ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య, మంగళూరులో వాహనాలు, ఏటీఎం ధ్వంసం, లాఠీచార్జ్ !
మంగళూరు/బెంగళూరు: మంగళూరు సమీపంలో శనివారం ప్రత్యర్థులు దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైన ఆర్ఎస్ఎస్ నాయకుడు శరత్ మడివాళ చికిత్స విఫలమై శనివారం మరణించాడు. ఆర్ఎస్ఎస్ నాయకుడు శరత్ మరణించడంతో మంగళూరులో ఆందోళనలు మొదలైనాయి.
మంగళూరు పోలీసులతో పాటు కేఎస్ఆర్ పీతో సహ అదనపు బలగాలను రంగంలోకి దింపినా పరిస్థితి విషమించింది. ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, శ్రీరామసేన, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చెయ్యిదాటడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

కత్తులతో దాడి చేసి
రెండు రోజుల క్రితం రాత్రి 9.30 గంటల సమయంలో లాండ్రీ షాప్ యజమాని, ఆర్ఎస్ఎస్ నాయకుడు శరత్ తన షాప్ లో ఉన్నాడు. అదే సమయంలో బైకుల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా శరత్ మీద దాడి చేశారు.

ఆసుపత్రిలో చేర్చిన ముస్లీం
శరత్ షాప్ పక్కన పండ్ల వ్యాపారం చేస్తున్న బాష అనే ఆయన శరత్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేసిన తరువాత శరత్ ను మంగళూరులోని ఆసుపత్రికి తరలించారు.

చికిత్స విఫలమై మృతి
శనివారం శరత్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వేలాది మంది ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, శ్రీరామసేన, బీజేపీ కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఊరేగింపులో
శరత్ అంతిమయాత్ర సందర్బంగా వేలాది మంది పోలీసులు రంగంలోకి దిగారు. అంతిమయాత్ర ఊరేగింపు సందర్బంగా ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, శ్రీరామసేన, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

వాహనాలు ధ్వంసం
పోలీసుల తీరుతో సహనం కోల్పోయిన ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, శ్రీరామసేన, బీజేపీ కార్యకర్తలు రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాల మీద రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. కార్యకర్తలను అదుపు చెయ్యడానికి పోలీసులు పదేపదే లాఠీ చార్జ్ చేశారు.

ఏటీఎం వదల్లేదు
పోలీసులు లాఠీ చార్జ్ చెయ్యడంతో ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, శ్రీరామసేన, బీజేపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి ఏటీఎం కేంద్రంపై దాడి చేసి యంత్రం ధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించారు.

పోలీసుల అదుపులో
పరిస్థితి చెయ్యి దాటడంతో పోలీసులు మంగళూరుకు చెందిన ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, శ్రీరామసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా మరింత అదనపు బలగాలను రంగంలోకి దించారు. మంగళూరుతో సహ కైకంబల ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.