భారత్ బంద్‌పై మమతా బెనర్జీ ట్విస్ట్... ఆ చట్టాలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూనే...
గాంధీ హంతకులకు పశ్చిమ బెంగాల్ ఎన్నటికీ తలవంచదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌పై ఇతరుల నియంత్రణను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోదన్నారు. అంతేకాదు,బీజేపీ అధికార దుర్వినియోగం పట్ల మౌనంగా ఉండటం కంటే జైల్లో ఉండటానికైనా తాను సిద్దమేనని పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని లేదా కేంద్రంలో అధికారం నుంచి తప్పుకోవాలని మమతా ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్‌లో సోమవారం(డిసెంబర్ 7) ఏర్పాటు చేసిన ఓ సభలో మమతా మాట్లాడారు.

బంద్‌కు మద్దతునివ్వట్లేదు... మమతా ట్విస్ట్...
'సింగూరు విషయంలో ఏం జరిగిందో నేనిప్పటికీ మరిచిపోలేదు. రైతులకు మా పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నా. కేంద్రం తక్షణమే ఆ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి లేదా ప్రభుత్వం నుంచి దిగిపోవాలి. రైతుల హక్కులను కాలరాసిన ప్రభుత్వం కేంద్రంలో ఇక అధికారంలో కొనసాగకూడదు.' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అయితే రేపటి(డిసెంబర్ 8) భారత్ బంద్‌కు మాత్రం తాము మద్దతునివ్వట్లేదని ప్రకటించి మమతా ట్విస్ట్ ఇచ్చారు.

బీజేపీపై పదునైన విమర్శలు...
'వెస్ట్ మిడ్నాపూర్ ఎమ్మెల్యేలంతా ఇవాళ ఇక్కడ హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేస్తున్నవారికి నేనొక్కటే చెప్పదలుచుకున్నా... మా పార్టీ అత్యంత నిజాయితీ కలిగినది. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డబ్బు సంచులతో ఆ ప్రభుత్వాలను కూల్చాలని చూసే బీజేపీ తరహా పార్టీ మాదు కాదు.' అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కాషాయ పార్టీకకి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయేది లేదన్నారు.

బీజేపీ కార్యకర్తల్లా వామపక్ష గూండాలు... : మమతా
అవినీతి నేతలే బీజేపీతో చేతులు కలుపుతున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. సీపీఐ(ఎం) గూండాలు రాష్ట్రంలో బీజేపీకి కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. మమతా కేబినెట్ నుంచి ఇటీవలే మంత్రి సువెందు అధికారి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన త్వరలోనే బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. సువెందు అధికారి కుటుంబానికి వెస్ట్ మిడ్నాపూర్ కంచుకోట లాంటిదని చెప్తారు. అలాంటిది నేటి మమతా సభకు ఆ కుటుంబం మొత్తం డుమ్మా కొట్టింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ డబ్బు సంచులతో ప్రభుత్వాన్ని విచ్చినం చేసే కుట్రకు పాల్పడుతోందని మమతా ఆరోపించారు.