
మహారాష్ట్రలో జరిగేది ఇదే- ఉద్ధవ్ కు గవర్నర్ లేఖతో తేలిపోయిందా ? కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైనట్లే కనిపిస్తోంది. శివసేనలో తలెత్తిన తిరుగుబాటుతో మైనార్టీ పడిపోయిన మహా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు విపక్ష బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇవాళ సీఎం ఉద్ధవ్ థాక్రేకు రాసిన లేఖలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

సీఎం ఉద్ధవ్ థాక్రేకు రాసిన లేఖలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ.. మీ ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలో ఉందని బిజెపి, ఇతరుల నుంచి తనకు లేఖలు అందాయని తెలిపారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం నుండి వైదొలగాలని భావిస్తున్నట్లు శివసేన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది స్పష్టమైన సూచన ఇచ్చారని.. మీరు మీ ఎమ్మెల్యేలను, క్యాడర్ను ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని ప్రయత్నిస్తున్నారని స్పష్టమైందన్నారు. కాబట్టి మీరు, మీ ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రభుత్వం మైనారిటీలో ఉందని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

బలపరీక్ష ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, స్వతంత్ర ఏజెన్సీ ద్వారా విధానసభ సెక్రటేరియట్ ద్వారా కార్యకలాపాలు కెమెరాలో రికార్డ్ చేస్తామని సీఎంకు రాసిన లేఖలో గవర్నర్ తెలిపారు. స్వేచ్ఛగా , నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా చూసేందుకు, ఓట్ల లెక్కింపు కోసం సభ్యులను తమ స్థానాల్లో లేవమని చెప్పడం ద్వారా దీన్ని నిర్వహిస్తామన్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ నేతలు తనను కలిసి, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణం మెజారిటీ కోల్పోయిందని వాదించిన ఒక రోజు తర్వాత గవర్నర్ బలపరీక్షకు ఆదేశించారు.
గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ థాకరే ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారి అనర్హతపై ఇంకా స్పందించలేదని, ఈ అంశం కోర్టులో పెండింగ్లో ఉందని ఆయన వాదించారు. దీనిపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది.