ఇదెక్కడి విచిత్రం: మేఘాలయ ఎన్నికల ఓటింగ్‌లో త్రిపుర, గోవా.. ఆఖరికి అర్జెంటీనా కూడా?
మేఘాలయా: మేఘాలయ రాష్ట్రంలో ఈ నెల 27న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో త్రిపుర, గోవా, అర్జెంటీనా,ఇండోనేషియా,ఇటలీ, స్వీడన్‌లు ఓటు హక్కును వినియోగించబోతున్నాయి.
అదేంటి మేఘాలయలో ఎన్నికలైతే.. పక్క రాష్ట్రాలు, వేరే దేశాలు ఓటింగ్‌లో పాల్గొనడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా?.. అధికారులు కూడా ముందు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇంతకీ ఈ పేర్ల వెనుక ఉన్న కహానీ ఏంటో తెలుసా?..

ఆ ఊళ్లో అంతే..:
ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దులో మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలో ఉన్న 'ఉమ్నిహ్-తమర్ ఎలక' గ్రామంలోని పేర్లన్ని వింతే. మనం రెగ్యులర్‌గా వినే పేర్లకు ఏమాత్రం సంబంధం లేకుండా.. రాష్ట్రాల పేర్లు, దేశాల పేర్లు, అసలు అర్థమే లేని పేర్లు ఇక్కడ చాలామంది పెట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఓటర్ లిస్టును బయటకు తీయడంతో ఈ చిత్ర విచిత్రమైన పేర్లన్నీ బయటపడ్డాయి.

ఆ వింత పేర్లలో మచ్చుకు కొన్ని..:
త్రిపుర, గోవా, అర్జెంటీనా, స్వీడన్, బల్ల, పత్రిక, స్వెటర్, గ్లోబ్.. ఇవన్నీ అక్కడి ఓటర్ల పేర్లే. వీటన్నింటి కంటే చిత్రమైన పేరు కూడా మరొకటి ఉంది. 'స్వెటర్' అనే ఓ తల్లి తన బిడ్డకు ' ఐ హేవ్ బీన్ డెలివర్డ్' అన్న పేరు పెట్టింది.

గ్రామ సర్పంచ్ 'ప్రీమియర్ సింగ్'..:
ఆ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన 'ప్రీమియర్ సింగ్' కూడా మా ఊళ్లో పేర్లన్ని ఇలాగే ఉంటాయని చెబుతున్నాడు. లక్కీగా.. తన తండ్రి విద్యావంతుడు కావడంతో.. ఇప్పుడున్న తన స్థాయికి సరిపోయేలా ఆనాడే 'ప్రీమియర్ సింగ్' అని పేరు పెట్టాడని మురిసిపోతున్నాడు.

నిరక్షారస్యులు ఎక్కువ.. అందుకే:
ఎలకా గ్రామంలో ప్రస్తుతం 850మంది పురుష ఓటర్లు ఉండగా.. 916మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఎక్కువ మంది విద్యకు దూరంగా ఉండటం వల్లే ఇలాంటి అర్థం పర్థం లేని ఇంగ్లీష్ పేర్లన్నింటిని తమ పిల్లలకు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

ఎన్నికల్లో పోటికి నెహ్రూ.. కెన్నడీ..:
రాబోయే మేఘాలయ ఎన్నికల్లో 'నెహ్రూ సూటింగ్', 'నెహ్రూ సంగ్మా', 'ఫ్రాంకెన్ స్టీన్', 'కెన్నడీ' లాంటి ప్రముఖుల పేర్లున్న వ్యక్తులు కూడా పోటీ చేయబోతుండటం విశేషం. వీళ్ల సంగతిలా ఉంటే.. తెలిసో.. తెలియకో.. తమ పిల్లలకు అర్థం పర్థం లేని లేదా ఫన్నీ ఇంగ్లీష్ పదాలతో పెట్టిన పేర్లు ఇప్పుడు తమకు ఇబ్బందిగా మారాయని అక్కడివారే వాపోతున్నారు.