మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ఉన్నవారు వీరే?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలను నమోదు చేయడంతో పాటు.. రెండు రాష్ట్రాల్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. హర్యానాలో సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎవరూ ముఖ్యమంత్రి పదవిని అదిష్టంచబోతున్నారన్న అంశంపై సమావేశంలో నెలకొన్న సందిగ్దతకు సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో తెరపడనుంది.
మహారాష్ట్రలో జరిగిన పోరులో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించడంతో ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కనుందన్న అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేసులో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, సీనియర్ నేత ఏక్ నాథ్ ఖడ్సే, దివంగత నేత గోపినాథ్ ముండే కుమర్తె పంకజా ముండే తదితరులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ 80, శివసేన 45, కాంగ్రెస్ 30, ఎన్సీపీ 30 స్దానాలను గెలుచుకున్నాయి. ఎన్నికల కౌంటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. అధిక స్దానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది.

దేవేంద్ర ఫడ్నవిస్
నాగ్ పూర్‌కు చెందిన దేవేంద్ర గంగాధర ఫడ్నవిస్‌కు మంచి పేరుంది. బ్రాహ్మాణ వర్గానికి చెందిన వాడు. ఆర్ఎస్ఎస్ కేంద్రస్దానమైన నాగ్ పూర్ నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ - ఎన్సీపీలపై విమర్శలో ఆయన ముందుండేవారు. ముంబైపై ఉగ్రవాదుల దాడులు, ఇరిగేషన్ కుంభకోణం.. తదితర అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు.
వృత్తిరీత్యా న్యాయవాదైన ఫడ్వవిస్కు నాగ్ పూర్ మంచి పేరుంది. సామాన్యవ్యక్తిలాగే టికెట్ తీసుకోని రైళ్లలో ప్రయాణిస్తుంటారు. టోల్ ప్లాజాల్లో కూడా ఎమ్మెల్యే గుర్తింపు కార్డు లేకపోతే ఇతర ప్రయాణీకుల్లాగే టోల్ ఫీజు కడతారు. మహారాష్ట్ర తాజా ఎన్నికల్లో అలుపెరగకుండా ప్రచారం నిర్వహించి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఏక్ నాథ్‌ఖడ్సే
రైతు నాయకుడిగా పేరొందిన ఏక్ నాథ్‌ఖడ్సే మృదు స్వభాషి. ఉత్తర మహారాష్ట్రలోని జల్ గావ్‌లోని ముక్తాయ్ నగర్‌కు ఆయన 1989 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 1995లో శివసేన్- భాజపా ప్రభు్త్వం ఆర్దికమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
పంకజా ముండే
దివంగత మాజీ కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె. ముండే వారసురాలిగా గుర్తింపు పొందారు. 2009లో మహారాష్ట్ర అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో ఓబీసీ నేతగా పేరుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీడ్ జిల్లాలోని పార్లి నియోజక వర్గం నుంచి విజయం సాధించారు. ఈ సందర్బంలో ఆమె మాట్లాడుతూ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. గోపీనాథ్‌ను అభిమానించేవారు తనని ముఖ్యమంత్రి రేసులో చూడాలని అనుకుంటున్నారని మాత్రమే చెప్పా. పార్టీ ఎంపిక చేసిన ముఖ్యమంత్రి అభ్యర్ధితో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాను. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ విజయం ప్రధాని నరేంద్రమోడీ వల్లే సాధ్యమైందని అన్నారు.
వినోద్ తవడే
ఒక వేళ పార్టీ మరాఠాలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తవడే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ముంబై మహా నగరంలో కార్మికుల ప్రతినిధిగా ఆయనకు పేరుంది. కార్మికులను భాజపా వైపు మళ్లించడంలో ఎనలేని కృషి చేశారు.
నితిన్ గడ్కరీ
మహారాష్ట్ర సీఎం రేసులో తాను లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. సాయంత్రం జరిగే బీజేపీ పార్లమెంటరీ భేటీలో సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ అభిప్రాయం తేలాకే తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు.