వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిడిల్ క్లాస్ మెలొడీస్: తెలుగు సినిమాకి ఇలాంటి ఆక్సిజన్ చాలా కావాలి - సినిమా రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఇరుగును చూసి పొరుగును చూసి మనకెందుకు రావు ఇలాంటి సినిమాలు అని బాధపడేవారికి ఉపశమనం ఇటీవల వస్తున్న చిన్న సినిమాలు. ఇపుడొచ్చిన మిడిల్ క్లాస్ మెలొడీస్ తెనాలి పంటకాల్వల నుంచి వీచే పైరగాలి లాంటి రిలీఫ్.

middle class

ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ, కేరాఫ్ కంచరపాలెం నుంచి మొన్నటి నిన్నమొన్నటి కలర్ ఫొటో, నేటి మిడిల్ క్లాస్ మెలొడీస్ దాకా తెలుగు సినిమాకు కొత్తతరం కొత్త రక్తమెక్కిస్తున్నారు. కంచరపాలెమే కాదు, పలాస, కొలకలూరు లాంటి ఊర్లు సినిమా కథలవుతున్నాయి. నిన్నమొన్నటిదాకా చిన్న సినిమాల వాళ్లకు మల్టీప్లెక్సులే పెద్ద దిక్కు. అందులో ప్లేస్ కోసం మళ్లీ పెద్దాళ్ల ప్రాపకం సంపాదించాలి. కోవిడ్‌తో థియేటర్లు మూతపడడం వీళ్లకు కలిసొచ్చింది. ఓటిటిలో అందరూ ఒక్కటే.

మిడిల్ క్లాస్ మెలోడీస్‌లో కథ అనేది అంత ప్రధానమైనది కాదు. ట్రీట్మెంటే కీలకం. సెన్సిబిల్ అండ్ నేచురల్. మంచి దర్శకులందరూ చేసే మాదిరే ఇందులోనూ అమ్మాయిల పాత్రను బలంగా చూపించారు. మొన్నొచ్చిన కలర్ ఫొటోలో కూడా అది గమనించొచ్చు. తెరమీద చూపించే మనుషులు, వాళ్ల కష్టాలు, ఉద్వేగాలు మనకు అతీతంగా ఉండవు. మనం చూసేవీ, అనుభవించినవీ. క్యాపిటలో బలమైన సోషల్ క్యాపిటలో లేనివాళ్లకు ఎదుగుదల అంత సులభంగా ఉండదు. కిందామీదా పడుతూ లేస్తూ నలుగుతూ కష్టాల్లో నానుతూ సాగుతుంది. ఆ జీవితాల్లో ఉండే పెనుగులాటను సహజంగా చూపించారు దర్శకులు వినోద్ అనంతోజు.

అలాగే గుంటూరంటే గుంటూరే- మాటా దృశ్యం అన్నీ. కొలకలూరు బొడ్రాయి దగ్గరో తెనాలి రైల్వేస్టేషన పక్కనో గుంటూరు జిన్నా టవర్ దగ్గరో నిలబడితే కనిపించే భాష, జీవితమూ. ఇదే సినిమా ఆత్మ. హీరో మాట్లాడే సికిందరాబాద్ పాట్నీ సెంటర్ భాష ఒక్కటే మినహాయింపు. అదే సినిమాలో పెద్దలోటు.

మొత్తం సినిమాలో పంటికింద రాయిలాగా తగుల్తా ఉంటది అది. స్థలాన్ని ఆత్మగా మార్చుకున్న సినిమాలో ప్రధాన పాత్రధారి భాష అసహజంగా ఉండడం అనేది ఒక ఇబ్బంది అయితే ఆ పాత్ర ధారి ఎంత బాగా చేసినా వారి స్టార్ సోదరుడి వాయిస్ దాన్ని కనపడనీయకుండా చేసే ప్రమాదం మరో ఇబ్బంది. ఇది హీరో ఓరియెంటెడ్ సినిమా కాకపోబట్టి సరిపోయింది కానీ లేకపోయి ఉంటే అది సినిమా సాధించిన ఇతరత్రా ప్రయోజనాల్ని మింగేసి ఉండేది.

అలాగే ఆ రెండో పాట, పదపదమని అంట సిగ్గే ఆపిందా అనే పాట పాడిన తీరు ఎలా ఉందంటే తన క్రైం సినిమాలకు వర్మ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చినట్టుంది. సాహిత్యానికి స్వరానికి సంధి కుదరలే. అదొదిలేస్తే ఇతరత్రా సంగీతం, పాటలవీ బానే ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అక్కడక్కడా ఉన్నా అవేమీ సినిమా బ్యూటీని మింగేయలేదు.

ఏదో గొప్ప మెసేజ్, ఎస్ఎంఎస్ వగైరాల కోసం చూసేవారు కొద్దిగా నిరాశపడొచ్చు. ఇది చాలా అండర్ కరెంట్ అండర్ టోన్‌తో డీల్ చేసిన సినిమా. తొలి షాట్ ఆవు పేడ వేయడంతో మొదలుపెట్టడంలోనే సగం మార్కులు కొట్టేశారు. షాపుల్లో దేవుళ్ల బొమ్మలు అవీ పెట్టేటప్పుడు మూడు మతాలవీ పెట్టిస్తుంటారు జాగ్రత్తగా. చెత్త కుప్ప దగ్గర దేవుని బొమ్మ పెట్టి అక్కడ మళ్లీ జనాలు చెత్త వేయకుండా చూసుకోవడమనే దాంట్లో మనం రోజూ చూసే చాలా దృశ్యాలను ఆవిష్కరించారు.

భూమి సరకుగా మారి చాలాకాలమే అయ్యింది కానీ దాని విలువ అధికారంలో ఉన్నవారి విధానాలతో పాటు వంకర్లు పోయే స్థితిని చూపించారు. మనుషులు దానితో ముడిపెట్టుకున్న ఆశల్ని దురాశల్ని చూపించారు. మన భవిష్యత్తు మనం చేసే పనుల వల్ల, చేయని పనుల వల్ల ఉంటుంది తప్పితే ముహూర్తాల మీదా జ్యోతిష్యాల మీదా ఆధారపడి ఉండదని సున్నితంగా నైపుణ్యంగా చెప్పారు. ఉపదేశాలిచ్చే పనికి పాల్పడలేదు.

మావా బావా అని పరస్పరం పిల్చుకునే పల్లెల్లో కోపాలు ప్రేమలు ఎంత పాలపొంగు మాదిరి ఉండగలవో చూపించారు. ఎంతెంత కోపాలొచ్చినా రేపు మొఖాలు చూసుకోవాల్సిన చిన్న ఏరియాలో బతికేవాళ్ల జీవితాలు పరస్పరం ఎలా ముడిపడి ఉంటాయో చూపించారు. పిల్లల్ని పాంపర్ చేసినా పొగిడినా పాడైపోతారనుకునే గంభీరమైన తల్లిదండ్రుల మనస్తత్వాన్ని చాలా బాగా పట్టుకున్నారు. అలాంటి తండ్రులు మన చుట్టుపక్కల ఎందరో.

భర్త భార్యకు కాళ్లు పట్టే సన్నివేశాన్ని రోమాంటిసైజ్ చేయకుండా మన ఇళ్లలో ఇలాంటివి ఎలా ఉండగలవో అంతే ఉంచారు. కొలతలు తూకాల్లో ఈ దర్శకుడు మాంచి పట్టు సాధించారు అని అర్థం అవుతుంది. పల్లెటూళ్ల నుంచి చిన్న పట్నాల నుంచి వచ్చిన చిన్న మధ్యతరగతి జీవులు తమను తాము చూసుకోగలిగే సినిమా.

విషయాల్ని సున్నితంగా డీల్ చేసినందుకు దర్శకున్ని అభినందించాలి. మళయాళ దర్శకుల్లో కనిపించే సటిల్ ఎలిమెంట్ను ఇతను సాధించారు. అదొక్కటే కాదు. థియేటర్ ఆర్టిస్టులతో అంత ఒదిగిపోయే నటనను రాబట్టి నందుకు కూడా అభినందించాలి. హీరో హీరోయిన్ సహా అందరూ బాగాచేసినట్టే చెప్పుకోవాలి. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులను చూస్తే చాలు వీళ్లు ధియేటర్ బ్యాక్ గ్రౌండ్ అని ముఖం మీద రాసినట్టే ఉంటారు. థియేటర్ సినిమాకు తల్లి లాంటిది. కాకపోతే స్టేజ్ గ్రామర్ వేరే, కెమెరా గ్రామర్ వేరే. తేడా చిన్నగానే కనిపిస్తుంది కానీ చిన్నదేమీ కాదు.

https://twitter.com/VarshaBollamma/status/1328674700851986437

చిన్నసినిమాల వాళ్లలో అనేకులు ఫెయిల్ అయ్యే రెండు ఏరియాలు ఉన్నాయి. ఒకటి క్యారక్టర్ ఆర్టిస్ట్స్ అయితే రెండు డైలాగుల్లేకుండా ఫ్రేముల్లో ఉండేవాళ్లు. ఎన్ని నాటకాలు చేసుకుంటే ఏం లాభం ఒక్క మంచి సినిమా కనక పడితే కదా మన తడాఖా. దశ తిరిగేది అపుడే కదా అని చాలామంది థియేటర్ ఆర్టిస్టులకు ఉంటుంది. సినిమాలో చాన్స్ వచ్చినపుడు కొంతమంది ప్రాణం పెట్టాలనుకుని పాత్రకు కొంచెం ఎక్కువో తక్కువో చేస్తారు. లౌడ్‌గా ఉండే ప్రయత్నం చేస్తారు కొందరు. స్టేజ్‌కి కెమెరాకు తేడా తెలుసుకోగలిగి బ్రేక్ వచ్చిన కొందరే సినిమా జీవులుగా మారిపోతారు.

ఇక ఆయా సీన్లలో డైలాగులు ఉండే నటులతో పాటు ఉండే ఇతర నటులది ఇంకో సమస్య. చేతులు ఎక్కడ పెట్టుకోవాలి, అభినయం ఎంత అవసరం లాంటి అంశాలుంటాయి. అనుభవమున్న వారిని తీసుకునేంత సీన్ చిన్న సినిమా వాళ్లకు ఉండదు కాబట్టి ఇక్కడ కాస్త దెబ్బతింటా ఉంటారు. యూనిట్ సమయం విలువైనది కాబట్టి చకాచకా టేకులు అయిపోవాలి. అందువల్ల కొన్ని చిన్న సినిమాలు చూస్తున్నపుడు చాలా సందర్భాల్లో అన్ ఫ్రొఫెషనల్ డాక్యుమెంటరీ చూసినట్టుగానో సీరియెల్ చూస్తున్నట్టుగానో ఉంటుంది. కొన్ని సీన్లు పండడం మరి కొన్ని సీన్లు ఎండడం ఇత్యాది విషయాల వల్ల ''ఫర్వాలేదోయ్, కొత్త కుర్రాడు బానే చేశాడు'' మాత్రం అనిపించుకోవడంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఆ దోషాల్ని చాలా వరకూ పరిహరించుకోగలిగారు.

సీరియెళ్ల మాదిరి సాగదీసినట్టు ఉండడమో, పదాల్ని ఎక్కడికక్కడ విరగ్గొట్టడమో లేకుండా అందరూ హాయిగా మాట్లాడడం ఇంకో రిలీఫ్. ఈ అన్ని ఏరియాల్లో ఈ దర్శకుడు అనంతోజు ఫుల్ మార్క్స్ కొట్టేశారు. ఇంతకుముందు అనేక ప్రామిసింగ్ చిన్న సినిమా ప్రయత్నాల్లో ఉన్న లోపాలు తన సినిమాలో సాధ్యమైనంత వరకూ లేకుండా చేసుకుకున్నారు. కాకపోతే అక్కడక్కడా బొంబాయి చట్నీ మరీ ఎక్కువ ఉడికినట్టయి సాగదీస్తున్నారు అనిపించినా ఆ ఫీలింగ్ ఎక్కువ సేపు లేకుండా మళ్లీ వేగం పుంజుకుంటుంది. మరీ క్లాసిక్ గొప్ప సినిమా అనక్కర్లేదు కానీ మంచి సినిమా, సెన్సిబిల్ సినిమా అనొచ్చు. తెలుగు సినిమాకు ఇవాళ ఇలాంటి ఆక్సిజన్ చాలా కావాలి.

(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telugu cinema needs movies like Middle class melodies
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X