ప్రధాని మోడీకి అద్భుతమైన శక్తులున్నాయ్: ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంస
న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్ విజయం ఘనత ప్రధాని మోడీదే అంటూ థరూర్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన శక్తి, చైతన్యం కలిగిన వ్యక్తి.. రాజకీయంగా ఆకట్టుకునేలా కొన్ని పనులు చేశారంటూ థరూర్ కొనియాడారు. జైపూర్ సాహిత్య సదస్సులో పాల్గొన్న శశిథరూర్ మీడియాతో మాట్లాడారు.
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై శశిథరూర్ మట్లాడుతూ.. బీజేపీ ఇంత గొప్ప మెజారిటీతో గెలుస్తారని తాము ఊహించలేదన్నారు. కానీ, ప్రధాని మోడీ దాన్ని సాధ్యం చేశారని థరూర్ అన్నారు. నేడు ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టారని.. ఏదో ఒక రోజు వారు బీజేపీయే ఆశ్చర్యపోయేలా షాకిస్తారంటూ తనదైన శైలిలో స్పందించారు.
యూపీలో బీజేపీ విజయం సాధిస్తుందని కేవలం కొద్ది మందే అంచనా వేసినట్టు శశి థరూర్ పేర్కొన్నారు.

అయితే, బీజేపీ అంతటి మెజారిటీతో అధికారం సాధిస్తుందని ఎక్కువ మంది ప్రజలు అనుకోలేదన్నారు శశిథరూర్. అదే సమయంలో శశిథరూర్ ప్రధానిపై విమర్శలు కూడా ఎక్కు పెట్టారు. సమాజంలో ఆయన కొన్ని శక్తులను ప్రవేశపెట్టారు. మత, ప్రాంతీయ ప్రాతిపదికన జాతిని విభజించడమే వాటి పని.. అవి ఎప్పటికప్పుడు విషాన్ని ప్రజలకు ఎక్కిస్తున్నాయంటూ థరూర్ విమర్శించారు.
యూపీ ఎన్నికల ఫలితాలను చూసి తాను ఆశ్చర్యపోయానని, రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ విజయాన్ని చాలా తక్కువగా అంచనా వేశాయన్నారు. మరికొందరు సమాజ్ వాదీ పార్టీ ముందంజలో ఉంటుందని పేర్కొన్నాయని థరూర్ తెలిపారు. బీజేపీ ఇంత మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని చాలా మంది ఊహించలేదని.. సమాజ్వాదీ పార్టీ (ఎస్పి)కి కూడా సీట్లు పెరిగాయంటూ పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పనితీరుపైనా ఆయన స్పందించారు. ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ కోసం అవిశ్రాంతంగా ప్రచారం చేశారని, ఏదో ఒక కారణంతో తప్పుబట్టడం సరికాదన్నారు. గత 30 సంవత్సరాలుగా పార్టీ ఉనికి కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా తగ్గిపోతుందని.. అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించిన చాలా సమస్యలు అలానే ఉన్నాయన్నారు.