వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-పాకిస్తాన్ బోర్డర్లో తెలంగాణవాసి హల్‌చల్‌.. రంగంలోకి ఐబీ, రా, బీఎస్‌ఎఫ్‌ - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

వరంగల్‌ నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో స్థిరపడిన పరమేశ్వర్‌ అనే వ్యక్తి రాజస్తాన్‌లో సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌) జవాన్లకు చెమటలు పట్టించాడని 'సాక్షి' కథనం తెలిపింది.

''ఈ నెల 17న అక్కడి ఇండియా-పాకిస్తాన్‌ బోర్డర్‌లో హల్‌చల్‌ చేశాడు. ఫెన్సింగ్‌ దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిడానికి ప్రయత్నించాడు. పరమేశ్వర్‌ ఆహార్యాన్ని చూసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. వివిధ విభాగాలు ఉమ్మడిగా చేసిన ఇంటరాగేషన్‌లో ఆ కోణం బయటపడకపోవడంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు.

గురువారం అక్కడకు చేరుకున్న సోదరుడు, బావమదిరి తదితరులకు రాజస్తాన్‌ పోలీసులు పరమేశ్వర్‌ను అప్పగించారు. వరంగల్‌లోని ఖానాపూర్‌కు చెందిన వెంకట నర్సింహ్మ కుమారుడు ఎన్‌.పరమేశ్వర్‌ వయస్సు ప్రస్తుతం 46 ఏళ్లు.

భార్యకుమారులు కలిగిన ఇతగాడు కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి డైమండ్‌ పాయింట్‌ సమీపంలో నివసిస్తున్నాడు. అయితే కుటుంబ కారణాలతో పాటు ఐదేళ్ల క్రితం తన తల్లి కూడా చనిపోవడంతో పరమేశ్వర్‌కు మతిస్థిమితం తప్పింది.

అప్పుడప్పుడు వింతగా ప్రవర్తించే అతగాడు ఓ దశలో తన భార్య, పిల్లల పైనే దాడి చేయడానికి ప్రయత్నించాడు.

ఈ విషయం గమనించిన డైమండ్‌ పాయింట్‌ ప్రాంతానికి చెందిన స్థానికులు పరమేశ్వర్‌ను మందలించారు.

దీంతో అప్పటి నుంచి ఇంటిని, కుటుంబాన్నీ ఇతగాడు వదిలేశాడు. కొన్నాళ్లు వేర్వేరు ప్రాంతాల్లోని తన బంధువుల ఇళ్లల్లో తలదాచుకున్నాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి కనిపించిన రైలు ఎక్కడం, అది ఎక్కడకు వెళితే అక్కడ దిగి ఆ ప్రాంతంలో ఉన్న పరిచయస్తులు, బంధువుల ఇళ్లకు వెళ్తుండేవాడు. ఆపై ఇతడి ఆచూకీ కుటుంబీకులకు కూడా తెలియలేదు.

హఠాత్తుగా గురువారం పరమేశ్వర్‌ రాజస్తాన్‌లో ప్రత్యక్షం అయ్యాడు. అక్కడి జైసల్మీర్‌ ప్రాంతంలోని పోచ్ఛా ప్రాంతంలో ఉన్న ఇండో-పాక్‌ బోర్డర్‌కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఫెన్సింగ్‌ దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు.

ఆ ఫెన్సింగ్‌కు ఉన్న ఖాళీ సీసాలు శబ్ధం చేయడంతో అక్కడి పహారా విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్‌ 56వ బెటాలియన్‌ జవాన్లు గుర్తించారు. గడ్డంతో పాటు పరమేశ్వర్‌ ఆహార్యం చూసిన జవాన్లు ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ ప్రాంతంలో జిన్‌జిన్యాలీ పోలీసుస్టేషన్‌ పరిధిలోకి రావడంతో ఆ ఠాణాకు తరలించారు. పరమేశ్వర్‌ను రాజస్తాన్‌ పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు.

తాను హైదరాబాద్‌ నుంచి వచ్చానని, తన స్వస్థలం ఖానాపూర్‌ అని వారితో చెప్పిన పరమేశ్వర్‌ తన తండ్రి, సోదరుల వివరాలు వెల్లడించాడు. దీంతో జిన్‌జిన్యాలీ అధికారులు ఖానాపూర్‌ పోలీసుల ద్వారా పరమేశ్వర్‌ సోదరుడు పుల్లయ్యకు సమాచారం ఇచ్చారు.

ఇతడితో పాటు పరమేశ్వర్‌ బావ అనిల్‌ తదితరులు గురువారం జిన్‌జిన్యాలీ ప్రాంతానికి చేరుకున్నారు. పరమేశ్వర్‌ తమ సంబంధీకుడే అని నిరూపించడానికి అవసరమైన పత్రాలు సమర్పించాడు.

అప్పటికే ఐబీ, రా సహా వివిధ ఏజెన్సీలో కూడిన బృందాల ఉమ్మడి ఇంటరాగేషన్‌లోనూ పరమేశ్వర్‌కు సంబంధించి ఎలాంటి అనుమానిత అంశాలు వెలుగులోకి రాలేదు. దీంతో అతడిని రాజస్తాన్‌ పోలీసులు కుటుంబీకులకు అప్పగించార''ని ఆ కథనంలో రాశారు.

మద్యం దుకాణం

ఆంధ్రప్రదేశ్‌లో ఇక అన్ని బ్రాండ్‌లూ దొరుకుతాయి.. మద్యం మాల్స్ ఏర్పాటు చేయనున్న జగన్ ప్రభుత్వం

ఏపీలో కొత్త మద్యం రూల్స్ రానున్నాయని.. 'వాక్ ఇన్ షాప్స్' పేరిట వీటిని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనుందని 'ఈనాడు' కథనం తెలిపింది.

''ఇవి ఉన్నత శ్రేణి మద్యం దుకాణాలు. రాష్ట్రంలో 50 నుంచి 100 వరకు ఇలాంటి మాల్స్ నెలకొల్పనున్నట్లు సమాచారం. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలలో వీటిని ఏర్పాటు చేస్తారు.

ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ వీటిని నిర్వహిస్తుంది. అందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 నూతన మద్యం విధానం ప్రకటించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి 2021 సెప్టెంబరు 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న దుకాణాల్లో కొన్ని బ్రాండ్లే ఉంటున్నాయి.

తాజాగా ఏర్పాటు చేయనున్న వాక్ ఇన్ షాప్స్‌లో అన్ని బ్రాండ్లూ ఉంచాలని ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ యోచిస్తోంది. ఇవి ఏర్పాటు చేసే ఉన్న మద్యం దుకాణాలను తొలగిస్తారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

'ఆకురౌడీ మంత్రైతే.. భాషలాగే పాలన'

''ఆకురౌడీ.. మంత్రి అయితే భాష, బాడీ లాంగ్వేజ్‌ మాత్రమే కాదు పాలన ఎలా ఉంటుందనే దానికి ఏపీ ప్రత్యక్ష నిదర్శనం'' అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ 'ఆంధ్రజ్యోతి' వార్తాకథనం రాసింది.

''విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో శుక్రవారం జరిగిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సత్యకుమార్‌ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఓ మంత్రి దేవునిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంటే సీఎం జగన్‌ కనీసం నోరు తెరవడం లేదని, ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందన్నారు.

తిరుమలలో డిక్లరేషన్‌ గురించి మొదట మాట్లాడింది టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డేనని, ప్రభుత్వ జీవోను ముఖ్యమంత్రే పాటించకపోతే సామాన్యులకు ఏం చెబుతారని నిలదీశారు.

పాలనతోపాటు ప్రజా సమస్యలపై స్పష్టతలేని జగన్‌, పొరుగు రాష్ట్రాల్లోనేగాక విదేశాల్లో నియమించుకున్న అంతర్జాతీయ సలహాదారులతో అయి నా చర్చించి పాలన సాగించాలన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో చేపడుతున్న కార్యక్రమాలకు సీఎం జగన్‌ తన పేరు, తన తండ్రి పేరు పెడుతున్నారని.. ఏకంగా కొవిడ్‌-19 పాస్‌పై కూడా వైఎస్సార్‌ అని ముద్రించడం పరాకాష్ఠకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.

ప్రధాని మోదీపై తన కేబినెట్‌ మంత్రితో విమర్శలు చేయించి, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటే ఆశ్చర్యకరంగా ఉందని దుయ్యబట్టార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

రాస్తారోకో

రైతుల ఆగ్రహం

పార్లమెంట్‌ ఇటీవల 'ఆమోదించిన' వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జాతీయ రహదారుల దిగ్బంధం, రైల్‌ రోకోలతో రైతులు హోరెత్తించారని 'నమస్తే తెలంగాణ' కథనం రాసింది.

''బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. పంజాబ్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో బంద్‌ ప్రభావం కనిపించింది.

పంజాబ్‌లోని ముప్పైకి పైగా రైతు సంఘాలు శుక్రవారంనాడు ప్రత్యేక పంజాబ్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో రైతులకు మద్దతుగా వ్యాపారులు దుకాణాలు మూసివేశారు.

హరియాణాలో రైతులు దిల్లీవైపు ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్ల ర్యాలీని తీయడంతో పోలీసులు అడ్డుకున్నారు.

నిరసనకారులు ఒక ట్రాక్టరును దగ్ధం చేశారు. రైతుల నిరసనలతో నోయిడా, ఘజియాబాద్‌ రహదారులపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌తో పాటు 18 ప్రతిపక్షాలు, కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయ''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Man from Telangana creates tension at Indo-Pak border
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X