వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా ట్రయల్స్: నిబంధనలు ఉన్నా కూడా టీవీ ఛానెళ్లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మీడియా ట్రయల్స్

టీవీ ఛానెల్స్‌లో జరుగుతున్న మీడియా ట్రయల్స్‌పై భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇటీవల ఆందోళన వ్యక్తంచేశారు. చాలా పెండింగ్ కేసులపై మీడియా చేస్తున్న వ్యాఖ్యలు కోర్టు ధిక్కారణ కిందకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

''పెండింగ్ కేసులపై ఇటీవల కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు నిస్సంకోచంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. న్యాయమూర్తులతోపాటు ప్రజల ఆలోచనా విధానాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది దేశానికి మంచికాదు''అని సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్ వ్యాఖ్యానించారు.

సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కారణ కేసును జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణమురారీ విచారిస్తున్న సమయంలో కేకే వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

''కేసుల విచారణ జరుగుతున్న సమయంలో.. నిందితుల సంభాషణలను ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. దీంతో నిందితులు ఇబ్బందుల్లో పడే అవకాశముంది''అని వేణుగోపాల్ అన్నారు.

ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి కేసులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలను చేసినట్లు భావిస్తున్నారు. ఈ కేసులు విచారణ జరుగుతున్న సమయంలో చాలా టీవీ ఛానెళ్లు సుశాంత్, రియాల వాట్సాప్ సంభాషణలపై వార్తలు ప్రసారం చేశాయి.

మరోవైపు తన సంభాషణలో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం గురించీ ఆయన ప్రస్తావించారు.

''రఫేల్ వివాదానికి సంబంధించిన కేసు విచారణ సమయంలోనే ఓ పత్రిక ఒక కథనం ప్రచురించింది. కేసుకు సంబంధించి కొన్ని కీలకపత్రాల్లోని వివరాలను అందులో ప్రస్తావించారు. ఇలాంటివి జరగకూడదు''అని ఆయన అన్నారు.

అయితే ఆయన వాదనతో సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధవన్ విభేదించారు. వీటి ఆధారంగా మీడియాపై నియంత్రణ విధించకూడదని అన్నారు. కొన్ని విదేశీ కోర్టుల కేసులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

మరోవైపు కోర్టులో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలపై చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఆయనే అత్యున్నత న్యాయాధికారి. ప్రభుత్వానికి ఆయన ప్రతినిధి. ఆయన ఏమైనా చెబితే ప్రభుత్వం చెప్పినట్లే. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసింది? అని చర్చ జరుగుతోంది. మీడియా నియంత్రణకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ కొన్ని మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించింది.

నిబంధనలు ఉన్నప్పటికీ టీవీ ఛానెళ్లపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కోర్టులో ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తోంది? అనే అంశంపై నేడు చర్చ జరుగుతోంది.

ముందు అసలు ప్రభుత్వం ఏం చేయగలదు? ఎలాంటి అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయి? లాంటి అంశాలను మనం తెలుసుకోవాలి.

టీవీ ఛానెళ్లకు లైసెన్సులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని సుప్రీం కోర్టు న్యాయవాది విరాగ్ గుప్తా చెప్పారు. మీడియా నియంత్రణకు కొన్ని చట్టాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.

అయితే, తాము తీసుకోవాల్సిన చర్యలను తీసుకోకుండా నిస్సహాయతను కేంద్రం వ్యక్తం చేస్తోందని మీడియా విశ్లేషకులు ముఖేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

మరోవైపు కొన్ని ఛానెళ్లు మీడియా ట్రయల్స్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి రాజకీయ ఎజెండాలే కారణమని జర్నలిస్టు మనీష్ పాండే వ్యాఖ్యానించారు.

చాలా కోణాలున్నాయి..

అయితే, కోర్టుల్లో కేసులు విచారణకు సంబంధించిన వార్తలు రాసేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని విరాగ్ గుప్తా వ్యాఖ్యానించారు.

''మొదట ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండేటప్పుడు.. ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కేసును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే.. కోర్టు అంశాల్లో జోక్యం చేసుకున్నట్లే''

పెండింగ్ కేసుల్లో మీడియా జోక్యంపై ఇప్పటికే పలుమార్లు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. మీడియా కవరేజీ వల్ల విచారణ ప్రభావితం అవుతుందని భావిస్తే.. తాత్కాలికంగా కవరేజీపై నియంత్రణ విధించొచ్చని 2012లో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

మొదటగా మీడియా స్వేచ్ఛ కోసం భారత్‌లో ప్రత్యేక చట్టాలేమీ లేవు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, భావ ప్రకటన స్వేచ్ఛ కింద సామాన్య పౌరులకు ఉండే హక్కులే మీడియాకు ఉంటాయి. అయితే ఈ నిబంధన కింద సహేతుకమైన ఆంక్షలు విధించొచ్చు.

కోర్టు ధిక్కారణ చర్యలను కూడా ఇలా సహేతుకమైన ఆంక్షల రూపంలో విధించొచ్చు.

ఇక రెండో విషయం ఏమిటంటే.. నిందితుడు ఇంకా నిందితుడే. అతడు ఇంకా దోషిగా నిరూపితం కాలేదు. మూడోది బాధితుల అంశాలనూ పరిగణలోకి తీసుకోవాలి. నాలుగో అంశం ఏమిటంటే.. క్రిమినల్ నేరాలు. వీటిలో విచారణ ఎలాంటి ప్రభావాలకూ లోనుకాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది.

సివిల్ కేసులు ఇద్దరు వ్యక్తుల మధ్య నమోదవుతుంటాయి. క్రిమినల్ కేసులు ప్రభుత్వాలు, నిందితుల మధ్య ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వమే. ఒకవేళ కేసు సీబీఐ పరిధిలో ఉంటే అక్కడ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది ఉంటుంది.

అందుకే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అందరికీ ఈ కేసులతో సంబంధం ఉంటుందని విరాగ్ గుప్తా వ్యాఖ్యానించారు.

''ప్రభుత్వం ఈ విషయంలో కాస్త ఉదాసీనతతో వ్యవహరిస్తోంది. మరోవైపు న్యాయ వ్యవస్థ కూడా నిస్సహాయంగా ఉంటోంది. నిబంధనలు ఎప్పటికీ నిబంధనల్లానే ఉండిపోతున్నాయి. ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు పెరుగుతూనే ఉన్నాయి''అని ముఖేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

మీడియాను నిరంతం పర్యవేక్షిస్తూ, నియంత్రణలు విధించే ఒక సంస్థ ఉండాలనే అభిప్రాయాలు ఎప్పటినుంచో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే భారత్‌లో 350 నుంచి 400వరకు న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. వీటిపై రోజంతా నిఘా పెడుతూ, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనికాదు.

అందుకే స్వతంత్రంగా పనిచేసే ఒక సంస్థను ఏర్పాటుచేయాలని ఎప్పటినుంచో డిమాండ్లు వస్తున్నాయి. చర్యలు తీసుకొనే అధికారముండే ఒక సంస్థను ఏర్పాటు చేయకపోతే.. ఇలాంటి కేసులను నియంత్రించడం ఇటు ప్రభుత్వానికి, అటు న్యాయ వ్యవస్థకు పెద్ద సవాల్‌ అవుతుందని ముఖేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

టీవీల విషయంలో ప్రస్తుతం ఎలాంటి పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థాలేదు. చాలా వరకు టీవీ ఛానెళ్లు స్వీయ నియంత్రణ వ్యవస్థలకు కట్టుబడి ఉన్నాయి.

స్వేచ్ఛగా పనిచేసే మీడియా.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటిదని చెబుతుంటారు. మీడియా నియంత్రణకు స్వతంత్రంగా పనిచేసే సంస్థల ఏర్పాటును సరైన చర్యగానే విదేశాలు భావిస్తుంటాయి. అయితే నిష్పాక్షికంగా ఉండేందుకు స్వీయ నియంత్రణ బాటలోనే మీడియా అడుగులు వేయాలి.

ఇప్పటివరకు చాలా మీడియా ఛానెళ్లు ఈ బాటలోనే నడుస్తున్నాయి. జర్నలిజానికి సంబంధించి ద న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండార్డ్స్ అథారిటీ (ఎన్‌బీఎస్‌ఏ) ప్రమాణాలను నిర్దేశిస్తుంది. దీనిలోని సభ్యత్వమున్న సంస్థలపై వచ్చే ఫిర్యాదులను ఎన్‌బీఎస్‌ఏనే విచారిస్తుంది. ప్రింట్ మీడియా నియంత్రణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది.

మీడియా ట్రయల్స్

చర్యలు తీసుకున్నా కష్టమే

మీడియాను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే.. మీడియా భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా అణచివేత తదితర ఆరోపణలు వస్తాయి.

అయితే, ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వం కింద విభాగాల్లా పనిచేస్తున్నాయని ముఖేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. కొన్ని ఛానెళ్ల వల్ల ప్రభుత్వానికి కూడా లబ్ధి చేకూరుతోందని అన్నారు.

''ఈ సంక్షోభం ప్రభుత్వానిదో లేదా కోర్టులదో లేదా మీడియాదో కాదు. ప్రజలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఎలా తప్పుదారి పడుతున్నాయో ఈ చర్చలను చూస్తే అర్థమవుతుంది''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Govt is not taking action against the news channels for violating regulations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X