హేమామాలిని వీధిలో చిరుత: కుక్క అనుకుని తరిమిన గార్డు!
ముంబై: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని నివసించే వీధిలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున ఆమె ఉండే వీధిలో చిరుత సంచిరించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. చిరుతను చూసిన వెంటనే అక్కడ విధుల్లో ఉన్న గార్డు.. అది కుక్క అనుకుని దాని వెంటబడి పరిగెత్తించాడు.
ఆ తర్వాత అది చిరుత అని తెలియడంతో చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు.
అయితే, ఆ ప్రాంతంలో ఎవరికీ ఎటువంటి హాని చేయకుండా.. చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. దగ్గర్లోని అటవీ ప్రాంతం నుంచి చిరుత వచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అటవీ రేంజ్ అధికారి సంతోష్ కంక్ చెప్పారు.

స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే.. యశోధామ్ హిల్ ప్రాంతంలోకి చిరుత రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఏకంగా హేమమాలిని బంగ్లాలోకి చిరుత ప్రవేశించి అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది.
చిరుతలు అడవి నుంచి తప్పిపోయి.. ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయని, కనిపిస్తే తమకు ఫోన్ చేయాల్సిందిగా అటవీశాఖ అధికారులు స్థానికులను కోరారు. వాటిని ఎంతమాత్రం రెచ్చగొట్టే పనులు చేయొద్దని, అలా చేస్తే అవి మీద దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు అక్కడి ప్రజలకు సూచించారు.