లక్షల రూపాయలు మాత్రమే మీ చేతికి వస్తాయి.

ఈ ఏడాది బడ్జెట్‌ నిబంధనల ప్రకారం డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) కస్టమర్లకు బ్యాంక్‌ డిపాజిట్లపై కేవలం రూ. 5లక్షలకే హామీ ఇస్తుంది. అంటే మీరు డిపాజిట్‌ చేసిన దాంట్లో రూ.5 లక్షలకే బీమా ఉంది.  

బ్యాంకుల పనితీరును ఆర్బీఐ నిత్యం గమనిస్తుంటుంది. తేడాగా కనిపిస్తే చర్యలు మొదలు పెడుతుంది

ఈ సమస్య నుంచి ఎలా బైటపడాలి?

కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బైటపడవచ్చంటున్నారు ఆర్ధిక నిపుణులు. మీరు ఎలాంటి బ్యాంకును ఎంచుకుంటున్నారు అన్నది ఇందులో కీలకం

“మీ ఇంటికి దగ్గరగా ఉందనో, బాగా సర్వీసు ఇస్తుందనో బ్యాంకులో ఖాతా తెరవడం మంచిది కాదు ” అని భారత ప్రభుత్వ మాజీ రెవిన్యూ కార్యదర్శి రాజీవ్‌ టకరూ బీబీసీతో అన్నారు . కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మునిగిపోయే బ్యాంకులలో డిపాజిట్ల విషయంలో జాగ్రత్తగా ఉండొచ్చని ఆయన తెలిపారు.

ప్రభుత్వ బ్యాంకా, ప్రైవేట్‌ బ్యాంకా ? ఏది మేలు?

ప్రైవేట్‌ బ్యాంకులకంటే ప్రభుత్వ బ్యాంకులు ఎక్కువ భద్రమని చాలామంది అనుకుంటుంటారు. దీనికి కూడా ఒక లాజిక్‌ ఉందంటారు రాజీవ్‌. ప్రైవేటు బ్యాంకులకు నష్టాలు వస్తే దాని నుంచి బైటపడటానికి పరిమిత వనరులుంటాయి.

సర్కారీ బ్యాంకు అయితే దివాళా తీయకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని నమ్ముతారు. ప్రభుత్వాలు కూడా ప్రజల నమ్మకం నిలబెట్టుకోవాలని చూస్తాయి. ఇదే ప్రభుత్వరంగ బ్యాంకులు సురక్షితమని నమ్మడానికి ప్రధాన కారణం. బ్యాంకులు నష్టాలలోకి పోకుండా ప్రభుత్వం ఆ సొమ్మును ఈక్విటీలలో పెట్టుబడి పెడుతుంది.

ఇదే విధంగా లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిని డీబీఎస్‌ బ్యాంకులో విలీనం చేయాలని నిర్ణయించింది.

బ్యాంకు విషయంలో జాగ్రత్తలు

డబ్బును బ్యాంకుల్లో దాచుకోవాలనుకున్నప్పుడు మేలైన మార్గం ఏంటంటే ఒకే బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు దాచకుండా ఉండటం. అందుకు బదులుగా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలి.

చాలామంది ఇదంతా గందరగోళం అనుకుంటారు. కానీ లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌, పంజాబ్‌-మహారాష్ట్ర బ్యాంకుల్లో జరిగిన దానిని బట్టి చూస్తే వివిధ బ్యాంకుల్లో డబ్బును దాచుకోవడం ప్రయోజనకరం అంటున్నారు ఆర్ధిక నిపుణులు.

ఒకటికంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతా తెరవడం మంచిదని బ్యాంక్‌బజార్‌.కామ్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి అన్నారు. అది ఒకే కుటుంబంలో వేర్వేరు వ్యక్తుల పేర్ల మీద డిపాజిట్‌ చేయడం ఇంకా మంచిదంటున్నారు. నగదు ఉపసంహరణపై ఆర్బీఐ పరిమితులు విధించిన సందర్భంలో ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి.

బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ను సరిగ్గా చదువుకోవాలి

“మీరు ఎకౌంట్‌ ఓపెన్‌ చేయాలనుకున్న బ్యాంకు ఆర్ధిక పరిస్థితిని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం’’ అన్నారు రాజీవ్‌ టకరు. బ్యాంకు బ్యాలన్స్‌ షీట్లు గమనించాలని, ఒకవేళ అర్ధం కాకపోతే నిపుణులను అడిగి తెలుసుకోవాలని రాజీవ్‌ సలహా ఇస్తున్నారు.

ఒక బ్యాంకు దగ్గర ఉన్న నిధులు ఎంత, డబ్బును ఎక్కడ పెట్టుబడిగా పెడుతున్నారు, నిరర్ధక ఆస్తులెన్నీ లాంటి విషయాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.

డిపాజిట్ చేసిన బ్యాంకు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, దానికి సంబంధించిన ప్రతివార్తను జాగ్రత్తగా చదవాలని ఆదిల్ శెట్టి అన్నారు. నిరర్ధక ఆస్తులు, స్టాక్‌ మార్కెట్‌లో ఆ బ్యాంకు పనితీరులాంటివన్నీ ఆ బ్యాంకు భవిష్యత్తును తెలుపుతాయని శెట్టి అన్నారు. బ్యాలన్స్‌ షీట్ బ్యాంకు పని తీరుకు నిదర్శనమని ఆయన అన్నారు.

'స్ట్రెస్‌ బ్యాంక్' జాబితాలో మీ బ్యాంక్ ఉందో లేదో చూసుకున్నారా?

ఇది తెలుసుకునే ముందు బ్యాంకులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. సాధారణంగా బ్యాంకు పొదుపు ఖాతాలో లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో డబ్బు పెట్టినప్పుడల్లా తమ డబ్బును భద్రపరుస్తున్నారని కస్టమర్లు అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది జరగదు.

మీరు బ్యాంకుకు అప్పులాగా డబ్బు ఇస్తారు. దాని మీద మీకు వడ్డీ లభిస్తుంది. ఆ డబ్బును కూడా బ్యాంకులోనే ఉంచుతారు. మీ డబ్బును తీసుకుని బ్యాంకులు పెట్టుబడులు పెడతాయి. అయితే పెట్టిన పెట్టుబడులు తిరిగి రానప్పుడు సమస్యలు మొదలవుతాయి.

అందువల్ల బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్ చూడటం ద్వారా అందులో పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా రాదా అన్నది అంచనా వేయవచ్చు.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఏం చేస్తుంది ?

ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు బ్యాంకుల పని తీరును గమనిస్తుంటుంది. ఎక్కడైనా గందరగోళం కనిపిస్తే తగిన జాగ్రత్తలు సూచిస్తుంది. అప్పటికి పరిస్థితి మెరుగుపడకపోతే దాన్ని తన చేతిలోకి తీసుకుంటుంది.

కాస్త జాగ్రత్తగా సమాచారం సేకరిస్తే 'స్ట్రెస్‌’లో ఉన్న బ్యాంకులేవో తెలుసుకోవడం కష్టం కాదు. మీ బ్యాంకు అలాంటి బ్యాంకుల జాబితాలో ఉంటే వెంటనే డబ్బును విత్‌ డ్రా చేసుకోవడం ఉత్తమమైన పని.

అధిక వడ్డీ ఇస్తామనే బ్యాంకుల విషయంలో జాగ్రత్త

డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తామని చెప్పే బ్యాంకులను మరింత అనుమానంతో చూడాలంటారు రాజీవ్‌ టకరూ. ప్రభుత్వ రంగ బ్యాంకు తక్కువ వడ్డీ చెల్లిస్తుండగా, ప్రైవేటు బ్యాంకులు కొద్దిగా ఎక్కువ వడ్డీని ఇస్తాయి. అలా కాకుండా అధికంగా వడ్డీలు ఇస్తామనే బ్యాంకుల గురించి అన్ని విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవాలన్నారు రాజీవ్‌.

''ఈ ఏడాది నవంబర్‌లో చాలా బ్యాంకులు ఒక సంవత్సరం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 4.9 నుంచి 5.5 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. అయితే కొన్ని చిన్న బ్యాంకులు 7శాతం వడ్డీని చెల్లిస్తామని చెప్పాయి. వడ్డీ రేట్లు తగ్గుతున్నందున ఇలాంటి బ్యాంకులలో డిపాజిట్‌ చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ఇందులో చాలా రిస్క్‌ ఉంటుంది’’ అన్నారు బ్యాంక్‌బజార్.కామ్ సీఈఓ ఆదిల్ శెట్టి

డబ్బు సురక్షితంగా ఉండాలంటే అన్నీ ఒకేచోట డిపాజిట్ చేయవద్దని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What can you do to keep your money safe in Lakshmi vilas bank
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X