
తమిళనాడు గవర్నర్ తొలగింపు పిటిషన్ డిస్మిస్ చేసిన మద్రాసు హైకోర్టు
చెన్నై: తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌ను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం ధర్మాసనం కొట్టివేసింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ఏడుగురిని విడుదల చేయాల్సిందిగా తీర్మానిస్తూ గతంలో ఏఐఏడీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది.
ఈ మేరకు వారిని విడుదల చేయాలని గత ఏడాది సెప్టెంబర్ 9 కోరింది. దీనిపై గవర్నర్ ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. దాదాపు 15 నెలలు గడుస్తున్నా ప్రభుత్వ తీర్మానంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగ ధిక్కరణ కిందికి వస్తుందని, అందువల్ల ఆయన్ని వెంటనే తొలగించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్ ను మద్రాసు హైకోర్టు డిస్మిస్ చేసింది.

అయితే, నిందితులను విడుదల చేసే అధికారం గవర్నర్‌కు లేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారిస్తున్నందున గవర్నర్ ఏదైనా నిర్ణయం తీసుకునేముందు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
సెప్టెంబర్ 10, 2018లో రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేసే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది. ఇలా చేస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశం ఉందని అభిప్రాయపడింది.