వెంటనే పూర్తిగా బలగాలను ఉపసంహరించుకోవాలి: చైనాకు తేల్చి చెప్పిన భారత్
న్యూఢిల్లీ/బీజింగ్: సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చిందని విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ తమ చైనా కౌంటర్‌పార్ట్స్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి..
వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సమావేశాల్లో రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్‌లు డ్రాగన్ దేశానికి తేల్చి చెప్పారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 10న చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో జైశంకర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. కాగా, అంతకుముందు సెప్టెంబర్ 4న రక్షణశాఖ మంత్రి రాజన్‌నాథ్ సింగ్ మాస్కోలు చైనా రక్షణ మంత్రితో సమావేశమైన విషయం తెలిసిందే.

సరిహద్దులో శాంతి నెలకొనాలి..
ఈ రెండు భేటీల్లోనూ వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు పక్షాల బలగాలను వెంటనే పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు చైనా ముందుకు రావాలని భారత్ కోరింది. రెండు దేశాలు కూడా బలగాలను ఉపసంహరించుకుని సరిహద్దులో శాంతి పరిస్థితులను నెలకొల్పాలని భారత్ స్పష్టం చేసింది. అంతేగాక, ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉండాలని, స్టేటస్ కోను మార్చేందుకు ప్రయత్నాలు మానుకోవాలని తేల్చి చెప్పింది.

చైనాకు గట్టి హెచ్చరిక..
కాగా, సెప్టెంబర్ 15న రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో చైనాతో సరిహద్దు పరిస్థితులపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చైనాతో శాంతి చర్చలు జరిపేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. దౌత్య, సైనిక మార్గాలు ఏవైనా ఇందుకు సిద్ధమని చెప్పారు. భారత్ శాంతి చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తుంటే.. చైనా మాత్రం కవ్వింపు చర్యలు ఆపడం లేదని మండిపడ్డారు. చైనాకు ఎప్పటికప్పుడు భారత సైన్యం ధీటుగా జవాబిస్తోందని తెలిపారు. భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే ఏ చర్యను ఉపేక్షించేది లేదని చైనాకు గట్టి హెచ్చరిక చేశారు. కాగా, ఇండియన్ ఆర్మీ నార్తెర్న్ కమాండ్ కూడా చైనాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. చైనా కవ్వింపు చర్యలకు దిగితే ఊహించని విధంగా దెబ్బతింటుందని స్పష్టం చేశారు. యుద్ధానికి దిగితే చైనాకు ఘోర పరాజయం తప్పదని హెచ్చరించారు.