Manipur elections: మొదటివిడతలో 53శాతం అభ్యర్థులు సంపన్నులే; 29కోట్లకు పైగా ఆస్తులతో టాప్ లో స్వతంత్ర అభ్యర్థి
మణిపూర్ లో ఎన్నికలకు హోరా హోరీగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు సాగుతుంది . మణిపూర్ తొలి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో దాదాపు 53 శాతం మంది కోటీశ్వరులు, 24 మంది అభ్యర్థులు (14 శాతం) ఐదు కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారని ఏడీఆర్ విశ్లేషణ పేర్కొంది. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ.2.51 కోట్లు గా విశ్లేషణ వెల్లడించింది.

మొత్తం 91 మంది (53 శాతం) ఆస్తుల విలువ రూ. కోటి పైమాటే
సెక్మాయ్ (SC) నియోజకవర్గంలో పోటీ చేస్తున్న NCP అభ్యర్థి నింగ్థౌజం పోపిలాల్ సింగ్ తన అఫిడవిట్లో ఆస్తులు శూన్యం అని ప్రకటించారు. మణిపూర్‌లో తొలి దశ ఎన్నికల్లో మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ADR ప్రకారం, తొంభై ఒక్క మంది (53 శాతం) ఆస్తుల విలువ రూ. 1 కోటి కంటే ఎక్కువ. సగానికి ఎక్కువ మందే సంపన్నులుగా ఉండటంతో ఈసారి ఎన్నికల పోరు సంపన్న వర్గాల మధ్య సాగుతుందని అంచనా.

మణిపూర్ ఎన్నికల్లో మొదటి విడతలో కోటీశ్వరులు .. టాప్ త్రీలో వీరే
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఫిబ్రవరి 18న విడుదల చేసిన నివేదిక ప్రకారం, స్వతంత్ర అభ్యర్థి, సపం నిషికాంత్ సింగ్, 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశలో పోటీ చేస్తున్న అత్యంత ధనవంతుడు. 29 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో సింగ్ ప్రకటించారు.
ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కీసామ్థాంగ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.మణిపూర్ ఎన్నికల మొదటి దశ ఎన్నికల్లో జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థి ఖోంబోంగ్మయూమ్ సురేష్ సింగ్ రెండో అత్యంత ధనవంతుడు.
ఇంఫాల్ వెస్ట్‌లోని ఉరిపోక్ నియోజకవర్గం అభ్యర్థికి రూ.18.95 కోట్ల ఆస్తులున్నాయి. సంపన్న అభ్యర్థుల జాబితాలో మూడవ స్థానంలో మరొక స్వతంత్ర అభ్యర్థి సేపు హాకిప్ ఉన్నారు. 18.65 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. చురాచంద్పూర్ జిల్లాలోని హెంగ్లెప్ నియోజకవర్గం నుంచి హాకిప్ పోటీ చేస్తున్నారు.

పార్టీల వారీగా డేటా ఇదే
నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థులు 27 మందిలో 21 మంది (78 శాతం) కోటీశ్వరులేనని నివేదిక వెల్లడించింది. బీజేపీకి చెందిన 38 మంది అభ్యర్థుల్లో 27 మంది (71 శాతం) కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు.తొలి దశలో పోటీ చేస్తున్న 35 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 18 మంది (51 శాతం) కోటీశ్వరులే. 28 మంది జెడి(యు) అభ్యర్థుల్లో సగం మంది కోటి రూపాయలకు పైగా ఆస్తులను ప్రకటించారు.

మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 28న
మణిపూర్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 28న జరగనుంది. ఇది 38 నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. 22 నియోజకవర్గాలతో రెండో దశ మార్చి 5న జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2017లో మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించిన నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఎన్పీఎఫ్ 10 స్థానాల్లో పోటీ చేస్తుంది.