అనివార్యంగా ఆన్ లైన్- తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వాలు- భవిష్యత్తు వాటిదే...
గతంలో ఆన్ లైన్ షాపింగ్ అంటే దుస్తులో, ఎలక్ట్రానిక్ వస్తువులో అనే భావన ఎక్కువగా ఉండేది. మహా అయితే ఫుడ్ డెలివరీ సంస్ధలకు ఆన్ లైన్ లో మంచి గిరాకీ ఉండేది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్ డౌన్ పరిస్ధితులు ఆన్ లైన్ డెలివరీలను తప్పనిసరిగా మార్చేశాయి. ఇఫ్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నేరుగా ఆన్ లైన్ సంస్ధలతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువులను ఇళ్లకే పంపేందుకు సిద్దమవుతున్నాయి.

ఆన్ లైన్ షాపింగ్ - ఒకప్పుడు ఆప్షనల్..
ఒకప్పుడు పండగో, పబ్బమో వస్తుందంటే ఆన్ లైన్ లో దుస్తులు, గిఫ్ట్ లు వెతికే వాళ్లు. ఆన్ లైన్ లో తమ అభిరుచికి తగినవి దొరక్కపోతే నేరుగా బజార్లకు, షాపింగ్ మాల్స్ కు వెళ్లి కొనుగోళ్లు చేసే వాళ్లు. కానీ ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్దితులు ఆన్ లైన్ షాపింగ్ ను తప్పనిసరిగా మార్చేశాయి. ఇప్పుడు కచ్చితంగా ఇళ్ల వద్దే ఉంటూ షాపింగ్ చేయక తప్పనిసరి పరిస్దితి జనానికి ఎదురవుతోంది. నిత్యావసరాలు మొదలుకుని మందులు, కిరాణా సామాగ్రి, కూరగాయలు ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేసుకోవాల్సిన పరిస్ధితిని కరోనా లాక్ డౌన్ అనివార్యంగా కల్పించింది.

పెరిగిన ప్రభుత్వాల ప్రోత్సాహం..
గతంలో ఆన్ లైన్ షాపింగ్ సంస్ధలకు, ఈ కామర్స్ పోర్టల్స్ కు ప్రభుత్వాల నుంచి అరకొర ప్రోత్సాహం మాత్రమే లభించేది. విచ్చలవిడిగా పన్నులు విధిస్తూ ఈ కామర్స్ రంగానికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వాలు ముందుకు వచ్చేవి కావు. దీంతో ఒకప్పుడు ఈ కామర్స్ రంగంలో అట్టహాసంగా అడుగుపెట్టిన షాప్ క్లూస్, స్నాప్ డీల్ వంటి సంస్ధలు ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్ధితుల్లోకి జారిపోయాయి. కానీ ఇప్పుడు కరోనా వైరస్ రాక తర్వాత పరిస్ధితిలో చాలా మార్పు వచ్చింది. ప్రభుత్వాలే ఈ కామర్స్, ఆన్ లైన్ షాపింగ్ సంస్ధలతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ప్రజలకు ఇళ్ల వద్దకే నిత్యావసరాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఆన్ లైన్ సంస్ధలతో ప్రభుత్వాల ఒప్పందాలు..
గతంలో ఓ ప్రైవేటు సంస్ధతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలంటే విపక్షాలు విమర్శిస్తాయనో, లాభాలు ఉంటాయో లేదో అన్న భయాలు ప్రభుత్వాలను వెంటాడేవి. దీంతో ప్రభుత్వాలను ఆశ్రయించిన సంస్ధలకు ఆన్ లైన్ డెలివరీలకు అనుమతులు కూడా లభించని పరిస్దితి.
కానీ కరోనా వైరస్ రాక తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలే ప్రైవేటు ఆన్ లైన్ సంస్ధలను వెతుక్కుంటూ వెళ్లి మరీ ఒప్పందాలు చేసుకోమని అడుగుతున్నాయి. దీంతో ఇంతకంటే మంచి తరుణం దొరకదని భావించి స్విగ్గీ, జొమాటో వంటి సంస్ధలు వెంటనే రెడీ అయిపోతున్నాయి. అంతే కాదు అవకాశమిచ్చినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంటున్నాయి.

పెరిగిన అవగాహన- భవిష్యత్తుపై అంచనాలు..
కరోనా లాక్ డౌన్ వేళ దేశంలో పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాలు కుదేలవుతున్న వేళ సేవల రంగంలో మాత్రం కొంత వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వివిద రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆన్ లైన్ సేవల కోసం పెరుగుతున్న డిమాండ్లే. ప్రభుత్వాలే నేరుగా రంగంలోకి దిగి ఒప్పందాలు కుదుర్చుకుని నిత్యావసరాలను ఇళ్లకే చేరుస్తామంటే కాదనే వారెవరు. దీంతో ప్రజల్లోనూ ఆన్ లైన్ డెలివరీలపై నమ్మకం పెరుగుతోంది. దేశంలో సేవల రంగానికి ఇదో గొప్ప మలుపు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
కరోనా లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా రద్దీ ప్రాంతాల్లో సంచరించేందుకు ప్రజలు అంత సులువుగా ముందుకు రారనే అంచనాలు ఉన్నాయి. హోటళ్లు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లకు ప్రజలు రావాల్సిన అవసరం రాకుండానే ఆన్ లైన్ డెలివరీ సంస్ధలు ఇళ్ల వద్దకే అన్నీ అందిస్తే ఇక సేవల రంగానికి మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోక తప్పదు.