ఎన్నికల ముందు మణిపూర్లో పేలుడు: ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ భారీ పేలుడు కలకలం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు పేలుడు సంభవించింది. శనివారం రాత్రి చురాచాంద్పూర్ జిల్లాలోని గంగ్సిమౌల్ గ్రామంలో ఓ ఇంట్లో ఈ పేలుడు జరగడంతో ఇద్దరు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది.
ఘటనలో గాయపడినవారిని జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పేలుడికి మోర్టార్ కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.పేలుడు సంభవించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పేలుడుకి బాధ్యులైన వారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

జనవరి 8న కేంద్ర ఎన్నికల సంఘం మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల లేదీలను ప్రకటించిన తర్వాత.. శనివారం రాత్రి జరిగిన బాంబు పేలుడే హింసాత్మక ఘటన కావడం గమనార్హం. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీకి ఫిబ్రవరి 28న, మార్చి 5న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
కాగా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉండనుందని ఇటీవల వెల్లడించిన ఓపినియన్ పోల్స్ వెల్లడించాయి. మార్చి 10న అసలైన ఫలితాలు రానున్నాయి.