షాకింగ్: చెవిలో కాల్చుకున్న భర్త.. తలలోంచి వెళ్లి భార్య మెడలోకి దూసుకెళ్లిన బుల్లెట్!
గర్గావ్: సాధారణంగా సినిమాల్లోనే చోటు చేసుకునే ఘటనలు అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. అలాంటి ఘటనే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి(34) తుపాకీతో తన చెవిలో కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే, ఆ బుల్లెట్ అతని తలలోంచి అతని భార్య మెడలోకి దూసుకెళ్లింది.

హైదరాబాద్ నుంచి హర్యానకు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కొంత కాల క్రితం గురుగ్రాంలోకి రాంపురాలో అద్దెకు ఉంటున్నాడు. ఇప్పటికే అతనికి రెండు పెళ్లుళ్లు అయ్యాయి. 2017లో మొదటి భార్యకు దూరమైన అతను 2019లో మధురకు మకాం మార్చాడు. అక్కడ ఒక నిత్యావర వస్తువుల దుకాణంలో పనిచేస్తున్న మరో మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను వివాహం చేసుకున్నాడు.

కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు..
కాగా, గత కొంత కాలంగా ఏ పని లేకపోవడంతో ఇంట్లోనూ ఉంటున్నాడు. దీంతో ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి కావడంతో గురుగ్రాంలోని ఒక ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఉద్యోగ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

భర్త చెవిలోంచి.. భార్య మెడలోకి బుల్లెట్...
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భర్త కారులోని తుపాకీని తీసుకుని చెవిలో కాల్చుకున్నాడు. దీంతో తలలో నుంచి బయటకు వచ్చిన బుల్లెట్ పక్కనే ఉన్న భార్య మెడలోకి దూసుకెళ్లింది. కారులో ఇద్దరు రక్తమడుగులో ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులిద్దరినీ సఫ్ధర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు.

భర్త పరిస్థితి విషమం..
ప్రస్తుతం ఆ వ్యక్తి ఐసీయూలో విషమ పరిస్థితిలో ఉన్నాడని, అతని భార్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తుపాకీకి లైసెన్స్ ఉందా? లేదా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.