వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్ లీటర్ రూ.250: డోర్ టు డోర్ క్యాంపెయిన్ ముద్దు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో బ్లాక్ మార్కెట్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.250 పలుకుతోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో బ్లాక్ మార్కెట్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.250 పలుకుతోంది. యునైటెడ్ నాగా కౌన్సిల్ (యుఎన్‌సి) పిలుపు మేరకు రాష్ట్రంలో గత ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆర్థిక దిగ్బంధం కొనసాగుతున్నది. దీనివల్ల నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక మణిపూర్ వాసులు ఇబ్బందుల పాలవుతున్నారు.

వచ్చే నెలలో రెండు దశల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దిగాలంటే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి భయపడుతున్నాయి. దీనికి కారణం బ్లాక్ మార్కెట్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.200 - 250 పలుకుతుండటంతో ఏం చేయాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) రవాణా విమానాల ద్వారా 96 వేల లీటర్ల పెట్రోల్‌ను ఇంఫాల్‌కు చేర్చినా సమస్య తీవ్రతను తగ్గించలేకపోతోంది.

ఇక ఆయా పార్టీల అభ్యర్థులు కూడా తడిసి మోపెడవుతున్న ఎన్నికల వ్యయానికి జడిసి వాహనాలను పక్కనబెట్టేసి డోర్ టూ డోర్ క్యాంపెయిన్‌కు తెర తీశారు. మణిపూర్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును నిరసిస్తూ 'యుఎన్‌సి' చేపట్టిన 'దిగ్బంధం' ఆందోళనను విరమింపజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవీ పూనుకున్న దాఖలాలు లేవు.

ఆర్థిక దిగ్బంధం ఇలా...

ఆర్థిక దిగ్బంధం ఇలా...

సదర్ హిల్స్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు జిల్లాలుగా హోదా కల్పించడాన్నియుఎన్‌సి వ్యతిరేకిస్తోంది. దిమాపూర్ మీదుగా వెళ్లే రెండో నంబర్ జాతీయ రహదారి, జిరిబామ్ మీదుగా సాగే 37వ నంబర్ జాతీయ రహదారి మణిపూర్ రాష్ట్రానికి ప్రధాన జీవనాధారాలు. కానీ ఈ రెండు రహదారులను దిగ్బంధించడంతో తీవ్రస్థాయిలో నిత్యవసర వస్తువుల కొరత వెంటాడుతున్నది. పలు పెట్రోల్ పంపులకు పెట్రోల్ పంపిణీ నిలిపేశారు. కొద్దీ గొప్పా ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలను కూడా సదరు పెట్రోల్ బంకులు బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. మణిపూర్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు వచ్చేనెల నాలుగు, ఎనిమిది తేదీల్లో పోలింగ్ జరుగనున్నది.

మెజారిటీ ప్రజలు ఇంపాల్ వ్యాలీలోనే..

మెజారిటీ ప్రజలు ఇంపాల్ వ్యాలీలోనే..

మణిపూర్ రాష్ట్ర జనాభాలో 65% మంది ఇంఫాల్ వ్యాలీలోనే జీవిస్తున్నారు. గిరిజనేతర మీటీలదే ఆధిపత్యం. మిగతా 35 శాతం ప్రజల్లో నాగా, కుకి జూమీ జాతుల వారు ఉంటారు. గిరిజనుల్లో 90 శాతం మంది కొండ ప్రాంత పల్లెల్లో జీవనం సాగిస్తున్నారు. కొండ ప్రాంతాల్లోని గిరిజన గ్రూపులకు అసెంబ్లీలో మూడో వంతు ప్రాతినిధ్యమే లభిస్తోంది. దీంతో వారంతా తమకు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది కోసం యుఎన్‌సితో బిజెపి కుమ్మక్కైందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దిగ్బందం ద్వారా ఇబ్బందుల పాలవుతున్న ప్రజలను తప్పుదోవ పట్టించి లబ్ది పొందాలని చూస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. తదనుగుణంగానే బీజేపీ రాజకీయాలకు మతం రంగు పులుముతున్నదన్న కాంగ్రెస్ పార్టీ వాదనను కొట్టి పారేస్తుండటం గమనార్హం. మరోవైపు బీజేపీ కూడా ఇబోబిసింగ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా రాష్ట్రాన్ని జాతుల వారీగా విభజించేందుకు పూనుకున్నదని ఎదురు దాడికి దిగుతున్నది.

జిల్లాల ఏర్పాటు నుంచి వెనక్కు తగ్గితేనే...

జిల్లాల ఏర్పాటు నుంచి వెనక్కు తగ్గితేనే...

పూర్వీకుల కాలం నాటి తమ భూభాగంపై హక్కును వదులుకునే ప్రసక్తే లేదని యునైటెడ్ నాగా కౌన్సిల్ (యుఎన్‌సి) వాదిస్తోంది. దీనిపై తాము సంప్రదింపులకు సిద్ధంగా లేమని యుఎన్‌సి కార్యదర్శి ఎస్ మిలాన్ స్పష్టం చేశారు. నాగా ప్రజలను సంప్రదించకుండానే ఆ ప్రాంతాలను కొత్త జిల్లాలుగా విభజించిందని ఆయన ప్రధాన ఆరోపణ. తమ పూర్వీకుల భూములను ప్రభుత్వం ఏకపక్షంగా విభజించినందుకు నిరసనగానే తాము ఆర్థిక దిగ్బంధానికి దిగామని ఆయన చెప్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటును తిప్పికొట్టడమే తమ ప్రధాన డిమాండ్ అని, ఆర్థిక దిగ్బంధం ఎత్తివేయడం అంత సులభమేమీ కాదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు నాగా ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన అభ్యర్థించారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దన్నారు. నాగా ప్రాంత ప్రజలతో చేసుకున్నఒప్పందాల స్ఫూర్తిని కాపాడాల్సి ఉంటుందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకుంటేనే రాజీ తప్ప మరో మార్గమేమీ లేదని తేల్చి చెప్పారు.

ఇబోబిసింగ్ ఓటమికి బీజేపీ విశ్వయత్నాలు..

ఇబోబిసింగ్ ఓటమికి బీజేపీ విశ్వయత్నాలు..

నాలుగోసారి విజయం కోసం తహతహలాడుతున్న సీఎం ఇబోబీసింగ్‌పై ఆయన పోటీచేస్తున్న తౌబాల్ స్థానం నుంచి సామాజిక కార్యకర్త ఇరోమ్ షర్మిల ప్రత్యర్థిగా తలపడుతున్నారు. దీన్ని తనకు అనువుగా మార్చుకునేందుకు బిజెపి శతవిధాల ప్రయత్నిస్తున్నదని తెలుస్తున్నది. దాదాపు 27 ఏళ్ల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన షర్మిల ఇటేవలే ఆందోళన విరమించారు. తన మద్దతుదారులతో కలిసి సైకిళ్లపై ప్రచారంచేస్తున్నారు. ఇబోబిసింగ్ ప్రత్యర్థిగా పోటీచేస్తున్న ఆమె ప్రచారానికి అయ్యే ఖర్చు భరించేందుకు సిద్ధమని బిజెపి ప్రతిపాదనలు పంపింది. తద్వారా ఇబోబిసింగ్ ప్రభుత్వాన్ని సాగనంపాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. తన ప్రచారానికి రూ.36 కోట్లు ఇచ్చేందుకు బిజెపి ముందుకు వచ్చిందని స్వయంగా ఇరోమ్ షర్మిల ప్రకటించడం గమనార్హం. దీనిపై విచారణ జరిపించాలని ఎన్నికల సంఘానికి అధికార కాంగ్రెస్ పార్టీ విజ్నప్తి చేయడం గమనార్హం.

English summary
Petrol is being sold in black market in poll-bound Manipur at Rs 200-250 per litre. The oil prices have affected electioneering in the northeastern state that is going to polls in two phases next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X