వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమలం: డ్రాగన్ ఫ్రూట్ గురించి మీకు ఎంత తెలుసు? భారతదేశంలో ఇది ఎక్కడెక్కడ పండుతుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
డ్రాగన్ ఫ్రూట్.. కమలం

డ్రాగన్ ఫ్రూట్ పేరును 'కమలం'గా మారుస్తున్నామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించగానే అందరూ చాలా ఆశ్చర్యపోయారు. దీనిపై సోషల్ మీడియాలో కార్టూన్లు, జోకులు వెల్లువెత్తాయి.

అయితే, కచ్, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లలో డ్రాగన్ ఫ్రూట్‌ను పండించే రైతులు మాత్రం ఇలాంటి ప్రకటనల వలన తమకే ఉపయోగం ఉండదని, అలాంటి వాటిని పట్టించుకోమని అంటున్నారు. రోగ నిరోధక శక్తి పెంచే ఈ పండుకు గిరాకీ ఉన్నంతకాలం తాము ఈ పంట పండిస్తామని రైతులు చెబుతున్నారు.

డ్రాగన్ ఫ్రూట్ చూడ్డానికి కమలంలా ఉంటుందని, అందుకే దీని పేరును కమలంగా మార్చాలని నిర్ణయించినట్లు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

పాలక బీజేపీ పార్టీ గుర్తు కమలం. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న బీజేపీ ముఖ్య కార్యాలయాన్ని 'కమలం' అని కూడా పిలుస్తారు.

కాగా, డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలంగా మార్చాలనే ప్రతిపాదన వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని విజయ్ రూపానీ స్పష్టం చేసారు.

డ్రాగన్ ఫ్రూట్.. కమలం

రైతులు ఏమంటున్నారు?

సౌరాష్ట్రలో విసవాదర్ తాలూకాలోని జంబుదా గ్రామంలో జీవరాజ్‌భాయ్ వాఘేసియా డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు.

"మా అబ్బాయి స్నేహితులు రాజ్‌కోట్‌లో వీటిని పండిస్తున్నారు. వారి తోటలను చూసిన తరువాత నాకు కూడా పండించాలనిపించింది. గత నాలుగేళ్లుగా మేము డ్రాగన్ ఫ్రూట్ తోటలు పెంచుతున్నాం.

ఈసారి మేము 560 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటాం. వాటికి ఇప్పుడిప్పుడే పువ్వులు వస్తున్నాయి. సాధారణంగా మే-జూన్ మాసాలలో ఈ మొక్కలు నాటుతారు. కానీ ఈసారి నేను ప్రయోగాత్మకంగా శీతాకాలంలో నాటాను" అని జీవరాజ్‌భాయ్ తెలిపారు.

68 ఏళ జీవరాజ్‌భాయ్ డ్రాగన్ ఫ్రూట్ పంటకోసం ఐదున్నర లక్షలు ఖర్చు పెట్టారు. మూడేళ్లల్లో తన డబ్బు మొత్తం తిరిగి వచ్చేస్తుందని ఆశిస్తున్నారు. సాధారణంగా మొక్కలు నాటిన రెండో ఏడాదినుంచీ కాపు మొదలవుతుంది. మూడేళ్ల తరువాత ఈ పండ్లు విపరీతంగా కాయడం మొదలుపెడతాయి.

ఒక్కొక్క చెట్టుకు కనీసం 15-16 కిలోల పళ్లు కాస్తాయి. వీటిని కిలో రూ.250-300 చొప్పున మార్కెట్లో అమ్ముతారు. సీజన్లో కిలో రూ.150 నుంచీ రూ.400 దాకా ఉంటుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లను పెంచడం లాభసాటి వ్యాపారమేనని జీవరాజ్‌భాయ్ చెబుతున్నారు. వీటి ధర తగ్గినా కూడా ఏడాదికి కనీసం రెండున్నర లక్షలు సంపాదించవచ్చని ఆయన అంటున్నారు.

ముఖ్యంగా ఈ తోటలను పెంచడానికి ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. పురుగుమందులకోసం ఎక్కువ ఖర్చు చేయక్కర్లేదు. పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఉండి, నీటిపారుదల సౌకర్యాలు సమృద్ధిగా ఉంటే చాలు...డ్రాగన్ ఫ్రూట్ తోటలను సులువుగా పెంచవచ్చని జీవరాజ్‌భాయ్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వియత్నాం డ్రాగన్ ఫ్రూట్ల ఉత్పత్తిలో ముందుంది

కొత్త పేరు వలన పరిస్థితులు ఏమైనా మారుతాయా?

డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్చడంతో పాటు రైతులకు గ్రాంట్లు కూడా అందిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గి, ఈ పండ్ల సాగు లాభదాయకంగా ఉంటుందని జీవరాజ్‌భాయ్ అంటున్నారు.

గుజరాత్‌లో నవసారీ జిల్లాలోని పానాజ్ గ్రామానికి చెందిన ధర్మేశ్ లాడ్ గత 12 ఏళ్లుగా డ్రాగన్ ఫ్రూట్ల సాగు చేస్తున్నారు. హార్టీకల్చర్‌లో డిగ్రీ చేసిన తరువాత వ్యవసాయంలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టానని ధర్మేశ్ బీబీసీకి చెప్పారు.

"మా నాన్న థాయ్‌ల్యాండ్‌నుంచీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కను తీసుకొచ్చారు. దాన్ని ఒక ప్రయోగంలాగా నాటి చూసాం. తరువాత, పశ్చిమ బెంగాల్, పూణెనుంచీ మొక్కలు తెప్పించి నాటాం. ప్రస్తుతం ఒక ఎకరం భూమిలో ఎర్ర రంగు డ్రాగన్ ఫ్రూట్ తోటను పెంచుతున్నాం.

ఈ పళ్లు కిలో రూ.250 చొప్పున గిట్టుబాటు అవుతాయి. డ్రాగన్ ఫ్రూట్ తోటలు పెంచాలాంటే అధిక పెట్టుబడి అవసరం అవుతుంది. కానీ మూడేళ్ల తరువాత పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. వీటిని రాతి నేలలో కూడా సులభంగా పెంచొచ్చని" ధర్మేశ్ తెలిపారు.

ఈమధ్య డ్రాగన్ ఫ్రూట్‌నుంచీ జామ్, జెల్లీ కూడా తయారుచేస్తున్నారు. అందువల్ల వీటికి గిరాకీ బాగా పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

మిగతా పండ్లతో పోలిస్తే వీటి ధర ఎక్కువగా ఉండడం వలన గ్రామాల్లో ఇవి ఎక్కువగా అమ్ముడుపోవు. కానీ సూరత్, వడోదరాలాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో వీటికి బాగా డిమాండ్ ఉంటుంది. అన్ని పండ్లూ అమ్ముడైపోతాయని ధర్మేశ్ చెప్పారు.

డ్రాగన్ ఫ్రూట్.. కమలం

డెంగ్యూ వచ్చిన రోగులలో ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినడం మంచిదని చెబుతారు. ఈ నమ్మకం వలన డెంగ్యూ అధికంగా ఉన్నప్పుడు ఈ పండ్ల ధర కిలో రూ.500కు చేరుకుంటుంది.

టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, డ్రాగన్ ఫ్రూట్ శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి ఉపకరిస్తుంది. అలాగే, సీ విటమిన్ కూడా పుష్కలంగా లభించడంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

ఈ పండ్లు మంచి గిట్టుబాటు వ్యాపారం కాబట్టి రైతులకు కూడా మేలు చేస్తాయని ధర్మేశ్ తెలిపారు.

డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలంగా మార్చడం వలన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ధర్మేశ్ భావిస్తున్నారు. దానితో పాటుగా, ఇవి తినడం ఆరోగ్యానికి మంచిదనే ప్రచారాన్ని కల్పిస్తే ఈ పండ్ల పెంపకాన్ని ప్రోత్సహించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

గుజరాత్‌లోని కచ్ ప్రాంతం డ్రాగన్ ఫ్రూట్ల పెంపకంలో అగ్రశేణిలో ఉంది.

కచ్‌లోని కేరా బల్దియా ప్రాంతంలో భరత్ భాయ్ రాగవానీ రెండు ఎకరాల భూమిలో 900 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటారు. 42 ఏళ్ల భరత్ భాయ్ చాలా ఏళ్లు అహ్మదాబాద్‌లో కంప్యూటర్ షాపు నడిపేవారు. 2014లో కచ్‌కు తిరిగొచ్చి వ్యవసాయం ప్రారంభించారు. డ్రాగన్ ఫ్రూట్ తోటలను పెంచడం మొదలుపెట్టారు.

వరద ముప్పు లేని భూమి అయితే చాలు, డ్రాగన్ ఫ్రూట్ తోటలను పెంచవచ్చు..రాతి నేలలో కూడా సులువుగా పండుతాయి అని భరత్ భాయ్ తెలిపారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే...ఈ పండ్లకు అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది. కాబట్టి రైతులు ధర గురించి చింతించక్కర్లేదని ఆయన అన్నారు.

డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్చడం వల్ల ఏ ఉపయోగం లేదని భరత్ భాయ్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం రాజకీయమైన విషయమే అని ఆయన అన్నారు.

"ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, బ్యూరోక్రసీ...ఇవేవీ కూడా ఈ పండ్ల సాగుబడిని ప్రోత్సహించడానికి ఏమీ చేయలేదు. పేరు మార్చడం వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరవు. ప్రయోగాలను ప్రోత్సహిస్తూ, వ్యవస్థాపిత చర్యల ద్వారా మాత్రమే వ్యవసాయాన్ని ప్రోత్సహించవచ్చు" అని భరత్ భాయ్ చెప్పారు.

ఎరుపు రంగు డ్రాగన్ ఫ్రూట్ పండ్లకు డిమాండ్ ఎక్కువ

డ్రాగన్ ఫ్రూట్ ఏ జాతికి చెందినది? దీని దిగుబడి ఎక్కడ అధికంగా ఉంటుంది?

ఇది ముళ్లజెముడు (కాక్టస్) జాతికి చెందిన చెట్టు. మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టింది.

లాటిన్ అమెరికాలో ఈ పండును 'పితాయ' లేదా 'పితాహాయ' అని కూడా పిలుస్తారు.

లాటిన్ అమెరికానుంచీ వచ్చిన ఈ పండ్లను ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్‌లాండ్, వియత్నాంలలో చాలాకాలంగా పెంచుతున్నారు.

ఈ పండ్లలో కూడా కివీ పండ్ల మాదిరిగానే చిన్న చిన్న నల్లని గింజలు ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా వియత్నాం డ్రాగన్ ఫ్రూట్ల ఉత్పత్తిలో ముందుంది. ఈ పండ్ల ఎగుమతిలో కూడా వియత్నాందే పైచేయి. 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ వలసదారులతో పాటు ఈ పండు వియత్నాంలోకి ప్రవేశించింది. ఆ దేశంలో దీన్ని 'థాన్ లాంగ్' అని పిలుస్తారు. అంటే డ్రాగన్ కళ్లు అని అర్థం.

చైనా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, శ్రీలంకలలో కూడా ఈ పండ్లను విరివిగా పండిస్తున్నారు.

భారతదేశంలో 1990లనుంచీ వీటి పెంపకం ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఈ పండ్ల తోటల పెంపకం పెరిగింది.

సాంప్రదాయ పంటలకు బదులుగా కచ్, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో రైతులు డ్రాగన్ పండ్ల తోటలవైపు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.

గుజరాత్‌తోపాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు.

గుజరాత్‌లోని అనేకమంది రైతులు ఈ పండ్ల పెంపకం గురించి తెలుసుకోవడం కోసం పూణె వెళుతుంటారు. ఇంటర్నెట్‌లో కూడా విస్తారమైన సమాచారం లభ్యమవుతోంది.

ఈ పండ్ల లోపలి భాగం రెండు రకాలుగా ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. ఎరుపు పండ్లకు డిమాండ్ ఎక్కువ.

అయితే, భారతదేశంలో అనేకమంది దీన్ని స్థానిక ఫలంగానే భావిస్తున్నారు.

గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్'‌లో కచ్‌లో డ్రాగన్ ఫ్రూట్ల సాగుబడి చేస్తున్న రైతులను విశేషంగా ప్రశంసించారు.

కచ్ ప్రాంతం చాలాకాలం ఎడారిప్రాంతంగా ఉండేది. అయితే, ఇక్కడి రైతులు వివిధ రకాల పండ్లను పండిస్తూ ప్రయోగాలు చేయడంతో డ్రాగన్ ఫ్రూట్లలాంటివాటి సాగుబడి పెరిగింది.

ఈ కారణంగా డ్రాగన్ ఫ్రూట్ పెంపకాన్ని కూడా ఆత్మ నిర్భరత ప్రచారంలో భాగంగా పరిగణిస్తున్నారు.

గుజరాత్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు

గుజరాత్ ప్రభుత్వం డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్చడంలో సఫలమవుతుందా?

ఇండియాలో అనేకమంది డ్రాగన్ ఫ్రూట్‌ను చైనా ఫలంగా భావిస్తున్నారు. ఈ కారణంగా ఈ పండు పేరును కమలంగా మార్చాలని గుజరాత్ ప్రభుత్వం భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)కి ప్రతిపాదన పంపింది. దీన్ని ఇప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు పంపారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం, ఐసీఏఆర్ కేవలం సిఫారసు మాత్రమే చేయగలదు. వ్యవసాయ శాఖ, ఇతర శాఖలతో చర్చించి పండ్లు లేదా పంటల పేర్లను మార్చగలదు.

డ్రాగన్ ఫ్రూట్ భారతదేశ మూలాలకు చెందినది కాదు కాబట్టి..పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థలు, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్ఐ), నేషనల్ బయోడైవర్శిటీ అథారిటీ (ఎన్‌బీఏ)లనుంచీ కూడా ఈ ప్రతిపాదనకు సమ్మతి తీసుకోవాల్సి ఉంటుందని ఐసీఏఆర్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు.

అధికారికంగా ఈ పండు పేరును మార్చడంపై అంతర్జాతీయగా కూడా చట్టపరమైన అభ్యంతరాలు వెలువడవచ్చు. అందుకే బీఎస్ఐ, బీఎస్ఐల అనుమతి పొందడం ముఖ్యం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Where does the lotus like Dragon fruit grow in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X