మధ్య ప్రదేశ్ గవర్నర్ కన్నుమూత: తీవ్ర అనారోగ్యం: వెంటిలేటర్‌పై ఉంటూ: ఆరోగ్యం విషమించడంతో
లక్నో: మధ్య ప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ఉత్తర ప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అశుతోష్ టండన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన లాల్జీ టండన్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు.
11న ఆసుపత్రిలో చేరిన లాల్జీ
అయినప్పటికీ.. ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నరు. ఈ నెల 11వ తేదీన ఆయన లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి లాల్జీ టండన్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదు. ఫలితంగా వెంటిలేటర్‌పై ఉంచారు. సోమవారం నుంచి ఆయన వెంటిలేటర్‌పై కొనసాగుతున్నారు.

వెంటిలేటర్‌పై
మేదాంత ఆసుపత్రి డాక్టర్లు చేసిన వైద్యానికి ఆయన శరీరం స్పందించడం మానేసినట్లు చెబుతున్నారు. దీనితో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. చికిత్స కొనసాగుతున్న కొద్దీ ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నం అయ్యాయని మేదాంత ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ రాకేష్ కపూర్ తెలిపారు. మూత్రనాళ ఇబ్బందులు తలెత్తాయని, క్రమంగా తీవ్ర జ్వరం బారిన పడ్డారని చెప్పారు. ఆయనకు అందిస్తోన్న వైద్య చికిత్సపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఆరా తీశారు. రాకేష్ కపూర్‌తో మాట్లాడారు. నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. అవేవీ ఫలించలేదు.
యూపీ బీజేపీ నేతగా..
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లాల్జీ టండన్ భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీని విస్తరించడంలో ఆయన పాత్రను విస్మరించలేమని పార్టీ నేతలు చెబుతున్నారు. లాల్జీ టండన్ మరణం పట్ల ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపింది. లాల్జీ టండన్ కుమారుడు అశుతోష్ టండన్ ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. పట్టాణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. లాల్జీ టండన్ మరణవార్త తెలియగానే ఉత్తర ప్రదేశ్ బీజేపీ నేతలు క్రమంగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సంతాపాన్ని తెలిపారు.

సాయంత్రమే అంత్యక్రియలు..
లాల్జీ టండన్ భౌతిక కాాయానికి మంగళవారం సాయంత్రమే అంత్యక్రియలను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ సాయంత్రం 4:30 గంటలకు లక్నోలోని గులాల్ ఘాట్ చౌక్ వద్ద గల శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహిస్తారని సమాచారం. లాల్జీ టండన్ భౌతిక కాయాన్ని సందర్శించడానికి బీజేపీ నేతలు, పార్టీ నాయకులు తుది నివాళి అర్పించడానికి ఈ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హజ్రత్ గంజ్‌లోని పార్టీ కార్యాలయంలో ఉంచుతారని తెలుస్తోంది. 12 గంటల తరువాత సోంధీ టోలా చౌక్‌లోని నివాసానికి తరలిస్తారని ప్రాథమిక సమాచారం. అనంతరం అక్కడి నుంచే అంతిమయాత్ర నిర్వహిస్తారని చెబుతున్నారు.