అన్నమో రామచంద్రా: బుక్కెడు బువ్వకోసం ఎండలో గంటలపాటు, 3 వేల మంది ఆకలికేకలు..
కరోనా వైరస్ వల్ల పేదలకు ఉపాధి కరవైంది. దీంతో తినడానికి తిండి లేదు. చండీగఢ్‌లో 3 వేల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. నాలుగు గంటలు లైన్‌లో ఉంటే తప్ప భోజనం లభించదు. అదీ కూడా కొందరికీ లభిస్తోంది. ఆ ఫ్యామిలీలో ఎక్కువమంది ఉంటే అంతే సంగతులు. కరోనా రక్కసి వల్ల చండీగఢ్‌లో 3 వేల కుటుంబాలు పడుతోన్న ఆకలి కేకలు కలచివేస్తున్నాయి.

ఉదయం 9
సెక్టార్ 52 టిన్ షెడ్ కాలనీ వద్ద ఉదయం 9 గంటలకు పేదలకు లైన్ కడతారు. నాలుగుగంటల తర్వాత అంటే మధ్యాహ్నం 1 గంటకు ఉచితంగా సరుకులు అందజేస్తారు. లైన్‌లో ఉన్నవారికి మాత్రమే, మితంగా అందజేస్తారు. అయితే ఒక్కో ఫ్యామిలీలో 8 నుంచి 10 మంది వరకు ఉంటే సమస్య వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో తల్లిదండ్రులు చిక్కుకోవడంతో రాజన్న, అతని సోదరుడు కలిసి లైన్‌లో నిల్చొన్నారు. అయితే కొన్నిసార్లు తమ వంతు రాకముందే సరుకులు ముగుస్తున్నాయని రాజన్న వాపోయాడు.

కి.మీ లైన్
ఉచితంగా అందజేసే సరుకుల కోసం పేదలు కిలోమీటర్ మేర లైన్‌లో నిల్చున్నారు. వైరస్ వల్ల 3 వేల కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో కొందరు లైన్‌లో తమ ప్లేట్లను ఉంచుతారు. అందుకోసం వారు ఉదయం 7 గంటలకే భోజనం అందించే చోటుకు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆహార వస్తువుల అందజేస్తారు. బియ్యం, పప్పు కలిపి ఇస్తారు. మరికొందరు పేదలు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి సరుకులు తీసుకుంటారు. అయితే ముగ్గురు వరకు మాత్రమే ఆహారం తీసుకునే అవకాశం ఉంది.

అరకొర సరుకులు..
కొన్ని బియ్యం, పప్పుతో ఏమీ చేయాలని సందీప్ అనే అతను ప్రశ్నించాడు. దీనికంటే చనిపోవడం మేలు అని అభిప్రాయపడ్డారు. భోజనం వండుకునేందుకు రోజంతా నిల్చొవాల్సి వస్తోందని రష్మి అనే యువతి తెలిపారు. ఇలా ఎంతకాలం నిరీక్షించాలి అని ఆమె ప్రశ్నించారు.

ఎండలో..
చండీగడ్‌లో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. 36 డిగ్రీల ఎండలో సరుకుల కోసం నిల్చుంటున్నామని పేర్కొన్నారు. తన భర్తకు బాగోలేకపోవడంతో తాను వచ్చానని వివాహిత గుర్తుచేశారు. తనకేమన్నా జరిగితే కుటుంబం సంగతి ఏంటీ అని ఆమె ప్రశ్నించారు. పేదల ఇబ్బందులపై పెద్దలు స్పందించారు. మరిన్ని ఆహార వస్తువుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. మార్చి 24వ తేదీని పంపిణీ ప్రారంభించామని.. 15 వేల మంది నుంచి.. మంగళవారం నాటికి 55 వేల మంది వరకు సరుకులు అందజేస్తున్నామని తెలిపారు.