
మహారాష్ట్ర సంక్షోభం: షిండేతో చర్చలకు రాయబారులను పంపిన ఉద్ధవ్.. షిండేకు డిప్యూటీసీఎం పదవి?
మహారాష్ట్రలో మంత్రి ఏకనాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు బావుటా ఎగుర వేయడంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. మహారాష్ట్రలో అధికార మహా వికాస అఘాడీ సర్కార్ కుప్ప కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఊహించని పరిణామంతో ఉద్ధవ్ థాకరేకు చెమటలు పడుతున్నాయి. చెయ్యి దాటిపోతున్న పరిస్థితులను మళ్ళీ అనుకూలంగా మార్చుకోవాలని ఉద్ధవ్ నానా తంటాలు పడుతున్నారు.

మహారాష్ట్రలో మంత్రి షిండే పెట్టిన కుంపటి .. గుజరాత్ లో రిసార్ట్ పాలిటిక్స్
సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి బిజెపి ఊహించని షాక్ ఇవ్వగా శివసేన కు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గుజరాత్లో రిసార్ట్ పాలిటిక్స్ కు తెరతీశారు. దీంతో శివసేనలో చీలికలు మొదలైనట్టు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలుతుంది అన్న టాక్ వినిపిస్తుంది. అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కనీసం ఫోన్ కాల్ కు కూడా స్పందించడం లేదని సమాచారం. ఇక ఇదే సమయంలో సూరత్‌లో ఉన్న మా ఎమ్మెల్యేలతో మేము టచ్‌లో ఉన్నాం అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

శివసేన ఎమ్మెల్యేలు సూరత్ లో.. ఆందోళనలో శివసేన
ఉద్ధవ్ థాకరే మరియు శరత్ పవార్ లతో పరిస్థితిని చర్చిస్తున్నామని తెలిపారు. తామే కింగ్మేకర్లమనే ఆలోచనతో పనిచేసేవారు విఫలమవుతారని సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజమైన శివసేన నాయకుడైతే షిండే తిరిగి వస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శివసేన ఎమ్మెల్యేలు గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్నారని, వారిని బయటకు వెళ్లనివ్వడం లేదని విన్నామని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. బిజెపి మహా వికాస అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలించబోదు అని తేల్చిచెప్పారు. బయటకు ప్రభుత్వం కూలదు అని చెప్పినా శివసేన నాయకులలో ఆందోళన నెలకొంది.

షిండేతో చర్చలకు రాయబారులను పంపిన ఉద్ధవ్.. షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి?
ఇక దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఏకనాథ్ షిండే తిరుగుబాటును అణిచివేసేందుకు రాయబారులను రంగంలోకి దింపారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సన్నిహితుడు, అత్యంత అనుభవశాలి అయిన నేతతో సహా శివసేన నేతల బృందం ఏకనాథ్ షిండేను కలిసేందుకు సూరత్ వెళ్ళారు. దీంతో షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది. ఒకవేళ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆయన తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది . ఏక్నాథ్ షిండేతో ప్రస్తుతం శివసేన నాయకులు చర్చలు జరుపుతున్నారు. మరి ఈ చర్చలు ఫలిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.