• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీటింగ్ వివాదం: ప్రధాని నరేంద్ర మోదీ సమావేశానికి మమత ఎందుకు హాజరుకాలేదు? గతంలో మోదీ ఇలానే చేశారా?

By BBC News తెలుగు
|

మమతా బెనర్జీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆలస్యంగా వచ్చి, పత్రాలు ఇచ్చి వెంటనే వెళ్లిపోయారనే ఆరోపణలపై వివాదం రాజుకుంది.

వివాదం అనంతరం పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్‌ను కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్‌పై వెనక్కి పిలిపించింది. కొన్ని రోజుల క్రితమే అలపన్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కేంద్రం ఈ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని, ఇవి ప్రతీకార రాజకీయాలని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో మమత కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తనతో చెప్పాయని పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్ మణి తివారీ చెప్పారు.

మరోవైపు ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘిస్తూ ప్రధాన మంత్రిని మమతా బెనర్జీ అవమానిస్తున్నారని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఆరోపణలను మమత ఖండించారు.

మమత ఏం చెప్పారు?

ఈ వివాదంపై శనివారం మమత విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ''అది ప్రధాని, ముఖ్యమంత్రి మధ్య సమీక్షా సమావేశమని మొదట చెప్పారు. దీంతో కళైకుండ పర్యటనను నేను రద్దు చేసుకున్నాను’’.

''కానీ, తర్వాత గవర్నర్, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకుడి పేర్లను కూడా సమావేశానికి హాజరయ్యే వారి పేర్లలో చేర్చారు. అది ప్రధాని, సీఎంల మధ్య సమావేశం కాదు’’.

అయితే, మమత ఆరోపణల్లో నిజంలేదని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు శుభేందు అధికారి వ్యాఖ్యానించారు.

''ఒడిశా, పశ్చిమ బెంగాల్ సీఎంలను ఆహ్వానించేందుకు ఒకే విధానాన్ని అనుసరించారు. ఒడిశా సీఎం వచ్చారు కదా. ఆమె తప్పించుకునేందుకు సాకులు చెబుతున్నారు’’అని శుభేందు ఏఎన్ఐతో చెప్పారు.

''ఆమె ప్రతిపక్ష నాయకుడి వల్లే సమావేశానికి హాజరుకాలేదని విలేకరుల సమావేశంలో చెప్పారు. మమత ప్రతిపక్ష నాయకుణ్ని చులకనగా చూస్తున్నారు. ఆమె తనని తాను దేశం మొత్తానికే ముఖ్యమంత్రిగా భావిస్తున్నారు’’ అన్నారు.

చాలాసేపు ఎదురు చూశాను – మమత

''ప్రధాన మంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందని, కాసేపు వేచివుండాలని ఏటీసీ మాకు చెప్పింది. దీంతో సాగర్ దీవి నుంచి కళైకుండకు హెలికాప్టర్లో వస్తున్న నేను ల్యాండింగ్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది’’అని మమత చెప్పారు.

'’15 నిమిషాల తర్వాత నాకు ల్యాండింగ్‌కు అనుమతించారు. అయితే, అప్పటికే ప్రధాన మంత్రి వచ్చేశారు. వెంటనే ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. కానీ చాలాసేపు నిరీక్షణ తర్వాత, ఆయన్ను కలిసేందుకు అనుమతించారు’’.

''ప్రధాన మంత్రికి నేను నివేదిక సమర్పించాను. ఆయన అనుమతితోనే నేను దీఘాకు బయలుదేరాను. కానీ సాయంత్రం చూస్తే.. ఏవేవో వార్తలు మీడియాలో కనిపించాయి. ఇదంతా నన్ను చులకన చేసేందుకు ప్రధాన మంత్రి, హోం మంత్రి పన్నిన కుట్రే’’అని మమత వ్యాఖ్యానించారు.

చెప్పకుండా పిలిపించారు...

''మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వెంటనే రమ్మని పిలిపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ గొడవ పడాలనే చూస్తున్నాయి. ఎన్నికల్లో నేను ఘన విజయం సాధించిన తర్వాత కూడా.. గవర్నర్, ఇతర నాయకులు నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు’’అని మమత ఆరోపించారు.

''బీజేపీ ఓటమిని అంగీకరించలేకపోతోంది. ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలాంటి చర్యలకు దిగుతోంది’’ అన్నారు.

ఒక వైపు తుపాను, మరోవైపు కోవిడ్ నడుమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని దిల్లీకి పిలిపించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గందరగోళంలో పడేయాలని చూస్తున్నారని మమత ఆరోపించారు.

''డిప్యుటేషన్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వెనక్కి పిలిపిస్తూ జారీచేసిన ఆదేశాన్ని కేంద్రం రద్దు చేయాలి. ప్రతీకార రాజకీయాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బలిచేయొద్దు’’ అన్నారు.

ఎవరు ఏం చెబుతున్నారు?

ప్రధాని మోదీ చాలాసేపు ఎదురు చూశారని బీజేపీ చెబుతుంటే... తాను అనుమతి తీసుకున్నానని మమతా అంటున్నారు. రెండు వాదనల మధ్య వైరుధ్యం కనిపిస్తోంది.

పీఎం, సీఎంల మధ్య జరిగే సమావేశాల్లో ఇలాంటి పొరపాట్లు జరగడం చాలా అరుదు. ఇలాంటి సమావేశాల షెడ్యూల్‌లోని ప్రతి నిమిషాన్నీ పక్కాగా ప్లాన్ చేస్తారు.

అయితే, సమావేశానికి హాజరయ్యే అతిథుల జాబితాను చివర్లో మార్చేశారని మమత అంటున్నారు. ''అది పీఎం, సీఎంల మధ్య సమావేశం కాదు. అందుకే దానికి హాజరు కాకపోవడంపై వివాదం చేయడం ఎందుకు’’అని ఆమె అంటున్నారు.

''ఒకవేళ అది కేవలం పీఎం, సీఎంల మధ్య సమావేశం కాకపోతే... సీఎంలు హాజరుకాకపోవడం సాధారణమే. గతంలో సీఎంగా ఉన్నప్పుడు మోదీ కూడా ఇలానే చేశారు’’అని సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

అయితే, ఈ వివాదంపై కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు మమతను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

https://twitter.com/AmitShah/status/1398284064642060295

''ప్రజల సంరక్షణ కంటే తన మంకు పట్టుదలకే దీదీ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆమె ధోరణి ఎలాంటిదో ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది’’అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

https://twitter.com/JPNadda/status/1398260209122828296

''ప్రధాని మోదీ సమావేశానికి ఆమె హాజరుకాకపోవడం అంటే, సమాఖ్య, రాజ్యాంగ స్ఫూర్తుల గొంతు కోయడమే’’అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

మమత నిరసన తెలపాలని అనుకున్నారా?

''టీఎంసీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రతిపక్ష నాయకుడు శుభేందు అధికారిని ఆహ్వానించారని తెలియడంతో సమావేశానికి మమత వెళ్లలేదు’’అని సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్ చెప్పారు.

పత్రికా విలేకరుల సమావేశంలో ''ఇది పీఎం, సీఎంల మధ్య సమావేశం కాదు. గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకుల పేర్లను జాబితాలో చేర్చారు’’అని మమత అన్నారు. కానీ నేరుగా శుభేందు పేరును ప్రస్తావించలేదు.

ఈ సమావేశం జరిగిన రోజే.. ఒడిశా సీఎం, గవర్నర్‌లను ప్రధాని కలిశారు. అయితే, అక్కడి ప్రతిపక్ష నాయకుణ్ని పిలవకపోవడంపై మమత ప్రశ్నలు సంధించారు.

''ఒడిశా, గుజరాత్‌లలోనూ ఇలాంటి సమావేశాలు నిర్వహించారు. మరి అక్కడ ప్రతిపక్ష నాయకుల్ని ఎందుకు పిలవలేదు?’’అని మమత ప్రశ్నించారు.

https://twitter.com/SuvenduWB/status/1398255192508801027

అయితే, కావాలనే ఈ అంశంపై మమత రాజకీయాలు చేస్తున్నారని శుభేందు వ్యాఖ్యానించారు. ''ఇదివరకు కూడా వరదలు, తుపానుల సమయంలో ఎన్డీయే యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పీఎం సమావేశం అయ్యారు. కానీ దీదీలా ఎవరూ ప్రవర్తించలేదు’’అని ట్వీట్ చేశారు. ఇదివరకటి సమావేశాల చిత్రాలను ఆయన ట్వీట్ చేశారు.

''రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదు. మమత దీన్ని అర్థం చేసుకోవాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతపై శుభేందు పోటీచేసి గెలిచారు. ఇక్కడ రెండు వర్గాల మధ్య మాటల యుద్ధంతోపాటు ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటుచేసుకున్నాయి.

మోదీ కూడా అప్పట్లో హాజరుకాలేదు..

ప్రధాని మోదీని అవమానించేందుకే మమత ఈ సమావేశానికి హాజరుకాలేదని బీజేపీ విమర్శలు చేస్తోంది. అయితే, సీఎంగా ఉన్నప్పుడు మోదీ కూడా ఇలా చేశారు.

2013లో ముజఫర్‌నగర్ అల్లర్ల అనంతరం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ముఖ్యమంత్రులతో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ ఈ సమావేశానికి హాజరుకాలేదు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరో బీజేపీ సీఎం రమణ్ సింగ్ కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఆ సమయంలో ఇద్దరిపైనా విమర్శలు వెల్లువెత్తాయి.

విపత్తు సమయాల్లోనూ

ముంబయి ఉగ్రదాడి సమయంలోనూ మోదీ రాజకీయాలు చేసినట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.

భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడు, ఓబెరాయ్ హోటల్‌కు సమీపం నుంచి అప్పటి ప్రధాని మన్మోహన్ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని మోదీ విమర్శించారు.

''ప్రధాని నుంచి ప్రజలు ఎంతో ఆశిస్తారు. కానీ మన్మోహన్ ప్రసంగం నిరాశకు గురిచేసేలా ఉంది’’అని మోదీ వ్యాఖ్యానించారు.

మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, పలు రాష్ట్రాల సీఎంలతో భిన్న సందర్భాల్లో వివాదాలు తలెత్తాయి.

కేజ్రీవాల్‌తో ప్రధాని మోదీ

కేజ్రీవాల్ లైవ్ విషయంలో...

కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ ఏడాది ఏప్రిల్ 23న మోదీ సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగాన్ని లైవ్ ఇచ్చారు.

దీనిపై మోదీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ''ఇది మన సంప్రదాయాలు, ప్రోటోకాల్స్‌కు వ్యతిరేకం. ఇన్ హౌస్ మీటింగ్‌ను ముఖ్యమంత్రి లైవ్ ఇవ్వడం సరికాదు. మన విధానాలను మనం పాటించాలి’’అన్నారు.

మోదీ వ్యాఖ్యల విషయంలో కేజ్రీవాల్ కార్యాలయం స్పందించింది. ''సరే సర్. నా వైపు తప్పు జరిగింది. నన్ను క్షమించండి’’అని కేజ్రీవాల్ చెప్పారు.

https://twitter.com/HemantSorenJMM/status/1390362987995623428

హేమంత్ సోరెన్ విషయంలో...

మే 6న మోదీతో ఫోన్ కాల్ అనంతరం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఒక ట్వీట్ చేశారు. ''ఈ రోజు ప్రధాని మోదీతో మాట్లాడాను. అదేదో మన్ కీ బాత్ విన్నట్లు అనిపించింది. ప్రస్తుతం అనుసరించాల్సిన విధానాల గురించి ఆయన మాట్లాడితే బావుండేది’’అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ వ్యాఖ్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు చాలా మంది బీజేపీ నాయకులు సోరెన్‌ను విమర్శించారు.

గతంలో కూడా మోదీ, మమతల మధ్య వాగ్వాదం జరిగింది. మే 20న కరోనావ్యాప్తి కట్టడిపై ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమయ్యారు. అయితే, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను మోదీ మాట్లాడనివ్వలేదని మమత ఆరోపించారు.

మోదీ అధ్యక్షతన జరిగిన ఆ సమావేశాన్ని సూపర్ ఫ్లాప్ అని మమత వ్యాఖ్యానించారు. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులనే మాట్లాడేందుకు అనుమతించారని ఆమె ఆరోపించారు. మిగతా వారిని తోలు బొమ్మల్ని చేశారని అన్నారు.

ఎన్నికల ముందు నుంచే...

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ, బీజేపీ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకున్నారు.

ప్రజాస్వామ్యాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మోదీ అభీష్టం మేరకే ఎన్నికలు జరుగుతున్నాయని మమతా ఆరోపించగా... ''దీదీ..’’అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీఎంసీ నాయకులు హింసను ప్రేరేపిస్తున్నారని గవర్నర్ ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలను తృణమూల్ ఖండించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Meeting controversy: Why did Mamata not attend Prime Minister Narendra Modi's meeting? Has Modi done the same in the past?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X