congress mallikarjun kharge gulam nabi azad rajyasabha కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గులాం నబీ ఆజాద్ రాజ్యసభ politics
ఆజాద్‌కు వీడ్కోలు: రాజ్యసభ కొత్త ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే..ఛైర్మెన్‌కు ప్రతిపాదించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 15న రాజ్యసభ సభ్యత్వం నుంచి పదవీవిరమణ పొందనున్న కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దల సభలో ప్రతిపక్షనేత గులాం నబీఆజాద్ స్థానంలో మరో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ నియమించింది. గులాం నబీ ఆజాద్ రిటైర్ అయ్యాక రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఖర్గే వ్యవహరించనున్నారు. ఇదే విషయాన్ని రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు సమాచారం ఇచ్చింది కాంగ్రెస్.
మంగళవారం నలుగురు రాజ్యసభ సభ్యులు రిటైర్ కానున్నారు. వీరిలో ఒకరిగా గులాంనబీ ఆజాద్ ఉన్నారు. ఇప్పటికే రిటైర్ కానున్న ఆజాద్ గురించి ప్రధాని భావోద్వేగంతో కూడిన ప్రసంగం పెద్దల సభలో చేశారు. ఆ సమయంలో గులాం నబీ ఆజాద్ సేవలను కొనియాడుతూ అతనితో తనకున్న సన్నిహితాన్ని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఆజాద్ గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు ప్రధాని మోడీ. ఆజాద్ అటు పార్టీ కోసం కృషి చేస్తూనే ఇటు దేశ ప్రయోజనాలను కాపాడటంలో విలువైన సలహాలు సూచనలు చేశారని అలాంటి నేత లోటును భర్తీ చేయలేమని మోడీ చెప్పారు.

ఇక రాజ్యసభలో ప్రతిపక్షనేతగా కర్నాటకకు చెందిన సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపడతారు. నలుగురు గాంధీ కుటుంబ సభ్యుల నేతృత్వంలో ఖర్గే పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్గే ఎంతో కష్టపడ్డారని ఆ పార్టీ పెద్దలు కొనియాడారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఆజాద్ కొనసాగుతూ వస్తున్నారు.1990లో తొలిసారిగా రాజ్యసభకు గులాంనబీ ఆజాద్ ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబానికి విధేయుడనే గుర్తింపు ఉన్న ఆజాద్... కాంగ్రెస్‌లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని గొంతెత్తిన వారిలో ఒకరిగా నిలిచారు ఆజాద్.
ఇదిలా ఉంటే ఏప్రిల్ వరకు మళ్లీ రాజ్యసభ ఎన్నికలు లేవు. అయితే కేరళలో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నప్పటికీ తిరిగి ఆజాద్‌ను అక్కడి నుంచి పెద్దల సభకు పంపాలంటే పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే చిదంబరం, దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మలు కూడా ప్రతిపక్ష నేతకు పోటీలో ఉన్నప్పటికీ ఖర్గే వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది.లోక్‌సభ ప్రతిపక్షనేతగా 2014-2019 సభలో వ్యవహరించిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఖర్గే వైపే అధిష్టానం నిలిచిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.