వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ వ్యాఖ్యలపై క్షమాపణకు కాంగ్రెస్ ఉడుంపట్టు, ఉభయసభలు వాయిదా

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్‌పై చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఉడుంపట్టుపట్టడంతో సోమవారం ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభ అట్టుడికిపోయాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్‌పై చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఉడుంపట్టుపట్టడంతో సోమవారం రాజ్యసభ అట్టుడికిపోయింది.

Recommended Video

టార్గెట్‌‌‌కు దూరంగా బిజెపి, కారణమిదే

సభ మొదలైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు మూకుమ్మడిగా ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. మాజీ ప్రధానిపై ప్రస్తుత ప్రధాని చేసిన ఆరోపణలపై చర్చించేందుకు 267 నిబంధన కింద ఇచ్చిన నోటీసును తిరస్కరించడంతో కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకున్నారు. ప్రధాని మోడీ, బీజేపీలకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు.

nabi-modi

''ప్రతిరోజూ ప్రతిదీ మీరు తిరస్కరించలేరు. ఇలాగైతే ఇక సభలో ప్రతిపక్షం ఎందుకున్నట్లు? మన్మోహన్ పదేళ్లు ఈ దేశ ప్రధానిగా ఉన్నారు. ఆయనపై చేసిన ఆరోపణలు రుజువు చేయండి. ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార బీజేపీ నాయకులపై ఉంది..'' అంటూ రాజ్యసభలో కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు.

శుక్రవారం కూడా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఇదే విషయమై పట్టుబట్టడంతో రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారిచ్చిన నోటీసుపై చర్చకు అనుమతించేందుకు తిరస్కరించారు.

కాంగ్రెస్ సభ్యులు సభను సజావుగా సాగనివ్వకుండా మాటిమాటికీ అడ్డుతగులుండడంతో ఉప సభాపతి పి.జె.కురియన్ రాజ్యసభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా ఆ తరువాత సభ ప్రారంభం అవగానే మళ్లీ కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తారు.

కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ సభ్యుల హక్కును కాపాడాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకొచ్చారు. ప్రశ్నోత్తరాలను కొనసాగించాలంటూ వెంకయ్యనాయుడు సూచించడంతో మళ్లీ కాంగ్రెస్ సభ్యులు ఛైర్మన్ పోడియంవైపు దూసుకొచ్చారు.

ప్రధానమంత్రి క్షమాపణ చెప్పితీరాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అటు లోక్‌సభ‌లో కూడా....

మరోవైపు లోక్‌సభలో కూడా సోమవారం ఇదే తంతు కొనసాగింది. సభను సజావుగా సాగనీయకుండా కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడుతూ వచ్చారు. మోడీ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టారు.

సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం అయిన కాసేపటికే వాయిదా పడింది. కాంగ్రెస్ సభ్యులు తమ సీట్లలోంచి లేచి నిలబడి మోడీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ గొడవ చేయడం ప్రారంభించారు.

ఆ సమయంలో బీజేపీ ఎంపీ కిరీటి సోమయ్య లేచి మాట్లాడుతూ.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయదుందుభి మోగిస్తోందని అన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని, ఆ పార్టీ గుజరాత్ మాత్రమేకాక హిమాచల్ ప్రదేశ్‌ను కూడా కోల్పోయిందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ సభ్యులు తీవ్ర గలభా సృష్టించడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం వరకు లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా అనంతరం తిరిగి లోక్‌సభ ప్రారంభం కాగా, కాంగ్రెస్ సభ్యులు మళ్లీ అడ్డుతగిలారు.

దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ కాంగ్రెస్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు ప్రతిరోజూ అదే అంశాన్ని లేవనెత్తుతున్నారు.. ఇది పద్ధతి కాదు..' అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు శాంతించలేదు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను తామెంత మాత్రం సహించమని, ఆయన క్షమాపణ చెప్పితీరాల్సిందేనని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడం ప్రారంభించారు.

ఒకవైపు కాంగ్రెస్ సభ్యులు గొడవ చేస్తుండగానే మరోవైపు లోక్‌సభలో ప్రభుత్వం వివిధ బిల్లులు ప్రవేశపెట్టింది. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను ఆ రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్, పాక్ మాజీ విదేశాంగ మంత్రి కుర్షిద్ కసౌరీలతో కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్ సమావేశమైనట్లు మోడీ ఆరోపించారు. ఈ ఆరోపణలపై క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు రోజూ పట్టుబడుతూ ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభను స్తంభింపజేస్తున్నారు.

English summary
The Rajya Sabha on Monday saw repeated disruptions and was adjourned for the day as Congress members denounced the allegations levelled by Prime Minister Narendra Modi against his predecessor Manmohan Singh. As the House met for the day, agitated Congress members trooped to the Chairman's podium shouting slogans against Modi and the BJP after their notice to discuss the matter under Rule 267 was rejected. Under the Rule 267, the House's listed business is suspended to discuss full time the matter for which the notice is given.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X