వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వెలగపూడి గ్రామం

అమరావతి పరిధిలోని వెలగపూడిలో ఎస్సీ కాలనీలో డిసెంబర్ 27వ తేదీ ఆదివారం ఘర్షణ జరిగింది. రాళ్ల దాడిలో ఓ మహిళ మరణించారు. ఈ గొడవంతా మొదలైంది కాలనీకి పేర్లు, విగ్రహాల విషయంలో.

గ్రామంలో దశాబ్దాల నుంచి రెండు కులాల మధ్య చిన్న చిన్న గొడవలున్నాయి. రెండుమూడేళ్లకోసారి ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. గతంలో హత్యల వరకూ వెళ్లిన చరిత్ర కూడా ఉంది. ఈ రెండు కులాల మధ్య ఉన్న గొడవలకు, ఇద్దరు జాతీయ నాయకులు అస్త్రాలుగా మారారు.

తమ మధ్య విభేదాల నేపథ్యంలో ఇక్కడ మాదిగలు జగ్జీవన్ రాం పేరును, మాలలు అంబేడ్కర్ పేరును వాడుకుంటున్నారు.

వివాదం ఎలా మొదలైంది?

గ్రామంలో కొత్తగా వేసిన సిమెంటు రోడ్డు దగ్గర ఒక ఆర్చి నిర్మించి దానికి జగ్జీవన్ రాం పేరు పెట్టడంతో గొడవలు మొదలయ్యాయి. రోడ్డుపై సిమెంటు పచ్చిగా ఉన్నప్పుడే దానిపై కొందరు నడవడం, ఒక అద్దె ఇల్లు ఖాళీ చేసే వ్యవహారం గొడవలకు తక్షణ కారణమని తెలుస్తోంది.

''వెలగపూడి ఎస్సీ కాలనీలో రోడ్డును ఆనుకుని మాలల ఇళ్లు ఉంటాయి. కాస్త లోపలికి మాదిగల ఇళ్లు ఉంటాయి. కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డుపై ఒక ఆర్చి నిర్మించాలని మాదిగలు తలపెట్టారు. కానీ, దానికి మాలలు అభ్యంతరం పెట్టారు. అప్పటి నుంచి కాస్త అసంతృప్తి మొదలైంది. ఇక రోడ్డు పచ్చిగా ఉన్నప్పుడు ఒక కులం కుర్రాడు పొరపాటున కాలు వేస్తే, మరో కులం వ్యక్తి కొట్టాడు అనే వార్త వచ్చింది. దాంతో గొడవ ముదిరింది. మరోవైపు ఆర్చి విషయంలో పంచాయతీ అనుమతి కోసం ప్రయత్నాలు, అభ్యంతరాలపై చర్చలు కూడా సాగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఆదివారం సాయంత్రం మరియమ్మ (మరణించిన మహిళ, మాల) ఇంట్లో మాదిగ కులానికి చెందిన కుటుంబం అద్దెకు ఉంటోంది. వారిని ఇల్లు ఖాళీ చేయమని చెప్పడంతో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ పెద్ద ఘర్షణకు దారి తీసి రాళ్లు రువ్వుకునే వరకూ వెళ్లింది. అంతకుముందు నాలుగు రోజుల నుంచి నివురుగప్పి ఉన్న వ్యవహారం ఒక్కసారి భగ్గుమంది'' అంటూ ఘర్షణ జరిగిన క్రమాన్ని బీబీసీకి వివరించారు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని, ఈ రెండు కులాలకు చెందని వెలగపూడి గ్రామస్తుడు ఒకరు.

వెలగపూడి గ్రామంలో మాల వర్సెస్ మాదిగ

ఒక వర్గం వాదన..

ఈ విషయంలో మాల, మాదిగల వాదనలు భిన్నంగా ఉన్నాయి.

''24వ తేదీ రాత్రి రోడ్డు పచ్చిగా ఉన్నప్పుడు కొందరు మాదిగ యువకులు దానిపై వాహనాలతో తిరిగారు. అలా చేయొద్దని కొందరు చెప్పడంతో చిన్న గొడవ అయింది. తెల్లారి పోలీసులు వచ్చారు. శుక్రవారం క్రిస్మస్ పండుగ రోజు కూడా మరోసారి చిన్న గొడవైనా... తరువాత సర్దుకుంది. తిరిగి 2-3 రోజుల తరువాత వాళ్లు (మాదిగలు) ఒక ప్లాన్‌తో వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లోని తమ కులం వాళ్లను పోగు చేసుకుని వచ్చారు. ఎదురుగా ఉన్న రెండస్తుల భవనం నుంచి రాళ్లు వేశారు. మాలల వీధిపై రాళ్లు వేశారు. తరువాత మాలలు అవే రాళ్లను తీసుకుని తిరిగి కొట్టారు. ఇదంతా రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో జరిగింది'' అని బీబీసీకి వివరించారు మాల వర్గానికి చెందిన వ్యక్తి.

చనిపోయిన మరియమ్మ ఇంట్లో అద్దెకు ఉంటున్న మాదిగ వర్గం వారిని ఖాళీ చేయించమని అడిగింది వాస్తవమేనని వారు చెప్పారు.

''తక్షణం ఖాళీ చేయమని అడగలేదు. కొంత గడువిచ్చారు. గ్రామంలో రెండు కులాల మధ్యా సఖ్యత లేనందున మనం ఒకే ఇంట్లో ఉండడం సరికాదన్న ఉద్దేశంతోనే ఖాళీ చేయమన్నారు. కానీ అదే వంకగా మాదిగలు రెచ్చిపోయారు'' అంటూ చెప్పుకొచ్చారు మాల వర్గానికి చెందిన వ్యక్తి.

''మాదిగలు మాపై రాళ్లు వేశారు. గతంలో రెండు కులాల మధ్య జరిగిన గొడవలు హత్యకు దారితీశాయి. అది మనసులో పెట్టుకుని, చరిత్ర రిపీట్ అవుతుందని మమ్మల్ని హెచ్చరించారు మాదిగలు'' అని బీబీసీకి చెప్పారు మాల వర్గానికి చెందిన వ్యక్తి.

వెలగపూడి గ్రామంలో మాల వర్సెస్ మాదిగ

మరో వర్గం వాదన..

మాదిగల వాదన భిన్నంగా ఉంది. ముందుగా ప్లాన్ ప్రకారం గొడవకు వచ్చింది మాలలే అని వారు చెబుతున్నారు.

''సిమెంటు రోడ్డు దగ్గర క్రిస్మస్ స్టార్ పెట్టుకోవడానికి ఐరన్ రాడ్ పాతాలని ప్రయత్నించాం. దానికే వారు మేమేదో ఆర్చి కట్టేసి దానికి జగ్జీవన్ రాం కాలనీగా పేరు పెడుతన్నామంటూ పుకారు పుట్టించారు. దీనిపై కొందరు మాలలను రెచ్చగొట్టడంతో వారు రెండు మూడు రోజులు ప్లాన్ చేసి, స్కెచ్ వేసి దాడి చేశారు. మాల పల్లెలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు. అతనే వారిని రెచ్చగొడుతున్నాడు. గ్రామంలోని మాదిగలంతా ఆ మాల కులానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని తీర్మానం చేశాం. ఆ విషయాన్ని పసిగట్టిన సదరు ప్రభుత్వ ఉద్యోగి ముందుగా అలర్ట్ అయి మాపై దాడి చేయించాడు. ఒకేసారి 80-90 మంది మాలలు మాపై దండెత్తి వచ్చారు'' అని వివరించారు మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి.

''మాలలు మా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రాళ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. నరుకుతాం అంటూ మాట్లాడారు. దీంతో మాదిగలు కూడా ఆ దాడిని ప్రతిఘటించారు. అప్పుడు గొడవలు జరిగాయి. అయితే మాదిగల వైపు తాటి చెట్లు, ఓ గోడ అడ్డుగా ఉండడంతో మాదిగలకు తక్కువ గాయాలయ్యాయి. మరియమ్మ (చనిపోయిన మహిళ) పై ఎవరూ ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదు. బహుశా ఆమె ఆ సమయంలో ఇంట్లోంచి రావడం వల్ల రాళ్లదాడిలో గాయపడి ఉండొచ్చు. అది కూడా మాలలు విసిరిన రాళ్లే తగిలే అవకాశం ఎక్కువ. కానీ ఆమెను ఇనుపరాడ్లతో కొట్టారని చెబుతున్నారు. అది అవాస్తవం. అసలు ఇనుప ఆయుధాలు ఎవరూ వాడలేదు. కావాలనే మాదిగలను ఇరికించడానికి మాలలు ఇలా అబద్ధాలాడుతున్నారు'' అని ఆరోపించారు మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి.

''గొడవలకు ముందు గ్రామంలో మాల కులంలో ఒక పెళ్లి అయితే దానికి ఆ కులానికి చెందిన నాయకులు, పెద్దలు కొందరు వచ్చారు. హోంమంత్రి సుచరిత భర్త కూడా ఆ పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. ఆ పెళ్లి తరువాత మాలల పద్ధతి మారింది. అప్పటి నుంచి వారు దాడి ప్రణాళిక వేసుకుంటున్నారు. అది గమనించే మేమూ కాస్త జాగ్రత్త పడ్డాం. మేం కూడా పక్క ఊళ్ల నుంచి మావాళ్లను (మాదిగలను) పోగుచేసుకున్నాం. కానీ ఇంతకు తెగిస్తారని అనుకోలేదు'' అన్నారు మాదిగ పల్లెకు చెందిన మరో వ్యక్తి.

వెలగపూడి గ్రామంలో మాల వర్సెస్ మాదిగ మంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేశ్

ఇతర కులస్తులు ఏమంటున్నారంటే..

''వాళ్ల మధ్య ఎప్పటి నుంచో పాత గొడవలు కూడా ఉన్నాయి. తాజా వ్యవహారం కూడా చిన్నదే. గ్రామంలో కూర్చుని మాట్లాడుకుంటే పోయేది. కానీ ఈ గొడవల ఆధారంగా రాజకీయంగా ఎదగాలని, తమ వర్గాల్లో పట్టు పెంచుకోవాలని ప్రయత్నించే వ్యక్తులు కొందరు ఉన్నారు. వారు రెచ్చగొడుతున్నారు. దానికి తోడు ఓ కులంవారు ఎంపీ (నందిగం సురేశ్) వరకూ వెళ్లారు. ఊళ్లోవాళ్లం మేం జోక్యం చేసుకుందాం అనుకున్నా, వారు ఎస్సీలు, మేం ఇతర కులాల వాళ్లం. తేడా వస్తే మాపై కేసులు పెడతారని భయం'' అని చెప్పారు వెలగపూడి గ్రామానికి చెందిన మరో వ్యక్తి.

ఎంపీ, మంత్రి పాత్ర ఎంత?

ఈ ఘటనలో మాదిగలు దూకుడుగా వెళ్లడానికి కారణం వారి వెనుక ఎంపీ నందిగం సురేశ్ ఉన్నారని మాలలు ఆరోపిస్తున్నారు. ఆయన బలం చూసుకునే మాదిగలు ఆర్చి విషయంలో ముందుకు వెళ్తున్నారని వారు అంటున్నారు. ఆర్చ్ విషయంలో ఎంపీ సురేశ్ స్థానిక సీఐతో మాట్లాడారని కూడా ఆరోపించారు.

ఈ పరిస్థితుల్లో మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన సురేశ్‌పై మాల వర్గం వారు మాటల దాడికి దిగారు. భౌతిక దాడికీ ప్రయత్నించారు.

ఇక ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా, హోం మంత్రి సుచరిత భర్త, మరో ఐపీఎస్ అధికారి అండ చూసుకునే మాలలు చెలరేగిపోయారని మాదిగ వర్గం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై ఆ నాయకులు స్పందించాల్సి ఉంది.

అంబేడ్కర్ వర్సెస్ జగజ్జీవన్ రామ్

గ్రామంలో అంబేడ్కర్ Vs జగ్జీవన్ రాం అన్నట్లుగా మారిన వివాదం

అంబేడ్కర్‌ను దళితులంతా సొంతం చేసుకున్నప్పటికీ, ఆయనతో పాటు జగ్జీవన్ రాంను తమ వాడిగా గుర్తించడం మొదలుపెట్టారు మాదిగలు. దీంతో మాలలు అంబేడ్కర్, మాదిగలు జగ్జీవన్ రాం అన్నట్టు తయారైంది పరిస్థితి. అంబేడ్కర్ విగ్రహంలాగానే మాదిగలు ఉండే చోట జగ్జీవన్ రాం విగ్రహాలను పెట్టడం ప్రారంభమైంది. ఈ గ్రామంలో ఆ చీలిక బలంగా ఉంది.

''గ్రామంలో మాదిగలు జగ్జీవన్ రాం విగ్రహం పెట్టుకున్నారు. మేం దానికి ఒప్పుకున్నాం. తరువాత మేం అంబేడ్కర్ విగ్రహం కూడా పెట్టుకున్నాం. దాని వరకూ సమస్య లేదు. కానీ ఆర్చ్ మీద జగ్జీవన్ రాం పేరు పెట్టడానికి మేం ఎలా ఒప్పుకుంటాం? ఈ వీధంతా మాలలే ఉన్నారు? అలాంటప్పుడు జగ్జీవన్ పేరు ఎలా పెడతారు? ఇది మాల పల్లెనా? మాదిగ పల్లెనా? అనే ప్రశ్న వస్తుంది కదా?'' అని ప్రశ్నించారు మాల వర్గానికి చెందిన మరో వ్యక్తి.

''ముందుగా మేం మా స్థలంలో జగ్జీవన్ రాం విగ్రహం పెట్టాం. అది చూసి తరువాత, వాళ్లు సదరు ప్రభుత్వ ఉద్యోగి సహకారంతో మాల - మాదిగల ఉమ్మడి స్థలంలో అంబేడ్కర్ విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం ఉన్న చోట గతంలో అపకర్మలు నిర్వహించే ఆనవాయితీ ఉండేది. ఆ విషయంలో కూడా గొడవలై, కేసుల వరకూ వెళ్లింది పరిస్థితి'' అన్నారు మాదిగ వ్యక్తి.

పాత కక్షలు

ఈ గ్రామంలో మాల, మాదిగ కులాల మధ్య దాదాపు పాతికేళ్ల క్రితం, సుమారు 1993 ప్రాంతంలో తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఈ రెండు కులాల మధ్య జరిగిన ఘర్షణలు హత్యకు కూడా దారి తీశాయి. ఆ కేసులు రెండేళ్ల క్రితం వరకూ నడిచాయని వెలగపూడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బీబీసీతో చెప్పారు. ఈ గ్రామంలో మాల, మాదిగలకు చర్చిలు కూడా వేర్వేరుగా ఉన్నాయి.

ప్రభుత్వ సాయం

బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి రాష్ట్ర హోం మంత్రి సుచరిత గుంటూరు జిల్లాకు చెందిన దళిత నాయకులతో కలసి వెళ్లారు. అప్పుడు కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆమె వెంట సురేశ్ కూడా ఉన్నారు. బాధ్యులపై చర్య తీసుకుంటామని ప్రకటించిన హోం మంత్రి, బాధితులకు పరిహారం ప్రకటించారు.

కులాలను నిర్మూలించాలనే నినాదం రాసిన తలగుడ్డ కట్టుకున్న ఓ దళిత మహిళ

మాల, మాదిగల మధ్య వివాదం ఎందుకు?

దళితులుగా పిలుస్తున్న షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ) జాబితాలో సుమారు 60 కులాలు ఉన్నాయి. వాటిలో మాల, మాదిగ కులాలు సంఖ్యా పరంగా, ఆర్థికంగా మిగతా వారి కంటే కాస్త పెద్దవి, మెరుగైనవి. ఈ అన్ని కులాలకు కలిపి ఉమ్మడిగా రిజర్వేషన్ అమలయ్యేది. కానీ ఆ ఫలాలు ఎస్సీల్లోని కొన్ని కులాలే ఎక్కువగా పొందుతున్నాయని గుర్తించిన మిగిలిన వర్గాలు ఆందోళన చేసి, రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకున్నాయి. అంటే ఎస్సీలకు వచ్చే మొత్తం రిజర్వేషన్ కోటాను తిరిగి విభజించి కులాల వారీగా పంచుతారు. ఇలా రిజర్వేషన్లను విభజించి పంచడాన్ని మాదిగలు స్వాగతిస్తుండగా, మాలలు వ్యతిరేకిస్తున్నారు. మాల, మాదిగ కాకుండా రెల్లి వంటి ఎస్సీ కులాలు ఈ పోరులో అటో, ఇటో నిలిచాయి. కొన్ని కులాలు కనుమరుగైపోతున్నాయి కూడా. ఈ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలోనే మాల, మాదిగ కులాల మధ్య చీలిక ఏర్పడి, బాగా ముదిరింది.

అంబేడ్కర్ - జగ్జీవన్‌లకు కులం ఆపాదిండం కరెక్టేనా?

''అంబేడ్కర్, జగ్జీవన్ రాంలకు కులం మనం అంటగట్టాం. ఆ మహానాయకుల చరిత్ర తెలిసిన వారు, వారి మహోన్నత ఆశయాలు తెలిసిన వారు కొట్లాడుకోరు. అలాంటివారికి చరిత్ర తెలియదు. ఆ మహానాయకులకు కులాన్ని అంటగట్టి అది మన మెదళ్లకు అంటించారు. ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే ఉపయోగపడుతుంది. అసలు అంబేడ్కర్‌నే ఎస్సీలకు పరిమితం చేస్తున్నారని బాధపడుతుంటే, దళితనాయకుల విషయంలో కులం పేరుతో కొట్లాటలు సరికాదు'' అని బీబీసీతో అన్నారు ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి.

''ఏ రెండు కులాలు కొట్టుకున్నా ఎవరికీ సమస్య ఉండదు. కానీ దళిత కులాలు కొట్లాడుకుంటే మాత్రం అదే పెద్ద సమస్యగా చూస్తారు. ఎస్సీల్లోని కులాల మధ్య కొట్లాటలను చూసే దృక్పథంలోనే సమస్య ఉంది. కులం నిచ్చెన మెట్ల వ్యవస్థకు మాల, మాదిగలు మినహాయింపు కాదు. దళితులు కాబట్టి కలిసుండాలన్న ఆదర్శం వాళ్ల బాధ్యతగా మనం చూస్తాం. కానీ అంటరానితనం అనే ఒక కామన్ పాయింట్ మాత్రమే వాళ్లను కలుపుతుంది తప్ప, అంతకుమించి ఏమీ లేదు. దళితులు 61 కులాలుగా ఉన్నారు. అసలు మాల, మాదిగల మధ్య మంచం పొత్తు, కంచం పొత్తు కూడా లేదు. ఆ మాటకొస్తే అసలు మాల, మాదిగలు కాకుండా మిగతా కులాలు ఎటుపోయాయో ఎవరికీ తెలీదు. ఇప్పుడు వారిని కులాల వారీగా, మతాల వారీగా, డబ్బు ఆధారంగా విడగొట్టే ప్రయత్నాలు బలంగా సాగుతున్నాయి. ఆ విభజన ప్రయత్నాలకు పైపైకి కనిపించే వంకే ఈ విగ్రహాలు. అసలు ఈ గొడవను కులాల పంచాయితీగా చూడాలి తప్ప, దళితుల పంచాయితీగా కాదు'' అని చెప్పారు సుజాత.

"అభ్యుదయ భావం ఉన్నవారు అసలు కులాన్ని నిర్మూలించేలా సాగాలి. అంతేకానీ దాన్ని బలోపేతం చేసేలా కాదు. ఆ కుల నిర్మూలన కేవలం ఎస్సీ కులాల మధ్యే కాదు, అన్ని కులాల మధ్యా సాగాలి" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Mala vs Madiga in AP's Velagapudi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X